నవతెలంగాణ – పరకాల
పరకాల మున్సిపల్ పరిధిలోని 22 వార్డుల్లో ఉన్న బోగస్ ఓట్లను తక్షణమే తొలగించాలని సీపీఐ(ఎం) పరకాల పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. పరకాల పట్టణంలోని వివిధ వార్డుల్లో ఇతర గ్రామాల వ్యక్తుల ఓట్లు అక్రమంగా నమోదయ్యాయని ఆరోపించారు. ముఖ్యంగా రెండో వార్డులో చనిపోయిన వారి పేర్లు, వివాహం జరిగి ఐదు సంవత్సరాలు దాటిన మహిళల పేర్లు ఇంకా ఓటర్ లిస్టులోనే ఉన్నాయని పేర్కొన్నారు. అటువంటి వారు రెండు చోట్ల ఓటు హక్కును వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 22 వార్డుల ఓటర్ జాబితాలను వార్డుల వారీగా సమగ్రంగా పరిశీలించి దొంగ ఓట్లను ఏరివేయాలి.
ఓటు వేసే సమయంలో ఆధార్ కార్డును తప్పనిసరి చేయాలి. దీనివల్ల ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఓటు వేసే వారిని గుర్తించడం సులభమవుతుంది.పట్టణ పరిసర గ్రామాల నుండి అక్రమంగా చేర్చిన ఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం స్వీకరించిన తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. ఓటర్ జాబితాను నిశితంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం బోగస్ ఓట్ల తొలగింపుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మడికొండ ప్రశాంత్, బొచ్చు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


