ఆర్డీఎక్స్‌లతో పేల్చేస్తామని మెయిల్..!
ఆకతాయిల పనేనని తేల్చిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఒక్కసారిగా బాంబు కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బుధవారం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఏకంగా 12 ఆర్డీఎక్స్‌లతో కోర్టును పేల్చేయబోతున్నామని మెయిల్‌లో బెదిరించారు. దాంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కోర్టు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనం మూలమూలలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఇది కేవలం ఆకతాయిల పనేనని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.



