ఆమెను వెంటాడే చూపులవి
ఆమె అడుగులను కబళించాలనుకనే నీలినీడలవి
వెకిలి నవ్వులను రాలుస్తూ
అహంభావాన్ని తలనిండా నింపుకున్న
అనాది కాలపు ఆధిపత్యపు చేవ్రాలే అది
ఎప్పటికప్పుడు కొత్త ముసుగుతో
నటనను అరువు తెచ్చుకున్న
దురహంకారమది
ఫెమినిజం పుట్టుకతో
కసాయి పెత్తనపు ఆయువు వాయువులో కలిసిందనుకుంటే
అక్కడక్కడా మిగిలిన పచ్చిలోంచి
పుట్టగొడుగులా పైకొస్తూనే ఉన్న
రంపపు పళ్ళ జిత్తుల వేషాలెన్నో మిగిలే ఉన్నయి
మనిషి పదానికి అర్థం జీర్ణం కాని
అమానుష మగత్వం మీసాలు మెలేస్తూనే ఉంది
సమాజంలో సగంగా
ఉనికి కోసం అస్తిత్వ సాధన సమరంలో
పడతులు చిందించిన నెత్తురుతో
తడిసిన మట్టి వాసన
గాలివాటుగానైనా స్పశించనట్టు
బలిదానాల కమురుకంపుకు మరిగిన
తనువులోని ఏ కణమైనా
అణు మాత్రం ప్రకంపించనట్టు
ఆధిపత్య ఊపులో ఎగిసిపడే అహంకారజ్వాలకు
అధోపాతాలమే అడ్రస్
పాపాల పల్లకినెక్కి విర్రవీగుతున్న
కంసుని వారసుల కోసమే వైతరణి నిరీక్షిస్తున్నది
– డా|| ఉప్పల పద్మ, 9959126682
నీలినీడ
- Advertisement -
- Advertisement -