Saturday, February 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌ ఎన్నికల్లో బీఎన్పీ ఘనవిజయం

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో బీఎన్పీ ఘనవిజయం

- Advertisement -

మొత్తం 299 స్థానాల్లో 212 చోట్ల గెలుపు
ప్రధానిగా ఖలీదా జియా కుమారుడు తారిక్‌ రెహమాన్‌!
ఆయన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
అవామీ లీగ్‌పై ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం
షేక్‌ హసీనాను అప్పగించాలనే డిమాండ్‌ పునరుద్ఘాటన

ఢాకా : బంగ్లాదేశ్‌ నేషలిస్ట్‌ పార్టీ (బీఎన్పీ) ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 299 స్థానాలకు గానూ ఆ పార్టీ 212 చోట్ల విజయం సాధించింది. దీంతో దాదాపు 20 ఏండ్ల తర్వాత బీఎన్పీ బంగ్లాదేశ్‌లో మళ్లీ అధికారం చేపట్టబోతోంది. చివరగా 2006లో ఆ పార్టీ బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని నడిపింది. తాజాగా బీఎన్పీ అఖండ విజయంతో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్‌ రెహమాన్‌ ఆ దేశ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆయన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు బీఎన్పీ వర్గాలు తెలిపాయి. దీంతో హసీనా పాలన అనంతరం బంగ్లాదేశ్‌లో కొన్నేండ్ల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. అయితే, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాన మంత్రి, అవామీ లీగ్‌ అధ్యక్షురాలు
షేక్‌ హసీనాను అప్పగించాలనే డిమాండ్‌ను బీఎన్పీ పునరుద్ఘాటించింది.

ఈ విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండబోదని తేల్చిచెప్పింది. విచారణకు ఆమెను భారత్‌ అప్పగించాలని స్పష్టం చేసింది. చట్టం ప్రకారం ఆమె శిక్ష ఎదుర్కోవాల్సిందే అని పేర్కొంది. షేక్‌ హసీనాను అప్పగించాలని విదేశాంగ మంత్రి ఇప్పటికే కోరినట్టు బీఎన్పీ సీనియర్‌ నాయకుడు సలాహుద్దీన్‌ అహ్మద్‌ అన్నారు. దీనికి తాము మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. ”చట్టం ప్రకారం ఆమెను అప్పగించాలని మేము పదే పదే చెబుతున్నాం.. ఇరు దేశాల విదేశాంగ శాఖల మధ్య దీనిపై సమావేశం జరిగింది.. విచారణను ఎదుర్కోవడానికి షేక్‌ హసీనాను దయచేసి బంగ్లాదేశ్‌కు పంపాలని భారత్‌ ప్రభుత్వాన్ని కోరాం” అని ఆయన అన్నారు. ఈ క్రమంలో భారత్‌ సహా అన్ని పొరుగు దేశాలతో బంగ్లాదేశ్‌ సాధారణ సంబంధాలు కొనసాగాలని కోరుకుంటుంది, కానీ సమాన నిబంధనలతో మాత్రమే ఉంటుందని అహ్మద్‌ నొక్కిచెప్పారు.

”భారత్‌తో సహా అన్ని దేశాలతో పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా స్నేహపూర్వక సంబంధం మనకు అవసరం” అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో ఆగస్టు 2024 నాటి విద్యార్థుల ఉద్యమంతో షేక్‌ హసీనా పదవీచ్యుతురాలైన విషయం తెలిసిందే. దీంతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చింది. అప్పటి నుంచి ఆమె న్యూఢిల్లీలోని ఓ రహస్య ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం. ఆమెపై బంగ్లాదేశ్‌లోని యూనస్‌ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పలు కేసులు పెట్టగా.. బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఓ కేసులో మరణ శిక్ష విధించింది. దీంతో ఆమెను అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్‌ డిమాండ్‌ చేస్తోంది. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో హసీనా విషయంలో భారత్‌ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఇరు దేశాల్లో ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -