Friday, December 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునేటి నుంచి పుస్తకాల పండుగ

నేటి నుంచి పుస్తకాల పండుగ

- Advertisement -

హైదరాబాద్‌లో 29 వరకు నిర్వహణ
ప్రారంభసభకు ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి
‘పుస్తకస్ఫూర్తి’ పైలాన్‌ను ఆవిష్కరించనున్న జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి
24న బుక్‌ వాక్‌
విద్యార్థులకు ఉచిత ప్రవేశం
జ్ఞాన తెలంగాణ నిర్మాణమే మా లక్ష్యం : హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్ష, కార్యదర్శులు యాకూబ్‌, వాసు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ నగరంలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లో పుస్తకాల పండుగ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 29 వరకు 11 రోజులపాటు జరగనుంది. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ కళాభారతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు యాకూబ్‌, కార్యదర్శి ఆర్‌ వాసు మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన ప్రారంభోత్ససభకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా ‘పుస్తకస్ఫూర్తి పైలాన్‌’ అనే ఎనిమిది అడుగుల స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నామనీ, దాన్ని జస్టిస్‌ బి సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరిస్తారని వివరించారు. గౌరవ అతిథులుగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరామ్‌, కె రామచంద్రమూర్తి, రమా మెల్కోటె పాల్గొంటారని అన్నారు.

బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశామని వివరించారు. ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత పేరు, పుస్తకావిష్కరణల వేదికకు సాహితీవేత్త కొంపల్లి వెంకట్‌గౌడ్‌ పేరు, రైటర్స్‌ స్టాల్స్‌కు ప్రొఫెసర్‌ ఎస్‌వి రామారావు పేరు, మీడియా స్టాల్స్‌కు స్వేచ్ఛ ఒటార్కర్‌ పేరు పెట్టామని అన్నారు. ఈ బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణంలో మొత్తం 368 స్టాల్స్‌ ఏర్పాటు చేశామని వివరించారు. వాటిలో ప్రభుత్వానికి సంబంధించిన 20 స్టాల్స్‌, మీడియాకు 20 చిన్న స్టాల్స్‌, రైటర్స్‌ కోసం తొమ్మిది స్టాల్స్‌ కేటాయించామని చెప్పారు. రైటర్స్‌ సౌలభ్యం కోసం ఒక్కో స్టాల్‌కు ముగ్గురు రైటర్స్‌ను కేటాయిస్తున్నామని అన్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందని వివరించారు.

ప్రతిరోజూ పుస్తకాల ఆవిష్కరణ
ప్రతిరోజు పుస్తకావిష్కరణ వేదికపై ఆరు స్లాట్స్‌లో పుస్తకావిష్కరణలు జరుగుతాయని యాకూబ్‌, వాసు చెప్పారు. తొమ్మిది రోజుల పాటు మొత్తం 54 పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని వివరించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు బాలోత్సవ కార్యక్రమం ఉంటుందని అన్నారు. సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు భాషా సాంస్కృతిక శాఖ సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని వివరించారు. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమాలు మూడు విడతల్లో జరుగుతాయని చెప్పారు. మొదటి విడతలో ప్రముఖుల సందేశాలు, మిగతా రెండు విడతల్లో పుస్తకం విలువ, ప్రాముఖ్యత, సాహితీవేత్తల ఇష్టమైన పుస్తకాలపై చర్చలుంటాయని అన్నారు. గతేడాది 300 మందికిపైగా సాహితీవేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించామనీ, ఈ ఏడాది కూడా అదే విధంగా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పుస్తక ప్రదర్శనకు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల మంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.

పిల్లలకు ఆట వస్తువులు
పుస్తక ప్రియులకు మౌలిక వసతులు, మరుగుదొడ్ల సమస్య లేకుండా ఏర్పాట్లు చేశామని యాకూబ్‌, వాసు అన్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులను ప్రధాన వేదిక ఎదురుగా ఏర్పాటు చేశామన్నారు. పెద్దలు విశ్రాంతి తీసుకునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రాంగణం లోపల ఫిల్టర్‌ కాఫీ, టీ సౌకర్యం కల్పించామని వివరించారు. పాత పుస్తకాల స్టాల్స్‌ను 60 నుంచి 40కి తగ్గించామని అన్నారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌కు విద్యార్థులకు ఉచిత ప్రవేశం ఉంటుందని చెప్పారు. వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తేవాలని సూచించారు. జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, సాహితీ మిత్రులు, రచయితల కోసం 20 వేల పాసులను కేటాయించామని వివరించారు.

ఈనెల 24న లోయర్‌ ట్యాంక్‌బండ్‌ అమ్మవారి ఆలయం నుంచి బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణం వరకు బుక్‌ వాక్‌ నిర్వహిస్తామని చెప్పారు. జ్ఞాన తెలంగాణను నిర్మించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నామని ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కోశాధికారి పి నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు బి శోభన్‌బాబు, సంయుక్త కార్యదర్శి కె సూరిబాబు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుక్‌ ఫెయిర్‌ కార్యవర్గ సభ్యులు ఎన్‌ కోటేశ్వరరావు, టి సాంబశివరావు, స్వరాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -