మహారాష్ట్ర రాష్ట్రలోని సతారా జిల్లాలో, పంచగని, మహాబలేశ్వరం వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల మధ్య, భిలార్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. సహ్యాద్రి పర్వతశ్రేణుల ప్రకతి సౌందర్యంతో నిండిన ఈ గ్రామం స్ట్రాబెర్రీ పంటలకు, సంపన్నమైన సాంస్కతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. అయితే, 2017లో ఈ గ్రామం ఒక అద్భుతమైన మార్పును చవిచూసి, దేశంలోనే మొట్టమొదటి ‘పుస్తకాల గ్రామం’ (బుక్ విలేజ్)గా అవతరించింది. ఈ ఉద్యమం యువతలో చదవడం పట్ల ఆసక్తిని పెంపొందించడం, చదివే అభిరుచిని పెంపొందించడం, జ్ఞానాన్ని ప్రోత్సహించడం, సాంకేతిక యుగంలో మానవీయ మూలాలను పునరుద్ధరించడం, నైతిక విలువలు పెంపొందించడం, బాధ్యతాయుతమైన పౌరునిగా వెలుగొందే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రత్యేకమైన ఉద్దేశ్యం వెనుక ఉన్న ప్రేరణ ప్రపంచంలోనే తొలి పుస్తకాల గ్రామమైన వేల్స్‌లోని ‘హే-ఆన్-వే’ . ఆ గ్రామం సాహిత్య ప్రియులకు ఒక మకాంగా ఎలా మారిందో చూసిన మహారాష్ట్ర అధికారులు, భిలార్‌ను భారతదేశంలోని ‘హే-ఆన్-వే’గా మార్చాలనే సంకల్పం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర విద్యామంత్రి వినోద్ తవడే నేతత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2017 మే 4న, అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గ్రామాన్ని భారతదేశంలోని మొదటి పుస్తకాల గ్రామంగా అధికారికంగా ప్రకటించి, ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
భిలార్‌ను పుస్తకాల గ్రామంగా మార్చే ప్రక్రియలో అద్భుతమైన సామాజిక ఐక్యత, సహకారాన్ని చూసింది. గ్రామస్తులు ఈ ఉద్యమానికి ముందంజ వేస్తూ, తమ ఇళ్లలోని కొంత భాగాన్ని ఉచిత గ్రంథాలయాలుగా మార్చడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రస్తుతం గ్రామంలోని 35 కి పైగా ఇళ్లలో ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ గ్రంథాలయాల ద్వారాలు ఎప్పుడూ పాఠకులకు తెరచి ఉంటాయి. ప్రతి గ్రంథాలయానికి ప్రభుత్వం వారు రూ.1 లక్ష గ్రాంట్, పుస్తకాల కొనుగోలు కోసం మరో రూ.80,000, అవసరమైన అల్మారాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి అందజేశారు.
గ్రామం అంతటా వివిధ రకాలైన పుస్తకాలను ఏర్పాటు చేశారు. కవిత్వం, సాహిత్యం, మతం, చరిత్ర, హాస్యం, పిల్లల సాహిత్యం, జానపద కళలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, పిల్లల పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, మహిళల వికాసం, కుటీర పరిశ్రమల పుస్తకాలు వంటి విభాగాలు ఏర్పడ్డాయి. ఏ ఇంటిలో ఏ రకమైన పుస్తకాలు ఉన్నాయో దూరం నుండే అర్థమయ్యేలా, గోడలపై అందమైన పెయింటింగ్లు, గ్రాఫిక్ డిజైన్లతో సూచించబడ్డాయి. 75 మందికి పైగా కళాకారులు తమ తొలి రచనల ద్వారా గ్రామాన్ని రంగులతో నింపారు. అదేవిధంగా బొమ్మలు చూడగానే పుస్తకాలపై ప్రేమ పెరిగి చదవాలనిపించే బొమ్మలు వీధులలో ఇండ్ల గోడలపై దర్శనమిస్తాయి.
భిలార్‌ను సందర్శించే పాఠకులు ఒక అద్భుతమైన అనుభవానికి లోనవుతారు. గ్రామం ప్రవేశద్వారంలోని ప్రధాన కార్యాలయం ద్వారా లేదా చుట్టుపక్కల ఉన్న ఏదైనా గ్రంథాలయం నుండి ఒక మ్యాప్‌ను పొందవచ్చు. ఇది వివిధ గ్రంథాలయాలు, వాటి ప్రత్యేక విభాగాలను గుర్తించడంలో సహాయపడుతుంది. పుస్తకాలు చదవడానికి కుర్చీలు, సోఫాలు, టేబుళ్లు అందుబాటులో ఉంటాయి. గ్రామం అంతటా నడవడం అవసరం కాబట్టి, సౌకర్యవంతమైన పాదరక్షలు ధరించడం సమంజసం.
ప్రస్తుతం, గ్రామంలో 40,000కి పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మరాఠీ భాషలో ఉన్నాయి. అయితే, ఇంగ్లీష్, హిందీ భాషలలోని పుస్తకాలను కూడా సేకరించే ప్రణాళికలు ఉన్నాయి. అదేవిధంగా మిగతా భాషల పుస్తకాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. పాఠకులు తమకు నచ్చిన పుస్తకాలను ఇక్కడే కూర్చుని చదవవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఇంకా, తమ పుస్తకాలను దానం చేయాలనుకునేవారిని కూడా ఈ గ్రామం స్వాగతించేందుకు సిద్ధంగా ఉంది. దానికి కావలసిన మౌలిక సదుపాయాలను కూడా వారు ఏర్పాటు చేశారు.
పుస్తకాల గ్రామం అనే భావన భిలార్‌ను ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మార్చింది. పంచగని, మహాబలేశ్వరం వెళ్లే పర్యాటకులు ఇప్పుడు తమ ప్రయాణంలో భిలార్‌ను ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా చేర్చుకుంటున్నారు. ఈ గ్రామం పుస్తకాలతో పాటు స్ట్రాబెర్రీ తోటలు, సమీపంలోని అందమైన జలపాతం వంటి ప్రకతి దర్శనీయ ప్రదేశాలను కూడా అందిస్తుంది. పర్యాటకులు తోటలలోకి వెళ్లి తాజా స్ట్రాబెర్రీ పండ్లను రుచి చూడవచ్చు.
ఈ గ్రామం పాఠకులకు మాత్రమే కాకుండా, పరిశోధకులు, విద్యార్థులకు కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. ఇక్కడ అరుదైన గ్రంథాలు, సేకరణలు ఉండటం, వాటిని ఉచితంగా చదవగలిగే అవకాశం, చాలా మందిని ఆకర్షిస్తోంది. గ్రామంలోని గెస్ట్ హౌస్లు, హోటళ్లు తక్కువ ఖర్చుతో విడిది, భోజన సదుపాయాలను అందిస్తాయి. ఇది పుస్తక ప్రేమికులకు ఎక్కువ సమయం గడపడానికి అనుకూలంగా ఉంటుంది. నిత్యం 150 నుండి 200 మంది పాఠకులు ఈ గ్రంథాలయాలను సందర్శిస్తుంటారు.
భిలార్ విజ్ఞాన విజయం ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఈ మాతక ఆధారంగా, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర గ్రామాలను కూడా పుస్తకాల గ్రామాలుగా మార్చే ప్రణాళికలను చేపట్టింది. ఇది పుస్తకాలు, జ్ఞానం పట్ల సామాజిక ఆసక్తిని పునరుజ్జీవింపజేయడానికి ఒక పెద్ద ఉద్యమంగా మారుతోంది.
భిలార్ పుస్తకాల గ్రామం కేవలం పుస్తకాల సముదాయం కాదు… ఇది జ్ఞానం, సాహిత్యం, సంస్కతి పట్ల ప్రేమను సూచించే ఒక జీవంతమైన సంస్కతి. ఇది ఒక అద్భుతమైన సామాజిక ప్రయోగం. సామూహిక ప్రయత్నం ఒక గ్రామాన్ని ఎంత మంచిగా మార్చగలదో చూపిస్తుంది. ప్రకతి సౌందర్యంతో కూడిన ఈ గ్రామంలో పుస్తకాలు చదవడం ఆనందకరమైన, శాంతియుతమైన అనుభవం. ఇది పాఠకులను మాత్రమే కాకుండా, జ్ఞానానికి, మానవీయతకు ప్రాముఖ్యతనిచ్చే ప్రతి ఒక్కరినీ ఆహ్వానించే ఒక అద్భుతమైన ప్రదేశం. భిలార్‌కి చేసే ప్రయాణం, సాంకేతికతా యుగంలో కూడా పుస్తకాల ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది.
డా|| రవికుమార్ చేగొని, 9866928327