Thursday, June 5, 2025
E-PAPER
Homeమానవిపుస్త‌కాలు మాట్లాడతాయి

పుస్త‌కాలు మాట్లాడతాయి

- Advertisement -

టీనేజర్లందరూ మొబైల్స్‌కు అతుక్కుపోతున్న ఈ రోజుల్లో 17 ఏండ్ల సియా భగత్‌ మాత్రం దీనికి భిన్నంగా వుంది. ఇంత చిన్న వయసులోనే నాలుగు పుస్తకాలు రచించింది. పుస్తకాలు సైతం మాట్లాడతాయని తన అన్వేషణలో తెలుసుకుంది. తన రచనలతో సమాజంలో సానుకూల మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సామాజిక స్పృహే ఆమెకు రచనా ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది. ఇటీవలె ఆమె రచించిన ది సింఫనీ ఆఫ్‌ వర్డ్స్‌ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆ యువ రచయిత్రి మనోభావాలు…
గత ఏడాది విడుదలైన సియా భగత్‌ ‘ఎ సింఫనీ ఆఫ్‌ వర్డ్స్‌’ ఒక చిన్న పుస్తకం. కానీ అది ఒక అందమైన కథ. పాఠకులను పుస్తక ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడ పుస్తకాలు ఎన్నో మాట్లాడతాయి, భావోద్వేగాలను బయటకు తెస్తాయి. పుస్తకంలోని కథానాయిక అయిన మిలా… దుమ్ముతో నిండిపోయిన ఉన్న పాత పుస్తక దుకాణాన్ని నడుపుతున్న తన అత్తతో తన వేసవి సెలవులను గడపడానికి వస్తుంది. అయితే వచ్చినప్పుడు ఆమెకు పుస్తకాల గురించి ఏమీ తెలియదు. కానీ ఇది సాధారణ పుస్తక దుకాణం కాదని అతి తక్కువ కాలంలోనే తెలుసుకుంటుంది. దుమ్ముతో నిండి ఉన్న ఆ దుకాణాన్ని వెదుకుతున్నపుడు మిలాకు పుస్తకాలు కూడా మాట్లాడగలవని తెలుసుకుంది.
ప్రియమైన పుస్తక దుకాణంలో…
పుస్తకాల వెనుక చాలా జ్ఞానం, రహస్యం, మాయాజాలం ఉందని మిలా తెలుసుకుంది. ది గ్రేట్‌ గాట్స్‌బైను చదివినప్పుడు ఆమెకు ఈ పుస్తకంలో విలాసవంతమైన జీవితం కనిపించింది. ఈ పుస్తకం ‘దుమ్ముతో నిండిన పాత షెల్ఫ్‌లో కూర్చోవడం కోసం కాదు, నిర్లక్ష్యంగా ఉన్న కొంతమంది యువత చేత హింసించబడటానికి మాత్రమే’ అని గుర్తుచేస్తే అన్నే ఆఫ్‌ గ్రీన్‌ గేబుల్స్‌ ‘ప్రియమైన పుస్తక దుకాణంలో నిండిన ప్రేమను చూసి’ ప్రకాశిస్తున్నట్లు ప్రకటించింది. మిలా రాంబ్లింగ్స్‌ ఓవర్‌ ది మార్నింగ్‌ హిల్స్‌ అనే పుస్తకాన్ని నిజంగా ఆనందానికి దారితీసేది ఏమిటని అడిగినప్పుడు, సమాధానం కచ్చితంగా ఇది అని చెప్పలేకపోవడం ఆమెను బాధించేది. ఆనందం అనేది వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అర్థాలను కలిగిస్తుందని ఆమె అర్థం చేసుకుంటుంది. అదే ఆమెను సంతోషపరిచే దాని గురించి ఆలోచించేలా చేస్తుంది. వింతైన, మర్మమైన పుస్తక దుకాణం చుట్టూ నడిచే ఈ చిన్న నవల అందరినీ ఆకర్షిస్తుంది. ‘నేను పెద్దయ్యాక రచయిత కావాలని కలలు కన్నాను, అయితే రాయడానికి పెద్దయ్యే వరకు వేచి వుండాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాను’ అని అంటుంది సియా.
రచనకు తిరిగి వచ్చి
సియా తొమ్మిదేండ్ల వయసులో ఇంగ్లీష్‌ టీచర్‌ ప్రోత్సహంతో తన మొదటి పుస్తకం ‘ఇలస్ట్రేటెడ్‌ పిల్లల పుస్తకం’ ప్రచురించింది. సుమారు 12 పేజీలు మాత్రమే ఉన్న ఈ చిన్న పుస్తకంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. అనాథ బాలిక కథను మనకు తెలియజేస్తుంది. ప్రస్తుతం ముంబైలో 11వ తరగతి చదువుతున్న సియా అప్పటి నుండి కథలు చెబుతూనే ఉంది. దీంతో పాటు ఆమె రచయితగా అరంగేట్రం చేసినప్పటి నుండి మరో మూడు పుస్తకాలను ప్రచురించింది. చాలా ఏండ్ల విరామం తర్వాత ఆమె కొత్త ఆలోచనలతో రచనకు తిరిగి వచ్చింది. ఆమె ఇటీవలి రచనలలో డేర్‌ టు డ్రీమ్‌ ఒకటి. ఇది గణితం, విజ్ఞాన శాస్త్రంలో విస్మరించబడిన మహిళల సహకారాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. అలాగే పఠనా ప్రేమను తిరిగి కనుగొనడం గురించి తెలియజేసే నవల ఎ సింఫనీ ఆఫ్‌ వర్డ్స్‌.
వ్యక్తిగత అనుభవం నుండి
‘చాలా మంది మహిళా గణిత శాస్త్రవేత్తలు వారి నైపుణ్యానికి, సేవలకు తగిన గుర్తింపును పొందలేదని నేను భావించాను, యువతులు ఆ రంగాలకు సరిపడరనే వాతావరణంలో పెరుగుతున్నారు’ అంటూ సియా ఈ ఏడాది ప్రారంభంలో ప్రచురించిన డేర్‌ టు డ్రీమ్‌ రచనకు గల కారణాన్ని వివరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రచురించబడిన సింఫనీ ఆఫ్‌ వర్డ్స్‌లో సుదీర్ఘ విరామం తర్వాత పాఠకులతో తిరిగి కనెక్ట్‌ అయ్యే వారి గురించి ఉంటుంది. ఇది ఆమె వ్యక్తిగత అనుభవం నుండి రచించింది. ‘ఈ పుస్తకం పఠనం పట్ల ప్రేమను, పఠనం చూపే ప్రభావాన్ని తిరిగి కనుగొనడం గురించి’ అని ఆమె పంచుకుంది. ఇందులోని కథానాయిక కోసం తనను తాను ఆధారంగా చేసుకుంటుంది. అయితే ఇతర పాత్రలు ప్రసిద్ధ పుస్తకాలు మనుషులైతే ఎలా ఉంటాయో సూచిస్తాయి. ఊహ, సృజనాత్మకతతో రూపొందించబడిన కథ చెప్పడంలో ఇది ఒక ప్రత్యేకమైన విధానం.
స్ఫూర్తినిచ్చిన రచయితలు
రచనల విషయంలో తన ప్రేరణల గురించి అడిగినప్పుడు.. సియా తన ఇంగ్లీష్‌ ఉపాధ్యాయులను, ఆమె చదవడానికి ఇష్టపడే పుస్తకాల గురించి వివరించింది. ది ఫోర్టీ రూల్స్‌ ఆఫ్‌ లవ్‌ రచయిత టర్కిష్‌, బ్రిటిష్‌ నవలా రచయిత ఎలిఫ్‌ షఫాక్‌ను ఆమె ప్రత్యేకంగా ఆరాధిస్తుంది. ‘ఆమె రచనా శైలి, విషయాలను వివరించే విధానం నాకు నిజంగా చాలా ఇష్టం. ఆమె రచనలు చదివినప్పుడు వాటిని మనం స్పష్టంగా చూడగలిగేలా, ఆ విషయాలను ఊహించుకునేలా చేస్తుంది. ఆమె రచన దాదాపు కవితాత్మకంగా అనిపిస్తుంది. నేను కూడా అలాంటి రచయిత కావాలనుకుంటున్నాను’ అని సియా పంచుకుంది.
చదువుతోపాటు…
సియా ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రురాలయ్యేంత వరకు తన రచనను నిలిపివేయాలని యోచిస్తోంది. ‘నేను కళాశాలకు వెళ్లే ముందు మళ్ళీ రాయడం ప్రారంభించాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడైతే నాకు రాసేందుకు చాలా సమయం ఉంటుంది’ అని ఆమె చెప్పింది. ఆమె యునైటెడ్‌ స్టేట్స్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్‌, భౌతికశాస్త్రం చదవాలనే లక్ష్యం పెట్టుకుంది. చదువుతో పాటు తనలోని సృజనాత్మకనూ సమతుల్యం చేసుకోవాలని యోచిస్తోంది. ఆమె దృష్టి ప్రధానంగా ఫిక్షన్‌పై ఉన్నప్పటికీ ఇతర శైలులను అన్వేషించడానికి కూడా సిద్ధంగా ఉంది. ‘నేను రాసే ప్రతిసారీ, ఆ సమయంలో నాకు స్ఫూర్తినిచ్చే దాని గురించి ఆలోచించాలనుకుంటున్నాను’ అని ఆమె చెప్పింది.
సామాజిక కోణంలో…
సియాను ప్రేరేపించేది కేవలం రచన మాత్రమే కాదు. ఆమె తన రచనలు సామాజ మార్పు కోసం ఉపయోగించాలి అనుకుంటోంది. సింఫనీ ఆఫ్‌ వర్డ్స్‌ పుస్తకం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం వీధి కుక్కల సంక్షేమానికి, వెనుకబడిన బాలికల కోసం, ఖగోళ భౌతిక శాస్త్ర తరగతులకు విరాళంగా ఇస్తుంది. డేర్‌ టు డ్రీమ్‌ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును కూడా యువతులకు విద్యను అందించేందుకు ఉపయోగిస్తుంది. ఆమె రచనలు చేయడానికి అవసరమైన సమయాన్ని, అవకాశాన్ని, వాతావరణాన్ని కల్పిస్తున్న కుటుంబ సభ్యులను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -