ఆయన పాట పలకరిస్తుంది…. పరవశింపచేస్తుంది.
ఆయన పాట ప్రశ్నిస్తుంది…. బదులిస్తుంది. ఆయన పాట చిందేయిస్తుంది…. వేదన తీరుస్తుంది.
వెరసి అ పాట మనల్ని ఆలోచింప చేస్తుంది.
ఆయనే పాటల తోటన విరితావి ”సిరివెన్నెల”.
పాటల రచయితగా జన్మనిచ్చిన చిత్రాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి తన పాటలతో ఆబాల గోపాలాన్ని ఊయలలూగించి ఆశల ఊహల పల్లకీలో ఓలలాడించిన గొప్ప గేయ రచయిత. తన పదాలతో తెలుగు సాహిత్యానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చి.. తన పద ప్రయోగంతో తెలుగు సినిమా పాటలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన ప్రముఖ గేయ రచయిత.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తెలుగు భాషకు పర్యాయ పదం.. తెలుగుకి సజీవరూపం… సినిమా పాటలంటే మనకు చులకన… ఏవొ లల్లాయి పదాలనే చులకన భావం ఉన్న తరుణంలో పాటకు జవసత్వాలు అద్ది ప్రాణం పోసి పాటకు సాహిత్య హౌదా కలిగించి పాటకు పట్టాభిషేకం చేసిన ద్రష్ట సిరివెన్నెల.
”మంగళసూత్రం అంగడిసరుకా కొనగలవా చేజారాకా” అని ఒక్క మాటలో సూత్రం గొప్పతనం చెప్పినా..
”ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు” అని జీవిత పరమార్ధం వడపోసినా..
”ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమి ఎప్పుడు వదులుకో వద్దురా ఓరిమి” అని గెలుపు తలుపుకు దారి చూపినా..
”పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం” అని విడాకుల చట్టానికి ఎదురేగి తప్పుని ఎత్తి చూపినా.. అది సిరివెన్నెలకి మాత్రమే చెల్లింది .
వేటూరి సుందరరామ్మూర్తి తర్వాత ఆ స్థాయిలో తెలుగు పాటకు గౌరవం తీసుకొచ్చిన కవి ఈయన. అత్యంత సరళమైన పదాలతో వాడుక భాషలో సిరివెన్నెల రాసిన ఎన్నో వందల పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి.
మే 20 వ తేదిన ఆయన 70 వ జయంతి సందర్భంగా సోపతి పాటకుల కోసం అందిస్తున్న కథనం.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రి. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955వ సంవత్సరం మే 20న జన్మించారు. తండ్రి సీవీ యోగి వేదపండితుడు, తల్లి అమ్మాజి గహిణి. సీతారామశాస్త్రికి ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులు. అనకాపల్లిలోని మున్సిపల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన సీతారామశాస్త్రి కాకినాడలో ఇంటర్, బీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో ఎంఏ పూర్తిచేశారు. అనంతరం అనకాపల్లిలోని బీఎస్‌ఎన్‌ఎల్ శాఖలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక, దేశభక్తి గీతాలు రాయడం సీతారామశాస్త్రికి అలవాటు. అనేక కార్యక్రమాల్లో సైతం సొంతంగా పాటలు రాసి అలపించేవారు.
సినిమా పాటల రచయితగా
1984లో బాలకష్ణ హీరోగా వచ్చిన ”జననీ జన్మభూమి” సినిమాతో కెరీర్ ప్రారంభం అయింది. అందులో చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కానీ సీతారామశాస్త్రికి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ”సిరివెన్నెల”. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1985లో వచ్చిన ”సిరివెన్నెల” సినిమాలో సీతారామశాస్త్రి రాసిన తొలి పాట ”విధాత తలపున ప్రభవించినది”. ఆయన రాసిన ఈ మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టింది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారం రోజులు పట్టినట్లు సీతారామశాస్త్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ పాటతో పాటు ఆయన రాసిన ఈ సినిమాలోని పాటలు ఎంతగానో పాపులర్ అవ్వడంతో ఆ సినిమా పేరే ”సిరివెన్నెల” సీతారామశాస్త్రి ఇంటి పేరుగా మారింది. ”సిరివెన్నెల” సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామశాస్త్రికి కె.విశ్వనాథ్‌తో అన్ని సినిమాలలో పనిచేసే అవకాశం దక్కింది. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా ‘సీతారాముడు’ అని పిలిచేవాడు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగ గలరో దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞశాలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.
జీవనదీ ప్రవాహంలా సాగిపోయే పాటలు
సిరివెన్నెల జీవనదీ ప్రవాహంలా సాగిపోయే పాటలు రాసారు. ఆయన సినిమాలలో రాసిన కొన్ని పాటల్లో సాహిత్యం చాలావరకూ.. సామాన్య ప్రేక్షకులకి అర్థంకావు. కానీ, అర్థం తెలియకున్నా.. కవి చెప్పాలనుకున్న భావం మాత్రం శ్రోతల గుండెలదాకా చేరిపోయింది. ఎంతగా అంటే.. ‘ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైనా.. జాగత విహాంగ తతులే వినీల గగనపు వేదికపైన’ అంటూ.. పశువులకాపరి సైతం పొలంగట్లపై పిల్లనగ్రోవి ఊదుకుంటూ అవలీలగా పాడుకునేంతగా. వినగా వినగా వేప.. తీయగా నుండు అన్నట్టుగా.. సీతారామశాస్త్రి రాసిన కొన్ని సంస్కత పదపుష్టి గల పాటలూ జనాల నాలుకలపై పటిక బెల్లం ముక్కలా కరిగిపోయాయి. ఎంత పాండిత్యం ఉంటే ఏముంది? పామర భరితం కానప్పుడు.. అనుకోవడానికీ ఏమాత్రం తావులేకుండా.. అతిసామాన్య పదాలతో.. ప్రేక్షకుల్లో పల్లవించడమూ సిరివెన్నెలకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో! రుద్రవీణ చిత్రంలోని ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని.. కమ్ముకువచ్చే ఈ మాయనీ” అంటూ లోకం పోకడను.. వాడుక భాషలోనే చెప్పిన సిరివెన్నెల ఇదే సినిమాలో ”లలిత ప్రియ కమలం విరిసినదీ..” అంటూ ఫంక్తు రసాత్మక పదాలతోనూ తన బహుముఖీన సినిమా గీతాల పార్శ్వమేంటో చెప్పకనే చెప్పారు. సినిమా పాటకు హుషారు ఉండాలి. అందుకు తగ్గట్టుగానే సినిమాకు, సినిమాలోని సన్నివేశానికీ ఎంత హుషారు కావాలో.. అంతటి హుషారును సమపాళ్లలో రంగరించి, పాటలు రాయడం సిరివెన్నెల్లోని మరో ప్రత్యేకత. ”చిలకా.. ఏ తోడులేక.. ఎటేపమ్మ ఒంటరి నడకా..” అంటూనే ”కన్యాకుమారీ.. కనబడదా దారి.. కయ్యాలమారి.. పడతావే జారి” అంటూ చమత్కరిస్తాడు. ”బలపం పట్టి భామ బళ్లో .. అ..ఆ ఇ ఈ నేర్చుకుంటా..” అని అల్లరీ చేస్తాడు ‘సిరివెన్నెల’! ‘విరించినై విరచించితిని ఈ కవనం..విపంచినై వినిపించితిని ఈ గీతం’ అంటూ పాండిత్యపు సొబగులతో గాంభీర్యంగా ఎన్నో పాటల్ని రాసినాయనే.. ‘బోటనీ క్లాసు ఉంది.. మేటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా” అంటూ కాలేజ్ కుర్రకారును ఒక ఊపు ఊపేయడం ఎలా మర్చిపోగలం? బ్యాచిలర్ జీవితాన్ని వదులుకోవద్దు అని సుద్దులు చెప్పే ‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచిలరు” పాట నుంచీ.. ”చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతానంది మనీ మనీ..” అంటూ ‘కరెన్సీ’లో గల లోగుట్టును సరదాగా చెప్పే పాటైనా.. సీతారామశాస్త్రి మార్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ‘సిరివెన్నెల’ మాత్రం ఇప్పటికీ ”తెల్లారింది లెగండోరు.. కొక్కొరొక్కో..!” అంటూ కొత్తపలుకు కోసం చివరిదాకా అన్వేషిస్తూనే ఉండిపోయారు.
కమర్షియల్ బాణీలను అలవాటు చేసిన వంశీ
సిరివెన్నెల సీతారామ శాస్త్రి తదుపరి ప్రయాణానికీ ‘సిరివెన్నెల’ సినిమా చాలా దోహదం చేసింది. ‘రుద్రవీణ’, ‘స్వర్ణకమలం’ లాంటి సినిమాలు వెంట వెంటనే రావడంతో ఆయన ప్రయాణానికి ఓ స్థిరత్వం ఏర్పడింది. అయితే మెల్లిగా ఆయనకి ”సిరివెన్నెల” లాంటి చిత్రాలకు తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేసింది. సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెలలో కమర్షియల్‌గా రాస్తూ కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు. దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటుచేశారు వంశీ. అలా వచ్చిందే లేడీస్ టైలర్. ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందిని ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నారు. అదే ఈవెనింగ్ సిట్టింగ్స్. సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.
