రెండువేల ఎకరాల్లో మిగిలింది మూడొందలే..
కొంతభూమి కార్పొరేషన్ల పేరిట ఆయా వర్గాలకు కేటాయింపు
400 ఎకరాలను కబ్జా చేసి వశం చేసుకున్న నేతలు
ఇప్పటికీ అందని వేతనాలు
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ ప్రకటించిన నాటి నుంచి ఫ్యాక్టరీ భూములు క్రమక్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. బోధన్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భూములను ఆయా కార్పొరేషన్లు ఆయా వర్గాలకు కేటాయించగా.. మిగిలిన భూములను పాలకపార్టీల నాయకులు కబ్జా చేసేశారు. అధికారంలో ఉన్న సమయంలో పదవులను అడ్డుపెట్టుకొని యథేచ్ఛగా భూములను వశపరుచుకున్నారు. కానీ కార్మికులకు వారి హక్కుగా రావాల్సిన వేతనాలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ విషయంలో అటు పాలకులు, ఇటు యాజమాన్యం పట్టించుకున్న పాపనపోలేదు. దాంతో తమకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం కార్మికులు కోర్టులో పోరాడుతూనే ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1937లో నిర్మించారు. ఆ సమయంలో ఫ్యాక్టరీకి బోధన్‌తో పాటు చుట్టుపక్కల 16 వేల ఎకరాల భూములు ఉండేవి. 2002లో జాయింట్ వెంచర్‌కు వెళ్లి.. 2015లో లే ఆఫ్ ప్రకటించిన విషయం విధితమే. కాగా లే ఆఫ్ ప్రకటించిన నాటి నుంచి సదరు భూములపై రాజకీయ నాయకుల కన్ను పడింది. తమ అనుయాయులకు కేటాయించడంతో పాటు వారు సైతం కబ్జాలకు పాల్పడ్డారు. దాంతో పాటు వివిధ కార్పొరేషన్‌ల కింద భూములను చేజిక్కించుకున్నారు. మొత్తం 16 వేల ఎకరాలకు గాను 15,300 ఎకరాల వరకు వివిధ కార్పొరేషన్‌ల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు కేటాయించారు. అయితే మరో 400 ఎకరాలను నాయకులు కబ్జాలకు పాల్పడగా.. ప్రస్తుతం ప్రాజెక్టుకు 300 ఎకరాల భూములే మిగలడం గమనార్హం.
కార్మికుల గోడు పట్టని పాలకులు, యాజమాన్యం
నిజాం కాలంలో కార్మికుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో పాటు వినోదం కోసం సినిమా థియేటర్‌ను సైతం నిర్మించారు. లే ఆఫ్ ప్రకటించే సమయంలో ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వాల్సి ఉన్నా.. చేయలేదు. కార్మికులకు సంబంధించి సెటిల్‌మెంట్ చేయలేదు. కార్మికులను విధుల్లోకి తీసుకునే సమయంలో ఏడాదికి 45 రోజుల చొప్పున గ్రాట్యూటీ చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. వేతన పెంపు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు చేయకపోవడంతో కార్మికులు 2015 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా వారికి బకాయి వేతనాలు చెల్లించకపోగా.. ఇప్పటికీ సెటిల్‌మెంట్ జరగలేదు. తాజాగా బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది తప్పా.. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు, బెనిఫిట్స్ కోసం ఒక్క రూపాయి వెచ్చించలేదు. పాలకులు మారినా తమ సమస్యల పరిష్కారం విషయంలో మార్పులేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
జాయింట్ వెంచర్‌తో కార్మికులకు కష్టాలు షురూ
ఫ్యాక్టరీ జాయింట్ వెంచర్‌లోకి వెళ్లిందో అప్పటి నుంచి కార్మికులకు కష్టాలు షురూ అయ్యాయి. ప్రభుత్వ హయాంలో సుమారు 2000 మంది కార్మికులు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. జాయింట ్‌వెంచర్‌లోకి వెళ్లగానే.. ఎవరికైతే ఎక్కువ వేతనాలు ఉన్నాయో వారికి వీఆర్‌ఎస్ ఇచ్చి సాగనంపారు. మొదట్లో 300 మంది కార్మికులను అట్టిపెట్టుకున్నా.. తర్వాత 200 మందికి కుదించారు. స్కిల్డ్ వర్క్ ను సైతం అన్‌స్కిల్డ్ కార్మికులతో చేయించేవారు. ఇదే క్రమంలో ప్రయివేటు యాజమాన్యం తీసుకున్న పలు అనాలోచిత నిర్ణయాలతో చివరకు 2015లో లే ఆఫ్ ప్రకటించారు.