సాధారణంగా విద్యా సంవత్సరం అంటే జూన్ 12న ప్రారంభమై ఏప్రిల్ 23 నాడు ముగిస్తుంది. పాఠశాలలో బోధన కార్యక్రమాలు, అధ్యయనం చేసే సమయం ఇది! వచ్చేస్తుందొచ్చేస్తుంది.. వేసవి సెలవుల్లో కనపడిన బాలబాలికలు… (విద్యార్థులు) తరగతి గదులకు వచ్చే వేళకు ప్రభుత్వ పాఠశాలలో ఆ సంఖ్య తక్కువ అవుతున్నది. అందుకోసం అందరినీ బడిలో చేరమని చెప్పేందుకు బడిబాట కార్యక్రమం కూడా చేస్తారు. అవగాహన కల్పిస్తారు. ఈ అన్ని పద్ధతులూ బాల బాలికల అభివద్ధిని ఆకాంక్షించే చేస్తారు. కానీ విహంగ వీక్షణం చేస్తూ… వెనుకటి వలె మన ప్రభుత్వ పాఠశాలలు సమద్ధిగా నిండాలని ఆకాంక్షతో… దానిలోని కొన్ని లోపాలు గ్రహించి, వాటిని సరిదిద్దుకుంటే అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చని ఆశ! అందుకే ఈ నాలుగు మాటలు.
మన తెలుగు రాష్ట్రాలలో ప్రజాస్వామిక వ్యవస్థలో కుల, మత, జాతి, వర్గ, విచక్షణ లేకుండా అందరికీ విద్య పొందడం ప్రజల హక్కు. ఇది ఏనాడో గ్రహించి తమ సొంత ఆస్తులను సైతం పాఠశాలలకు ధార పోసిన మహానుభావులెందరో ఉన్నారు. (చిలకమర్తి, దుర్గాబాయి దేశముఖ్ ఇల్లిందల సీత, ఒద్దిరాజు సోదరులు) వారి గొప్ప హదయసంస్కారానికి నమస్కరిస్తూ… వారి ఆశయమైన ఈ విద్యాసంస్థల విద్యాబోధనతో ఎందరో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దిబడిన సంగతి మనం మరచిపోకూడదు. ఆ విద్యార్థులు అలా గొప్పవారవడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు సమాజం పాత్ర కూడా ఎంతో ఉందనడంలో అనుమానమే లేదు!
నేటి పరిస్థితి కొంత శోచనీయంగా ఉంది. మన పాఠశాలలు విద్యార్థులతో నిండకపోవడానికి కారణం ప్రైవేటు పాఠశాలల పోటీ ఒకటైతే, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణా లోపం మరొకటి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చదువుతున్నారో ఏం చేస్తున్నారో పట్టించుకునే ఆర్థిక పరిస్థితి లేదు. అంతేకాదు! ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు నివసించే ప్రాంతంలో చదువుకునే వాతావరణం కూడా ఉండదు.
ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు తమపై పై అధికారుల ఒత్తిడి లేకుండా పిల్లలకు చదువు చెప్తారు. అయితే ప్రైవేట్ స్కూలు ఉపాధ్యాయుల వలె పిల్లలకు తాము చెప్పిన పాఠం అర్ధమైందా? లేదా? వాళ్ళు నేర్చుకుంటే వచ్చిందా? రాలేదా? అసలు వాళ్ళు నేర్చుకుంటున్నారా? లేదా? అని విద్యార్థులపై పర్యవేక్షణ ఉండదు. దీనికి కారణం లేకపోలేదు. విద్యాశాఖ వారు రూపొందించిన యాప్‌లు పూరించడంతోనే వారి సగం కాలం గడిచిపోతుంది.
అందరి వలెనే పిల్లలకు అభ్యాసానికి హోంవర్క్ ఇస్తారు. కానీ పిల్లలు చేయాలనుకోరు. తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టి హోం వర్క్ చేయించరు! ఎందుకంటే? తల్లిదండ్రుల్లో ఎక్కువగా చదువుకోని వారే ఉంటారు. అయినా తల్లిదండ్రుల మాట ఆ పిల్లలు కూడా వినరు. ఇంట్లో బడి బ్యాగు పడేసి ఆటల కోసం వీధుల్లో తిరుగుతారు. వేళకు ఇంటికివచ్చి హోంవర్క్ చేయాలనుకోరు. చీకటైనాక ఇల్లు చేరుతారు. తిని, నిద్ర పోతారు.
ఇంట్లోని పెద్దలకు కనీసం కూర్చోబెట్టి చదివించాలనే అవగాహన ఉండదు. పిల్లలు ఇలా ఉండడం వల్ల టీచర్లకు కూడా కష్టమే! ఎవరికైనా విన్న దానికంటే రాస్తే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. నూటికి 70 మంది ఉపాధ్యాయులు పిల్లలకు మంచిగా చదువు చెప్పాలని, వాళ్ళు వద్ధిలోకి రావాలని ఎంతో కష్టపడుతున్నారు. కానీ వారికి పిల్లల సహకారం ఉండదు. అందుకే ప్రైవేట్ స్కూల్లో వచ్చిన మంచి ఫలితాలు రాకపోవడానికి కారణం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోకపోవడమే! పాపం వారికి ఆ అవకాశం కూడా ఉండదు.
అంతేకాదు ఆ పిల్లలకు సరైన పోషకాహారం అందక జ్ఞాపకశక్తి, ఉత్సాహం రెండూ ఉండవు. ఉదాహరణకు పిల్లవాడు ఉదయం తొమ్మిది గంటలకు బడికి వెళ్ళాలి. ఆలోపు వాడికి ఏదైనా వండి పెట్టాలి కదా? కానీ తల్లి ఉదయం ఏడు గంటలలోపే పనిలోకి వెళుతుంది. లేకపోతే ఇల్లు గడవదు. ఎందుకంటే ఆ పిల్లలకు తల్లి ఉంటే తండ్రి ఉండడు… తండ్రి ఉంటే తల్లి ఉండదు. ఏవో కారణాలతో భార్యాభర్తలు విడిపోవడమో! లేక చనిపోవడమో! ఏదో ఒకటి జరుగుతుంది. ఇలా ఆ పిల్లవాడు తినకుండానే బడికి వెళ్తాడు. క్లాసులో ఆకలో? ఏమో నొప్పి అని బాధపడతాడు. అప్పుడు టీచర్లకు ఏం చేయాలో తోచదు! కడుపు నొప్పి అంటే తరగతి గదిలో కూర్చోబెట్టి చదివించలేరు. అలా అని ఇంటికి పంపితే ఇంట్లో తల్లీ ఉండదు… తినడానికి తిండీ ఉండదు. బడిలో టీచర్లకు ఇంటికి పోతానని చెప్పి బయలుదేరుతారు ఆ పిల్లలు. ఇంటికి పోతే అమ్మ, నాయనమ్మ ఎవరూ ఉండరు. ఇక బజార్లన్నీ తిరిగి తిరిగి ఎప్పటికో ఇంటికి చేరుతారు.
ఇలాంటి సమస్యలను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల దష్టిలోకి తీసుకొని వెళితే ఆయా సమస్యలు తెలుసుకొని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు చేపడితే కొంతలో కొంత లాభం ఉండవచ్చు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి తల్లిదండ్రులను పిలిపించినా… ఏ తల్లీ తండ్రీ మీటింగ్‌కు రాలేరు. సెలవు పెడితే ఆ రోజు జీతం చేతికి రాదనే భయం ఉంటుంది. ఒకవేళ వచ్చినా టీచర్లు, హెడ్మాస్టర్ గారు చెప్పినవి పూర్తి స్థాయిలో వాళ్లు పాటించలేరు. దాంతో పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఏం లాభం? అక్కడక్కడా అరాకొరా వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ సమస్యలు చెప్తారు. ప్రధానోపాధ్యాయుడు అవన్నీ రాసుకొని ఆ సమస్యలు తీర్చేందుకు ప్రయత్నించినా, ఫలితం అంతంత మాత్రమే.
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా ఉండవు, మిడ్‌డే మీల్స్ రుచిగా ఉండదు, అన్నం ముద్ద అవుతుంది. వీటిని పిల్లలు ఎలా తినగలరు? ఇక్కడ వంటచేసే వాలంటీర్‌ను కూడా తప్పు పట్టడానికి వీల్లేదు! ఎందుకంటే ప్రభుత్వం ఏ సామాను పంపిస్తే వాటితోనే వంట చేయాలి. ఒకసారి నాణ్యత ఉన్న వంటసామాన్లు వస్తాయి. ఒకసారి రావు. రోజూ 200 మందికి వంట ఒకే తీరుగా రుచిగా చేయడం కూడా అసాధ్యమే! రోజూ కోడి గుడ్డు ఇవ్వడం లేదని పేరెంట్స్ అడుగుతారు. పర్యవేక్షణ చేసేవారు ఉంటే పిల్లలకు సరిగ్గా చేరుతాయి. లేకుంటే లేదు!
స్కూల్ సిబ్బంది తమ చేతిలో ఉన్నంతవరకు చేయగలుగుతారు. పేద పిల్లలకు చదువు రావాలంటే ప్రధానోపాధ్యాయులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. వారు పనిచేయకుండా కూర్చుని, పాఠశాలను పట్టించుకోకుండా ఇతరత్రా సొంత పనులకు సమయాలు కేటాయించి, ఏదో కొద్దిసేపు స్కూల్లో కుర్చీలో కూర్చునే వారు కూడా ఎందరో ఉన్నారు. ఇలాంటి వారు ఉన్నప్పుడు ఎన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నా అందవలసిన వారికి అందవు. చదువుకొని బాగుపడవలసిన వారు బాగుపడరు. అలా అని అందరూ అలా ఉన్నారని కాదు. పిల్లల భవిష్యత్తు కోసం తపించే ఉపాధ్యాయులు కూడా ఎందరో ఉన్నారు.
హెడ్మాస్టరు టీచర్లను తప్పనిసరిగా క్లాస్ రూమ్‌లోకి పంపించాలి. ఆ వెళ్లిన టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతున్నారా? లేదా? అని చూడాలి! సిలబస్ సరిగా పూర్తవుతున్నదా? అని కూడా చూడాలి. అలాగే టీచర్లు చెప్పిన పాఠాలు పిల్లలు అర్థం చేసుకుంటున్నారా? లేదా? హౌంవర్క్ చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు గమనిస్తూ… పిల్లల ప్రతి నోట్‌బుక్కులో హెడ్మాస్టర్ గారి సంతకం ఉండాలి.
మంచి ఫలితాలు రాకపోవడానికి పావు వంతు టీచర్లది తప్పైతే ముప్పావు వంతు తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టించుకోకపోవడమే! అందుకే తల్లిదండ్రులు ఎంత కష్టపడినా పిల్లల కోసమే కాబట్టి బడికి పిల్లవాడు పోతున్నప్పుడు ‘నువ్వు తరగతిలోనే కూర్చోవాలి! టీచర్ చెప్పిన పాఠం శ్రద్ధగా వినాలి!’ అని గట్టిగా చెప్పాలి. అలా క్రమశిక్షణ అలవాటు చేస్తే పిల్లలు మంచిగా తయారవుతారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇంట్లో కొంత పునాది వేస్తే పాఠశాలల్లో టీచర్ ఒక పావు భాగం చెప్పినా చదువు తప్పక వస్తుంది. పిల్లలకు మొదట చదువుకుందాం అనే అభిలాష ఉండాలి. ఇది తల్లిదండ్రులు కూడా పిల్లల్లో కల్పించాలి. టీచర్లు పాఠాలు ఎంత బాగా చెప్పినా పిల్లలు వినకపోతే రాదు కదా! వింటే కొంతైనా నేర్చుకోగలుగుతారు. దీనికి తల్లిదండ్రుల బాధ్యత కూడా కీలకమే. తమ పిల్లలకు చదువుకుంటే వచ్చే లాభం ఏమిటి? ఆ చదువు వల్ల వచ్చే గౌరవం ఎలా ఉంటుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తమకు తెలిసిన పద్ధతిలో, మాటల్లో ఇన్ డైరెక్ట్‌గానో, డైరెక్ట్‌గానో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు చెబుతూ ఉండాలి. అలా చెప్తే తల్లిదండ్రుల్లో మార్పు కచ్చితంగా వస్తుంది.
