– గణతంత్ర దినోత్సవాన రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల అందజేత
– లాంఛనంగా ప్రారంభించనున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
– వివరాలు వెల్లడించిన ఏడీఏ పెంటేల రవి కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం రైతులకు ఊరటనిస్తోందని సహాయ వ్యవసాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ తెలిపారు. యాంత్రీకరణ తో సాగు సరళీకరణ జరగడమే కాకుండా ఆధునిక పద్ధతుల వినియోగం పెరిగి దిగుబడులు మెరుగుపడే అవకాశం ఉందని లబ్ధిదారులు అభిప్రాయ పడుతున్నట్లు ఆయన చెప్పారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో ఇప్పటికే అర్హులైన రైతులకు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేశారని తెలిపారు.
అశ్వారావుపేట, దమ్మపేట మండలాల రైతులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (జనవరి 26) అశ్వారావుపేట రైతు వేదికలో వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరుకానున్నారు.
ఈ పథకం కింద స్ట్రా బేలర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, బ్రష్ కట్టర్లు, కల్టివేటర్లు, ఎంబీ ప్లవ్‌లు, డిస్క్ హార్రోలు, పవర్ స్ప్రేయర్లు తదితర యంత్రాలను రైతులకు అందజేయనున్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాల్లో మొత్తం 137 మంది రైతులు వివిధ యంత్ర పరికరాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.71.60 లక్షలు కాగా, రైతులు తమ వాటాగా రూ.40.96 లక్షల ను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించారు. మిగిలిన రూ.30.64 లక్షల ను ప్రభుత్వం సబ్సిడీ గా భరిస్తోంది.
మండలాల వారీగా సబ్సిడీ వివరాలు
మండలం దరఖాస్తులు రాయితీ (రూ.లక్షల్లో)
అన్నపురెడ్డిపల్లి 26 8.89
అశ్వారావుపేట 17 2.03
చండ్రుగొండ 25 5.48
దమ్మపేట 18 2.82
ములకలపల్లి 51 11.39
మొత్తం 137 30.64