సమాజాన్ని దర్శించే పాటల రూపకర్త
సినిమా కవికి ఇంత ఆవేశమేమిటి? అనుకునేలా ఉంటాయి ‘సిరివెన్నెల’ రాసిన కొన్ని పాటలు. ఆవేశం రగిలించడమే కాదు, ఆ ఆవేశం వెనుకదాగిన బాధాతప్త హదయమూ సూటిగా వచ్చి, మన గుండెల్నీ తాకుతుంది. తొలిరోజుల్లో ‘గాయం’ సినిమా కోసం ”నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్ఛవాన్ని” అంటూ ఎంతో కోపంగా సమాజాన్ని ప్రశ్నించినా.. ‘మహాత్మ’ సినిమా కోసం ”కొంతమంది సొంతపేరు కాదురా.. గాంధీ.. ఊరికొక్క వీధిపేరు కాదురా గాంధీ” అని గాంధీతత్వాన్ని గుర్తుచేసినా.. ”పట్టుదల” చిత్రం కోసం ”ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి” అంటూ నిరుత్సాహాన్ని వీడమనే సందేశమిచ్చే ఆ పల్లవుల్లో కవిలోని సెగ, రగిలింపు స్పష్టంగా కనపడుతుంది. ఇలా సినిమా అవసరానికి తగ్గట్టు పాటలు రాయాల్సి వచ్చినా.. సమాజాన్ని దర్శించడం ఎప్పుడూ మానలేని, మానుకోని కవి ‘సిరివెన్నెల’.
‘ప్రతి పాటా పదిమంది మెప్పు పొందాలని ఆశించడం తప్పుకాదు కానీ అలా జరగడం సాధ్యం కాదు. రాసేటప్పుడు, ఈ పాట తప్పకుండా హిట్ అవుతుంది కాబట్టి గొప్పగా రాయాలి. ఈ పాట పురిట్లోనే సంధికొట్టి ఛస్తుంది కనుక దీనికి పెద్దగా శ్రమపడక్కర లేకుండా ఏదో గీకి పారెయ్యాలి. అని ఎవరూ అనుకోరు. ఆ పాట వీధినపడ్డ తర్వాత తెలుస్తుంది దాని బతుకేమిటో! కవి రాతతో పాటూ పాటకి దాని సొంత తలరాతా ఉంటుంది’ అంటూ తను రాసే సినిమా పాటల గురించి చాలా సాదాసీదాగా చెప్పినా గానీ అందులోని మర్మాన్ని వెదకడం పెద్ద కష్టమేమీకాదు. చిన్నపాటైనా, పెద్దపాటైనా ఆ పాటలు రాయడంలో ఉన్న కష్టమేంటో తెలిసిన గేయకవి సిరివెన్నెల. అలా మధనపడి క్షణాల్లో రాసిన పాటలూ ఉన్నాయి. ఎంతకూ తెగపడని ‘శివపూజకు చిగురించెను సిరిసిరిమువ్వా” అనే సమయానికి లొంగని పాటలూ ఉన్నాయి.
పల్లవించి.. ఆనక నిగ్గదీసి
సినిమా పాట అంటేనే.. మనల్ని వెంటాడే ఓ కమ్మని మాధుర్యం. అందులో తల్లి ఒడిలో లాలన, ఆలనతో పాటు ప్రేమానురాగాలూ, మానసిక సంఘర్షణలూ ఉంటాయి. మనసును ఉత్తేజపరిచే అనిర్వచనీయమైన అనుభవాలూ ఉంటాయి. అందుకే సినిమా పాట మనలో చాలామందికి నిత్యనూతనంగా మారుమోగే ఓ జీవన సవ్వడి. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలూ అందుకు మినహాయింపు ఏమీకాదు. కానీ, ఇంకా అతని పాటలో ఏదో ఉంది. ఏదో ఏంటి? అన్నదే ఇక్కడ ప్రశ్న. అవును అతడి పాట చాలా సందర్భాల్లో శ్రోతల్ని అనేక రకాలుగా ఆలోచనలో పడేసే పెద్ద ప్రశ్న అవుతుంది. ప్రశ్నగా పల్లవించి.. ఆనక నిగ్గదీసి అడిగే ప్రబోధంలా, నినాదంలానూ మారుమోగుతుంది. అలా గుండెలపై ఏవో స్పందనల్ని సష్టిస్తూ.. సుతిమెత్తగా దరువేస్తూనే.. ఒక కథలా మనతో అల్లుకుపోతుంది. అదే ‘సిరివెన్నెల’ పాటల ప్రత్యేకత. ఆ ప్రత్యేక పాటల గమనంలో అంతుపట్టని పార్శ్వాలు చాలానే ఉన్నాయి.