పిల్లలు అభివద్ధిలోకి రావాలని ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తెస్తున్నాయి. కానీ అవి చేరవలసిన వారికి చేరడం లేదు. అసలు ఆ పథకాలు ఉన్నట్టే కొంతమంది బడుగు వర్గాలకు తెలియడం లేదు. ఇంకా శోచనీయమైన విషయం ఏమిటంటే? బడి పిల్లలు వినయ- విధేయతలు నేర్చుకోకుండా పెరుగుతున్నారు. అసలు వాళ్ళ ఆహార్యం చూస్తే అవాక్కైపోతాం. వాళ్ళ హెయిర్ స్టైల్ కానివ్వండి, వేసుకునే బట్టలు కానివ్వండి ఫ్యాషన్ వైపు పరుగులు తీసినట్లు ఉంటుంది.
ఒకడు వెనుకంతా బోడుగుండు వలె కత్తిరించుకొని, ముందు గోపురం వలె జుట్టు అట్టే పెట్టుకొని, మాటిమాటీకీ తలెగరవేస్తుంటాడు… ఒకడు తోక వలె జుట్టుకు రబ్బర్ బాండ్ వేసుకొని, ఒక చెవికి పోగు పెట్టుకొని, చేతికి వెండి కడియం వేసుకొని, మోకాళ్ళ దగ్గర అక్కడక్కడ చిరిగిపోయిన జీన్ ప్యాంటు వేసుకొని, ఫ్యాషన్ ఏమిటంటే బట్టలు ఎంత చిరిగితే అంత అందం అన్నట్టుగా అవే వేసుకొని వస్తాడు. లేకపోతే పెద్ద ప్రింట్ ఉన్న వదులు జుబ్బా వేసుకొని వస్తాడు. ఆ డ్రెస్‌లో ఆ పిల్లలను చూడగానే చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఇక వాడి నడివడి కూడా అలానే ఉంటుంది. ఒకవేళ చదువు చెప్పే మాస్టర్ ఏమన్నా అంటే చాలు! తల్లిదండ్రులు అందరూ వచ్చి ఆ మాస్టారుతో పిల్లవాడికి క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టరు. ఇలాంటి సంఘటనలు కూడా ఎన్నో చూశాము.
ఏదేమైనా పూర్వం వలె గురువులకు గౌరవం ఇచ్చి, భక్తిశ్రద్ధలతో విద్య నేర్చుకొనే పరిస్థితి నెలకొనాలి. అంటే విద్యార్థులు తప్పుచేసినపుడు ఉపాధ్యాయులకు దండించే అధికారం ఉంటేనే విద్యార్థులు భయభక్తులతో విద్యను, వివేకాన్ని నేర్చుకుని విజ్ఞానవంతులౌతారు. అలా కానప్పుడు మనం ఎంత వగచినా పరిస్థితులు ఇలానే ఉంటాయి.
