– ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు మృతి
– గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన
– ఆస్పత్రికి వెళ్లిన కలెక్టర్, ఎస్పీ, గద్వాల ఎమ్మెల్యే
– కలెక్టర్,ఎమ్మెల్యేతో మాట్లాడిన మంత్రి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
రోడ్డు పక్కన బస్టాప్‌లో నిలబడిన నర్సింగ్ కళాశాల విద్యార్థినులపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గద్వాల జిల్లా కేంద్రంలో పాత ఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన బీఎస్సీ నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు హాస్టల్‌కు వెళ్లేందుకు గద్వాల – ఎర్రవల్లి రహదారిపై బస్టాప్ వద్ద వేచి ఉన్నారు. ఆ సమయంలో ఎర్రవల్లి నుంచి వస్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చింది. నారాయణపేట జిల్లాకు చెందిన మహేశ్వరి(20), వనపర్తికి చెందిన మనీషాశ్రీ(20) అక్కడికక్కడే మృతిచెందారు. ప్రణతి(భువనగిరి), చరణ్ భూపాల్(సంగారెడ్డి), నితిన్ గోపాల్(10), మంగళ్(32), వెంకటేష్(45) గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అలాగే, ఈ బస్టాప్ వద్ద ఉన్న మరో ఇద్దరు చిన్నారులకూ తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా బొలెరో వాహనం అక్కడే పానీపూరి బండినీ ఢకొీట్టడంతో ఓ బాలునిపై గ్యాస్ సిలిండర్ పడి తీవ్రంగా గాయపడ్డాడు. బొలెరో వాహనం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి, తనయుడు సాయిసాకేత్‌రెడ్డి, కలెక్టర్ బీఎం.సంతోష్, ఎస్పీ టి.శ్రీనివాసరావు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, విద్యార్థినులను ఓదార్చారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి వద్ద నర్సింగ్ విద్యార్థినుల రోదనలు మిన్నంటాయి.
మంత్రి దామోదర రాజనర్సింహా తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ప్రమాద ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహా విచారం వ్యక్తం చేశారు. విద్యార్థినుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్వాల ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మంత్రి ఆదేశించారు. దాంతోపాటు ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థినులకు వైద్యసాయం అందించాలని సూచించారు.
విద్యార్థులపైకిదూసుకెళ్లిన బొలెరో
- Advertisement -
RELATED ARTICLES