సిరివెన్నెల కుమారులిద్దరూ సినీ పరిశ్రమలోనే..
సిరివెన్నెల స్పూర్తితో ఆయన ఇద్దరు కొడుకులు కూడా సినీరంగ ప్రవేశం చేశారు. అది కూడా ఒకరు సంగీతం, మరొకరు నటన వైపు కావడం విశేషం. పెద్దబ్బాయి యెగేశ్వర్ శర్మ ‘కుదిరితే కప్ కాఫీ’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత ‘రంగు’ వంటి పలు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇక చిన్నబ్బాయి రాజా చేంబోలు నటుడిగా నిరూపించుకున్నారు. ‘కేక’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన రాజా.. రామ్ చరణ్ ‘ఎవడు’ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు రాజా.
సిరివెన్నెల రాసిన చివరి రెండు పాటలు
ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగ రారు’ సినిమాలో రెండు పాటలు రాశారు. అవే ఆయన రాసిన చివరి పాటలు కావడం విషాదకరం. మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యం విషయంలో తనతో తానే పోటీ పాడుతూ, తన పదాలతో తెలుగు సాహిత్యానికి కొత్త అందాన్ని తీసుకొచ్చి.. తన పద ప్రయోగంతో తెలుగు సినిమా పాటలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన సిరివెన్నెల సీతారామశాస్త్రి 66 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగు పాటలతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ సిరివెన్నెల సుపరిచితులే. భౌతికంగా సిరివెన్నెల మన మధ్య లేకపోయినా వేలాది పాటల్లో ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటారు. వినిపిస్తూనే ఉంటారు.
అవార్డులు
సినీ సాహిత్యరంగంలో చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన సినీ కెరీర్‌లో మొత్తం 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ”సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగం, శ్రీకారం, సింధూరం, ప్రేమకథ, చక్రం, గమ్యం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు విభాగంలో ఉత్తమ గేయరచయితగా ”నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం, మహాత్మ, కంచె” చిత్రాలలోని పాటలకు గాను మొత్తం నాలుగు పురస్కారాలు అందుకున్నారు. కళాసాగర్ ఉత్తమ గేయ రచయితగా ”సిరివెన్నెల, అంకురం, శుభలగం, పెళ్ళి సందడి” చిత్రాలలోని పాటలకు సిరివెన్నెల పురస్కారాలు పొందారు. ఆయన ఉత్తమ గేయ రచయితగా ”మనస్విని పురస్కారాలు, కిన్నెర పురస్కారాలు, భరతముని పురస్కారాలు, వంశీ బర్కిలీ పురస్కారాలు, రసమయి పురస్కారం, సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు, సైమా అవార్డులు, బుల్లి తెర పురస్కారం,” ఇలా ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి.
అక్షరాలతో వేణువులూదినా సిరివెన్నెల
సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహితీ లోకాన ”సిరి” చందనమై సౌరభించిన సగంధుడు. వేలహదయాల్లో ”వెన్నెల”వెలుగై వసించి ఉన్న వరేణ్యుడు. ”సిరివెన్నెల” గా కురిసి, మది మాపులలో మెరిసి మనసులు గెలిచిన మేధావి. పాటల తోటన విరితావి!. ”జగమంతా తన కుటుంబమన్న” తాత్వికుడు. ”ఆకాశంలో ఆశల హరివిల్లులు” చూసిన స్వాప్నికుడు. ”సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి నిజమడిగిన” ధీమంతుడు’. ”బోసినోటి తాత కీర్తి భగవద్గీత” గా వినిపించిన బోధకుడు. ”పూలబాలల కేల మూణ్ణాళ్ళ ఆయువని” ఆక్రోశించిన ప్రకతి ప్రేమికుడు. ”చంద్రుళ్ళో ఉండే కుందేటిని” నేలకి దింపిన నిజమైన భావుకుడు. ”అడగాలనుంది ఒక డౌటుని” అని పసిపాపలా మారాం చేసినా, ”సముద్రాన్ని కన్నె పిల్ల కన్నుల్లో కన్నీటి అలలు” గా మార్చినా, ”నేననీ నీవనీ వేరుగా లేమని” యువ హదయాల్ని ఊయలలూపినా, ”చెప్పుకోనీవు తప్పుకోనీవు” అని ప్రేమని సున్నితంగా మందలించినా, ”జాలిగా జాబిలమ్మ” కి జోలపాడి నిద్రపుచ్చినా, ”విరించిలా విపంచిలా” అక్షరాలతో వేణువులూదినా… సిరివెన్నెలకి ఎవరు సాటి రాగలరు.
- డా. పొన్నం రవిచంద్ర,
9440077499