ప్రైవేటు పాఠశాలలో ఎందుకంత మంచి ఫలితాలు వస్తున్నాయి. వాస్తవానికి ఆ స్కూల్లో నిపుణులైన ఉపాధ్యాయులే తక్కువ.ప్రభుత్వ ఉపాధ్యాయులే మంచి నైపుణ్యం కలవారు. వాళ్లకు చక్కటి డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలతో పాటు టీచర్ ట్రైనింగ్‌లు అన్నీ ఉంటాయి. అయినా కానీ కొంతమంది టీచర్లలో అలసత్వం, నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఒకసారి మేము ఉద్యోగంలో చేరితే చాలు! ఇక రిటైర్ అయ్యేవరకు మమ్మల్ని ఎవ్వరు ఉద్యోగం నుండి తీసివేయరనే ధీమా ఉంటుంది. అలా కొంతమంది తమ విధులు (డ్యూటీల) సక్రమంగా చేయక, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుండవచ్చు. అయితే అందరూ అలా ఉండరు. కొందరు అంకితభావంతో విద్యా, బుద్ధులు చెప్పేవారూ ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు రావాలంటే టీచర్లు బాధ్యతగా ఉండాలి. మేం జీతం తీసుకుంటున్నాం కాబట్టి, పిల్లలకు న్యాయం చేయాలనే తపన ఉండాలి. ‘విద్యార్థులు అన్యాయమైపోవద్దు! తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి తమ పిల్లలను మాకు అప్పగించారు… వారిని సక్రమ పౌరులుగా తీర్చిదిద్దాలి’ అనే ఆకాంక్ష మనసా, వాచా, కర్మణా ఉండాలి. అలా బాధ్యతగా టీచర్లు పనిచేసినప్పుడు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పట్టించుకొని, మంచి నడవడిని అలవాటు చేస్తూ… చదువూ సంస్కారం, సత్ప్రవర్తన ఉండేలా తయారు చేయాలి. ముఖ్యంగా స్కూల్ మీద అధికారుల తనఖీలు ఉండాలి. నెలకోసారి అధికారులు వచ్చి కూర్చొని ‘టీచర్లు ఎలా బోధిస్తున్నారు? స్కూల్ ఏ స్థాయిలో ఉంది? ఇంకా మెరుగవ్వాలంటే మనమేం చేయాలి’ అనేవి ఆలోచించాలి. అలా పర్యవేక్షణ ఉన్నప్పుడు టీచర్లు కూడా బాధ్యతతో పాఠాలు చెప్పటం, క్రమశిక్షణతో మెలిగి విద్యార్థులకు బాగా నేర్పిస్తారు. ఈ మూడు చక్కగా ఉంటే దేశానికీ, సమాజానికీ చక్కని పౌరులు తయారవుతారు.
ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు లేకపోవడం, పట్టించుకోకపోవడం వంటి కారణాలతో అట్టడుగు ఆదాయం ఉన్నవారైనా సరే! ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చక అప్పోసప్పో చేసి నాలుగు ఇండ్లలో పాచి పనులైనా చేసి, ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు.
ఇందులో మార్పు రావాలంటే తగినంత తనిఖీ సిబ్బంది లేకపోవడం ముఖ్య కారణం. కూలంకషంగా తనిఖీలు ఉండాలంటే తగినంత తనిఖీ సిబ్బంది కావాలి. లేకపోతే ఒకరు ఎన్ని బడులను తనఖీ చేయగలరు? ఏదో తూ..తూ.. మంత్రం వలె తనిఖీ చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకున్నది. అధికారులు వారి వారి డ్యూటీలు సక్రమంగా చేస్తే, ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతను ఎరిగి నడుచుకుంటే, పిల్లలు విజ్ఞానాన్ని సముపార్జించి పాస్ అయితే పాఠశాలలు చక్కబడతాయి. అప్పుడు అందరి దష్టి ప్రభుత్వ పాఠశాలల మీదనే ఉండి, తమ పిల్లలను అక్కడే చేర్పించాలను కుంటారు. అలా ప్రభుత్వ పాఠశాలలో చదివేవారి సంఖ్య పెరుగుతుందని నా అభిప్రాయం.
