రుణ సామార్థ్యాలపై ప్రతికూల ప్రభావం
క్రిసిల్ రిపోర్ట్ వెల్లడి
ముంబయి : అమెరికా టారిఫ్‌లు పెంచడం ఆ తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం భారత పరిశ్రమ రంగాన్ని కుదిపేస్తోందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ క్రిసిల్ తెలిపింది. భారతీయ కార్పొరేట్ రంగం ప్రస్తుతం రెండు వైపుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోందని తెలిపింది. ఒకవైపు అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్ నిబంధనలు, మరోవైపు పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం దేశీయ కంపెనీల క్రెడిట్ రేటింగ్‌లపై ప్రతికూల ప్రభావం చూపుతాయని క్రిసిల్ తన తాజా నివేదికలో హెచ్చరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రేటింగ్ అప్‌గ్రేడ్‌ల సంఖ్య 1.50 శాతానికి పరిమితం కావొచ్చని హెచ్చరించింది. ముఖ్యంగా ఎగుమతి ఆధారిత రంగాలు టెక్స్‌టైల్స్ రంగం ఇప్పటికే మందగించడం పరిశ్రమలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితికి అద్దం పడుతోందని తెలిపింది.
కోలుకోలేని నష్టమే..
పశ్చిమాసియా సంక్షోభంపై క్రిసిల్ నిర్వహించిన స్ట్రెస్ టెస్ట్ ప్రకారం ఈ యుద్ధం గనుక నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం కొనసాగితే కొన్ని కీలక రంగాలు కోలుకోలేని దెబ్బ తినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా విమానయాన రంగం స్పెషాలిటీ కెమికల్స్, ఆటో విడిభాగాలు, డైమండ్ పాలిషింగ్, సిరామిక్స్ వంటి రంగాలు ముడిసరుకు కొరత, పెరిగిన రవాణా ఖర్చుల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటాయి. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, వినియోగదారుల విశ్వాసం దెబ్బతిననుంది. ఇది అంతిమంగా కంపెనీల లాభదాయకతను తగ్గించి వాటి రుణ సామార్థ్యాలను బలహీనపరుస్తుందని నివేదిక స్పష్టం చేస్తోంది.
ప్రభుత్వ తోడ్పాటుపై ఆశలు
ఈ పరిణామాలను కోవిడ్-19 తర్వాత ఎదురవుతున్న అతిపెద్ద సవాలుగా పరిశ్రమల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. ”యుద్ధం పొడిగించబడితే గ్లోబల్ వృద్ధి మందగించడమే కాకుండా గ్యాస్ లభ్యత తగ్గడం వల్ల ఎరువులు, గ్లాస్ వంటి ఇంధన ఆధారిత పరిశ్రమలు మూతపడే పరిస్థితి రావచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం గనుక మరో పది రోజులు మించి కొనసాగితే విత్త, ద్రవ్య పరమైన రాయితీలు ప్రకటించి పరిశ్రమలను ఆదుకోవాలని పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతానికి కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ అనిశ్చితి వల్ల 2026-27 ఆర్థిక సంవత్సరంపై ఒక రకమైన అభద్రతా భావం నెలకొంది.
యుద్ధం కారణంగా ముడి చమురు, విద్యుత్ ధరలు పెరగడంతో, తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అంతిమంగా వినియోగదారులపై భారం పడేలా చేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ అనిశ్చితి వల్ల కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నాయని.. ఈ సంక్షోభం గనుక మరికొంత కాలం కొనసాగితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ మందగమనంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత పారిశ్రామిక రంగానికి దెబ్బ మీద దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



