లోపాలు వున్నా భద్రతపై నిర్లక్ష్యం
న్యూయార్క్ : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనలో మతులకు సంబంధించిన నాలుగు కుటుంబాలు విమాన తయారీ సంస్థ బోయింగ్‌పై అమెరికాలో దావా వేశాయి. ఈ పిటిషన్‌లో విడిభాగాల తయారీ సంస్థ హనీవెల్ పేరును కూడా చేర్చాయి. ఈ మేరకు ఆ కుటుంబాలు దాఖలు చేసిన ఈ దావాలో.. ఇంధన స్విచ్‌లు లోపభూయిష్టంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించాయి. 787 డ్రీమ్‌లైనర్ విమానం డిజైన్, దాని విడిభాగాల అభివృద్ధి సమయంలోనే లోపాలు వారికి తెలుసని.. అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నాయి. ‘ఇంధన సరఫరా, విమాన థ్రస్ట్ నియంత్రణకు సంబంధించిన డిజైన్‌లో లోపం ఉంది’ అని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. అంతేకాక.. అకస్మాత్తుగా వచ్చిపడే ప్రమాదాల ను నిలువరించేందుకు ఆ రెండు సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని తెలిపాయి. స్విచ్‌లకు తనిఖీలు, మరమ్మతులు అవసరమని విమానాయాన సంస్థలను హెచ్చరించలే దని పేర్కొన్నాయి. వాటిని రీప్లేస్ చేసేందుకు అవసరమయ్యే విడిభాగాలను పంపించడం లో కూడా ఈ రెండు కంపెనీలు విఫలమైనట్టు తెలిపాయి. ఈ పిటిషన్‌పై బోయింగ్, హనీవెల్ సంస్థలు ఇప్పటి వరకు స్పందించలేదు. అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డీమ్‌లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకేఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయితే, బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్‌లు సక్రమంగానే ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) చెబుతోంది.