Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంపాట, నృత్యం శ్రమ నుంచి పుట్టినవే

పాట, నృత్యం శ్రమ నుంచి పుట్టినవే

– నిత్య అధ్యయనంతోనే ముందడుగు
– పిల్లలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పడమే బాలోత్సవం లక్ష్యం : సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
– సాంస్కృతిక శాఖ, బాలోత్సవం ఆధ్వర్యంలో సకల కళల నృత్య సమ్మేళనం
– ఆకట్టుకున్న పిల్లల శాస్త్రీయ, జానపద, పాశ్చాత్యనృత్య ప్రదర్శనలు
– విజేతలకు బహుమతులు అందజేసిన వోలేటీ పార్వతీశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పాట, నృత్యం అనేవి శ్రమ నుంచి పుట్టినవే అని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో సకల కళల నృత్య సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథులుగా సుద్దాల అశోక్‌తేజ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ హంస పురస్కార స్వీకర్త వోలేటి పార్వతీశం హాజరయ్యారు. ప్రారంభోతవ్సం సందర్భంగా అశోక్‌తేజ మాట్లాడుతూ..మానవ పరిణామ క్రమంతో పాటు నృత్యరీతులు అభివృద్ధి చెందిన క్రమాన్ని సోదాహరణంగా ఉదహరించారు. సాంస్కృతిక, భౌగోళిక సరిహద్దులను అధిగమించడానికి నృత్యం ఒక శక్తిగా దోహదపడుతుందన్నారు. నృత్తం, నృత్యం మధ్య ఉన్న తేడాలను వివరించారు. పిల్లల్లో మనస్సుల్లో కొత్తరకాల విత్తనాలను జల్లడం, వారికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పడం బాలోత్సవం ముఖ్య లక్ష్యమని నొక్కి చెప్పారు. తమకన్నీ వచ్చనే భావనను విడనాడి నిత్యం నేర్చుకునే తత్వాన్ని పెంపొందిచుకోవాలని పిల్లలకు సూచించారు. నిత్య అధ్యయనంతోనే జీవితంలో ముందడుగు వేయగలుగుతామని తెలిపారు. ప్రభుత్వ డ్యాన్స్‌, మ్యూజిక్‌ కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ సువర్ణలత మాట్లాడుతూ…సమాజంలోని మంచి ఏది? చెడు ఏది? అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే మెరుగైన సాధనం కళ అని చెప్పారు. శాస్త్రీయ, జానపద, ప్రాశ్చాత్య నృత్యప్రదర్శనలను ఒకేదగ్గరకు చేర్చి పిల్లలతో ప్రదర్శింపజేయడం అభినందనీయమన్నారు. బాలోత్సవం ఆధ్వర్యంలో నృత్యగురువులకు వర్క్‌షాపు నిర్వహిస్తే మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పారు. వోలేటి పార్వతీశం మాట్లాడుతూ..అన్ని నృత్యరీతులను తెలంగాణ బాలోత్సవం వేదికపై ప్రదర్శించడం ప్రశంసనీయమన్నారు. ఒక్కొక్క నృత్యానికి ఒక్కొక్క గొప్పతనం ఉందని చెప్పారు. అన్ని రకాల నృత్య కళాకారులను ఒకే వేదికపై తీసుకొచ్చి ప్రజలను చైతన్యపర్చడం గొప్ప విషయమని కొనియాడారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు జరిగిన సకళ కళల నృత్య సమ్మేళనంలో వెయ్యిమందికిపైగా హాజరయ్యారు. 50 మంది గురువుల నేతృత్వంలోని బృందాలు 9 నాట్యరీతులను చిన్నారులు ప్రదర్శించారు. వారి ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సాయంత్రం జరిగిన సభలో బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నృత్య గురువు వోలేటి రంగమణి, కథక్‌, విలాసిని నృత్య గురువు సంజరుకుమార్‌ జోషి, రిటైర్డ్‌ జడ్జి మాల్యాద్రి, ఎస్‌వీకే మేనేజింగ్‌ ట్రస్టు కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌, తెలంగాణ బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎన్‌.సోమయ్య, ఉపాధ్యక్షులు సుజావతి, కోశాధికారి బుచ్చిరెడ్డి నాట్యగురువులు జేసీ. వీరభద్రం, ఇందిరా పరాశరం, రాజేశ్వరి శ్రీధర్‌, మాధవిశర్మ, రమణి సిద్ధి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img