మోసపూరిత ప్రకటనలకు ప్రజలు ఆకర్షితులు కాకూడదు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నవతెలంగాణ – కంఠేశ్వర్
బీఎంపీ యాప్ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేసిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. గురువారం సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసు కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.అక్టోబర్ 13న కోటగల్లీలోని కెనరా బ్యాంక్ పక్కన ఉన్న బీఎంబీ కంపెనీని చూసిన ఫిర్యాదుదారు తోకల బక్కన్న కంపెనీని సందర్శించాడు. ఆ కంపెనీ ప్రతినిధులు సదరు కంపెనీ ఇంగ్లాండ్ దేశానికి చెందినదని.. దీంట్లో పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్కు రేటింగ్ ఇవ్వడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నమ్మబలికారు. దీంతో బాధితుడు కంపెనీ ప్రతినిధి చంద్రశేఖర్ ప్రసాద్ మాటలు నమ్మి యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో సుమారు రూ.84వేల వరకు పెట్టుబడి పెట్టాడు.
అలాగే మరి కొంతమందిని సైతం ఈ మల్టీలెవల్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ కంపెనీలో చేర్పించాడు. అయితే తాను పెట్టిన పెట్టుబడి, లాభాలు విత్డ్రా కాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బక్కన్న వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం గురువారం మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో సదరు బీఎంబీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.సదరు నిందితుడు ఈ విధంగా సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిసిందని సీపీ తెలిపారు. అయితే చైన్ స్టిస్టం ద్వారా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టి సుమారు 750 మంది వరకు మోసపోయినట్లుగా తెలిసిందన్నారు.
బాధితులు బీఎంబీ కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల విలువ రూ. కోటికి పైగా ఉంటుందని ఆయన వివరించారు. ప్రస్తుతం బీఎంబీ కంపెనీకి చెందిన యాప్ పనిచేయడం లేదన్నారు. కంపెనీ పంపిన లింకులన్నీ కూడా చైనా బేస్డ్ లింకులని ఆ లింక్ల ద్వారా పంపిన రూ.1.50 కోట్లు చైనా బేస్డ్ లింక్లకు డైవర్ట్ అయినట్లు సమాచారం ఉందన్నారు.మోసపూరిత ప్రకటనలకు ప్రజలు ఆకర్షితులు కావొద్దని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఎవరు కూడా ఇలాంటి మోసపూరిత మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ చైన్ సిస్టంలో లాభాలు వస్తాయని పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి సంస్థల్లో మోసపోయి ఉంటే స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.



