77 ఏండ్ల వయసులోనూ మహిళల హక్కుల కోసం ఓ సామాజిక కార్యకర్తగా గొంతు విప్పారు. తన అక్షరాలతో సమాజంలో మార్పు కోసం తపిస్తున్నారు. నిజజీవితంలో జరుగుతున్న పోరాటాలను పుస్తకాలుగా మలుస్తున్నారు. ఆమే ప్రముఖ కన్నడ రచయిత్రి బాను ముష్తాక్. ముస్లిం మహిళల భావోద్వేగాలను గుదిగుచ్చి ఆమె రచించిన హార్ట్ లాంప్‌కు ఇటీవలె ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. అంతే కాదు ఈ బహుమతి అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు.
రచయిత్రి, న్యాయవాది, కార్యకర్త బాను ముష్తాక్‌ను భారతీయ సాహిత్యానికి చారిత్రాత్మక విజయంగా మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. తన చిన్న కథల సంకలనం ‘హార్ట్ లాంప్’కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి కన్నడ రచయిత్రిగా ముష్తాక్ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నారు. 12 కథలు ఉన్న ఈ సంకలనం 1990 నుండి 2023 వరకు మూడు దశాబ్దాలుగా కర్ణాటకలో సాగుతున్న ముస్లిం మహిళల దైనందిన పోరాటాలను వివరిస్తుంది. 2024లో ఈ పుస్తకం ఇంగ్లీష్ పెన్ అనువాద అవార్డును కూడా గెలుచుకుంది.
ఎంపిక ఇలా…
స్పష్టమైన కథనం, కథను నడిపించే తీరు ‘హార్ట్ లాంప్’ను అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. ఈ బుకర్ ప్రైజ్ న్యాయ నిర్ణేతలు అనువాదకుల ప్రతిభను కూడా గుర్తిస్తారు. ఈ బహుమతి మొత్తం 52 లక్షలు ఉంటుంది. దీన్ని సమానంగా ఇద్దరికీ విభజిస్తారు. రచయితకు 26 లక్షలు, అనువాదకునికి 26 లక్షలు అందిస్తారు. న్యాయనిర్ణేతలు ప్రచురణ కర్తల నుండి వచ్చిన 154 పుస్తకాల నుండి ఉత్తమ పుస్తకాన్ని ఎంపిక చేస్తారు. ‘హార్ట్ లాంప్’ దక్షిణ భారతదేశంలోని ముస్లిం సమాజంలోని మహిళలు, బాలికల దైనందిన జీవితాలను ప్రతిబించిస్తుంది.
విద్యార్థిగా ఉన్నపుడే…
కర్ణాటకలోని హసన్ అనే ప్రాంతం నుండి వచ్చిన ముష్తాక్ పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే తన మొదటి చిన్న కథ రాశారు. 26 ఏండ్ల వయసులో ప్రముఖ కన్నడ పత్రిక ప్రజామాతలో తన మొదటి కథ ప్రచురితమైనప్పుడు ఆమె రచన ప్రపంచాన్ని ఒక తుఫానులా ముంచెత్తింది. బుకర్ ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టిన వివరాల ప్రకారం ఆమె ఆరు చిన్న కథా సంకలనాలు, ఒక నవల, ఒక వ్యాస సంకలనం, ఒక కవితా సంకలనాన్ని రచించారు.
ప్రేరణ పొందారు
బుకర్ ప్రైజ్ ఫౌండేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముష్తాక్ కర్ణాటకలో పెరుగుతున్నప్పుడు డెబ్బైలలో దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, భాషా ఉద్యమం, మహిళా పోరాటాలు, పర్యావరణ క్రియాశీలత నుండి ప్రేరణ పొందానని తెలియజేశారు. ‘అట్టడుగు వర్గాల జీవితాలు, మహిళలు, నిర్లక్ష్యం చేయబడిన వారి జీవితాలతో ఏర్పడిన నా ప్రత్యక్ష సంబంధం, వారి వ్యక్తీకరణలతో పాటు, నాకు రాయడానికి బలాన్ని ఇచ్చింది. మొత్తంమీద కర్ణాటక సామాజిక పరిస్థితులు నన్ను రూపొందించాయి’ అని ఆమె బుకర్ ప్రైజ్ ఫౌండేషన్‌తో పంచుకున్నారు.
విస్తృతమైన పరిశోధనలో…
ఆమె చేస్తున పనిని గురించి ప్రశ్నించినప్పుడు నిజ జీవితాలను, వారు చేస్తున్న పోరాటాలను చూస్తూ వారి నుండి ప్రేరణ పొందుతున్నందున ఆమె ‘విస్తృతమైన పరిశోధన’లో పాల్గొనగలిగానని చెప్పారు. ‘నా హృదయమే నా అధ్యయన రంగం’ అని ఆమె అన్నారు. మహిళా హక్కుల పోరాట యోధురాలుగా ఉన్న ముష్తాక్ సహాయం కోసం తన వద్దకు వచ్చిన మహిళల కథలతో ప్రేరణ పొంది, కదిలారు. మతపరమైన, కుల అణచివేతకు వ్యతిరేకంగా కూడా ఆమె తన గళాన్ని వినిపించారు.
వినబడని స్వరాల సమూహం
ఈ పుస్తకం షార్ట్ లిస్టుకు ఎంపికైనప్పుడు ముష్తాక్ మాట్లాడుతూ ‘ఇది నా విజయం మాత్రమే కాదు, తరచుగా వినబడని స్వరాల సమూహం. నేను దీన్ని పాఠకులకు, కన్నడ ప్రేమికులకు, మంచి హృదయాలు కలిగిన భారతీయులకు అంకితం చేస్తున్నాను. నా కథలు సామాజిక సంక్షోభాలు, భావోద్వేగాలు, వ్యక్తిగత ప్రతిస్పందనల నుండి ఉద్భవించాయి. వీటిలో కొన్ని కథలు రాయడానికి వారం పట్టింది, కొన్నింటికి పది రోజులు పట్టింది. ప్రేరణ అవసరం లేదు. బాధ, నిస్సహాయత, కోపం మాత్రమే సరిపోతుంది. నేను ఏడుస్తున్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు కథలు రాశాను’ అని అన్నారు. ఈ సంకలనాన్ని ఆంగ్లంలోకి అనువదించిన దీపా భస్తికి సైతం ముష్తాక్‌తో పాటు అంతర్జాతీయ బుకర్ బహుమతి లభించింది. ఈ విజయంతో ముష్తాక్ ఇప్పుడు 1969లో ప్రారంభమైనప్పటి నుండి ఈ గౌరవనీయమైన బహుమతిని గెలుచుకున్న భారతీయుల జాబితాలో చేరారు. ఇప్పటి వరకు ఈ బహుమతిని అందుకున్న వారిలో వి.ఎస్. నైపాల్, సల్మాన్ రష్దీ, అరుంధతి రారు, కిరణ్ దేశారు, అరవింద్ అడిగా, గీతాంజలి శ్రీ ఉన్నారు.