అందుకే తనిఖీ సిబ్బందిని ప్రభుత్వం సంఖ్యాపరంగా పెంచాలి. వాళ్లు కూడా ఒకప్పటి టీచర్లే కాబట్టి టీచర్ల మనస్తత్వాలు, సాధకబాధకాలు తెలుసు కాబట్టి వాళ్ళు సక్రమంగా వారి విధులు నిర్వర్తించరేమో? ఈ తలనొప్పి వ్యవహారం మాకెందుకని ఉదాసీనంగా చూసే అవకాశాలెక్కువేమో, అరాకొరా తనఖీలే జరుగుతాయని ప్రజల అభిప్రాయం. ఈ తనిఖీ చేసే అధికారుల పోస్టులకు అదనపు క్వాలిఫికేషన్, అధికారాలు ఉండాలి! ఉపాధ్యాయుల మీద ఏవైనా చర్యలు చేపడితే యూనియన్‌లు వారికి మద్దతుగా వస్తాయి. అప్పుడు విద్యార్థులకు న్యాయం జరగాలన్న అధికారుల శ్రమ వథా అవుతుంది. కాబట్టి తనఖీ అధికారులను ఉపాధ్యాయుల నుండి తీసుకోవద్దు. ప్రత్యేకంగా నియమించాలి.
పర్యవేక్షణ అధికారులు టీచర్ల నుండి కాకుండా ప్రత్యేకంగా కానీ కలెక్టర్ స్థాయిలో ఉండి, వాళ్లకు పూర్తి అధికారం ఉంటే… ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అప్పుడు పరిస్థితి మెరుగుపడవచ్చు. అది కూడా ప్రతి నెలా తనిఖీలు నిర్వహిస్తూ మంచి ఫలితాలు తెమ్మని చెప్పాలి. ‘ప్రతి సబ్జెక్టు పిల్లవాడికి అర్థమయ్యేలా, సిలబస్ ప్రకారం బోధన చేసే బాధ్యత నీదే’ అని టీచర్‌ను ఆదేశించే అధికారులు ఉంటే పరిస్థితి వేరేగా ఉంటుందేమో? ఎందుకంటే ప్రతి టీచర్ మంచి విద్యావంతులే! సబ్జెక్టులో నైపుణ్యం ఉన్నవాళ్లే! ఇంత మంచి మేధావులైన ఉపాధ్యాయుల సేవలను అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థులు అందిపుచ్చుకోవడం లేదేమోనని అనిపిస్తుంది.
ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, అత్యున్నత ప్రమాణాలు ఉన్న విద్యావేత్తలు. వారి వారి సబ్జెక్టులను వారు మంచిగా చెప్పగలరు. వారి మీద పర్యవేక్షణ లోపమే కనపడుతున్నది. ప్రతినెలా స్కూలుకు ఆ అధికారులు విజిట్ చేసి టీచర్లకు అవగాహన కల్పించాలి. ఎలా పిల్లలను చదువు వైపు మళ్ళించాలని నేర్పిస్తూనే వారి సేవలు అందుకోగలిగిన ప్రభుత్వ పాఠశాలలు మంచిగా పనిచేసే బాధ్యత పర్యవేక్షక అధికారులదే అయి ఉండాలి. అటు తల్లిదండ్రుల జోక్యం, ఇటు అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పుడు విదేశీ స్కూల్‌ల వలె మన స్కూల్లో కూడా బంగారు యువత తయారౌతుంది.
ప్రతినెలా పిల్లల సంరక్షకులు వచ్చి మాట్లాడి తమ పిల్లలు ఎలా చదువుతున్నారు? అని టీచర్లను అడిగి తెలుసుకోవాలి. ఇలా అన్ని వైపులా పకడ్బందీగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య దానంతట అదే పెరుగుతుంది. మా పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని ఆశిస్తూ…
– రంగరాజు పద్మజ, 9989758144