Sunday, June 29, 2025
E-PAPER
Homeహెల్త్హద్ద్దులు లేని కోరికలు

హద్ద్దులు లేని కోరికలు

- Advertisement -

ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు సమాజాన్ని కలచివేశాయి. ఒకటి, పెళ్లైన కొద్ది రోజులకే భర్తను భార్య హత్య చేయడం. మరొకటి, 16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయడం. ఈ రెండు సంఘటనలు ప్రేమ, వ్యామోహం, కామం అనే మానవ భావోద్వేగాల మధ్య ఉన్న సన్నని గీతను, అవి సరిహద్దులు దాటితే ఎలాంటి విషాదాలకు దారితీస్తాయో స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా జరిగిన ఒక సంఘటనలో, పెళ్లైన కొద్ది రోజులకే భార్య తన భర్తను హత్య చేసింది. ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.
వ్యామోహం: ఈ వివాహం కేవలం వ్యామోహం వల్ల జరిగిందా? పెళ్లికి ముందు ఇద్దరి మధ్య లోతైన అవగాహన, ప్రేమ కంటే కేవలం ఉపరితల ఆకర్షణ, తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయా?


వాస్తవికతను విస్మరించడం: వివాహ బంధం అనేది కేవలం శారీరక ఆకర్షణ లేదా ఆదర్శీకరణపై ఆధారపడదు. దీనికి సహనం, అవగాహన, ఒకరినొకరు అంగీకరించడం అవసరం. బహుశా, ఆ వధువు తన భర్తను ఆదర్శంగా ఊహించుకొని, వాస్తవాలను జీర్ణించుకోలేకపోయిందా?
కామం ప్రభావం: ఈ హత్య వెనుక కేవలం లైంగిక కోరికలు, లేదా వాటి అసంతప్తి ఉన్నాయా? బంధంలో భావోద్వేగ అనుబంధం లేనప్పుడు, కేవలం శారీరక కోరికలు మాత్రమే ప్రాధాన్యత వహిస్తాయి. అవి తీరనప్పుడు తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు.
మానసిక స్థితి: ఇటువంటి తీవ్రమైన చర్యకు పాల్పడటానికి ఆ వధువు మానసిక స్థితి ఎలా ఉంది? డిప్రెషన్‌, ఆవేశం, మరేదైనా మానసిక సమస్యలు దీనికి కారణమా?
ఈ కేసులో, బంధం లోతు లేకపోవడం, వాస్తవికతను అంగీకరించకపోవడం, బహుశా వ్యక్తిగత కోరికలు తీరకపోవడం వంటి అంశాలు ఈ దారుణానికి కారణమై ఉండవచ్చు.
మరొక కలవరపరిచే సంఘటనలో, 16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడింది. ఈ సంఘటన మరింత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇందులో టీనేజ్‌ పిల్లలు పాలుపంచుకున్నారు.
వ్యామోహంలో చిక్కుకోవడం: ఈ వయసులో వ్యామోహం చాలా సాధారణం. సినిమాటిక్‌ ప్రేమకథలను నిజమని నమ్మి, ప్రియుడిని ఆదర్శంగా భావించి, అతనితో కలిసి ఏదైనా చేయడానికి సిద్ధపడే స్థితి ఇది. ఇక్కడ బాలిక తన ప్రియుడి పట్ల తీవ్రమైన ఆకర్షణతో, అతనిని ఆదర్శీకరించి, లోపాలను చూడలేకపోయి ఉండవచ్చు.
కామం, పీర్‌ ప్రెషర్‌: టీనేజ్‌ వయస్సులో లైంగిక కోరికలు బలంగా ఉంటాయి. ఈ వయస్సులో సరైన మార్గదర్శనం లేకపోతే, కామం సరిహద్దులు దాటి ప్రమాదకరమైన నిర్ణయాలకు దారి తీయవచ్చు. స్నేహితుల ప్రభావం, ప్రియుడి ఒత్తిడి కూడా ఇటువంటి నిర్ణయాలపై ప్రభావం చూపి ఉండవచ్చు.
అర్థం చేసుకోలేని పరిణామాలు: 16 ఏళ్ల వయస్సులో, తమ చర్యల దీర్ఘకాలిక పరిణామాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు. క్షణికావేశంలోనో ఎవరో చెప్పిన మాటలు విని, తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కుటుంబ వాతావరణం, పెంపకం: ఈ బాలికకు సరైన మార్గదర్శనం, కుటుంబ మద్దతు లభించిందా? భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో నేర్పారా?
ఈ రెండు సంఘటనలు, ప్రేమ పేరుతోనో, వ్యామోహం పేరుతోనో, కామం పేరుతోనో వ్యక్తులు తమ ఆలోచనలను, చర్యలను నియంత్రించుకోలేనప్పుడు, ఎలాంటి దారుణాలకు పాల్పడతారో చూపిస్తున్నాయి. సంబంధాలలో భావోద్వేగ లోతు, గౌరవం, వాస్తవికత లేకపోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటనలు హెచ్చరిస్తున్నాయి. సమాజంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మానసిక ఆరోగ్య నిపుణులు ప్రేమ, వ్యామోహం, కామం మధ్య ఉన్న తేడాలను, వాటి ఆరోగ్యకరమైన వ్యక్తీకరణ మార్గాలను బోధించడం అత్యవసరం.
తరువాత వారం వ్యామోహం గురించి తెలుసుకుందాం.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -