Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంఏపీలో బల్క్‌ డ్రగ్‌ పార్కుకు బ్రేక్‌

ఏపీలో బల్క్‌ డ్రగ్‌ పార్కుకు బ్రేక్‌

- Advertisement -

– సమస్య పరిష్కారమయ్యేవరకు పనులు ఆపండి : హోంశాఖ మంత్రి అనిత
– మత్స్యకారుల పోరాటంతో ఆదేశాలు జారీ

– సిఎం, డిప్యూటీ సిఎం వద్దకు అఖిలపక్షం
– పూర్తిగా రద్దు చేసేంతవరకు దీక్షలు కొనసాగిస్తాం : మత్స్యకారుల ప్రకటన
నక్కపల్లి :
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్‌డ్రగ్‌ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. పనులను తాత్కాలికంగా ఆపివేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రకటించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పనులను ఆపాలని ఆదేశించినట్లు అనిత తెలిపారు. అయితే, మత్స్యకారులు మాత్రం బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయాలని, అంత వరకు తమ నిరాహార దీక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. అంతకుముందు మత్స్యకారులు నిర్వహిస్తున్న నిరాహారదీక్ష శిబిరం వద్దకు హోంశాఖ మంత్రి అనిత వెళ్లారు. మత్స్యకార నాయకులు, రాజకీయ పార్టీల నేతలు బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు వల్ల జరిగే నష్టాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారుల ఉపాధి, ఉనికిని దెబ్బతీసే దీనిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని కోరారు. హోంమంత్రి మాట్లాడుతూ, రాజయ్యపేట గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు కమిటీగా ఏర్పడితే, వారందరినీ దసరా వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దగ్గరకు తీసుకెళ్తానని హామీ ఇచ్చి బయలుదేరుతుండగా, మత్స్యకారులంతా ఒక్కసారిగా ఆమె కాన్వారును అడ్డగించారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు నిలుపుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో మంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు తలపెట్టాయని, తాను మాట ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పారు. ఈ సమాధానంతో ఆగ్రహించిన మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై తాటి చెట్టును అడ్డుగా పెట్టి, బైఠాయించారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, మత్స్యకారులు ఎదురు తిరిగారు. తమ ఉనికిని, ఉపాధిని దెబ్బతీసే బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను పూర్తిగా రద్దు చేస్తామన్న హామీ ఇచ్చేవరకు కదలనివ్వబోమని ప్రకటించారు. గతంలో హెటిరో డ్రగ్స్‌ పైప్‌లైన్‌ వేసే సందర్భంలో తామంతా చేపట్టిన ఆందోళనలో పాల్గొని కంపెనీకి వ్యతిరేకంగా అనిత మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. మత్స్యకారులకు చేపల వేట తప్ప, మరే వృత్తి రాదని, సముద్రానికి దూరం చేయొద్దని కోరారు. పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ, మత్స్యకారులు రోడ్డుపై నుంచి పక్కకు జరగలేదు. హోం మంత్రి కారులో నుంచి బయటకు వచ్చి సమస్య పరిష్కారమయ్యే వరకు బల్క్‌డ్రగ్‌ పార్క్‌ పనులను ఆపుతామని హామీ ఇచ్చారు. ఈ హామీతో మత్స్యకారులు శాంతించడంతో మంత్రి అక్కడి నుండి బయలు దేరారు. అనంతరం పాయకరావుపేట వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాజయ్యపేట వాసులతో పాటు, అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేస్తామని, వారిని సిఎం, డిప్యూటీ సిఎం వద్దకు తీసుకువెళ్తానని చెప్పారు. ‘స్థానికుల వినతితో బల్క్‌డ్రగ్‌ పార్కు పనులు ఆపాలని ఆదేశించా. మత్స్యకారులతో ఎవ్వరూ రాజకీయాలు చేయవద్దు’ అని ఆమె అన్నారు. అయితే, మత్స్యకారులు మాత్రం బల్క్‌డ్రగ్‌ పార్కును పూర్తిగా రద్దు చేసేంతవరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించారు.

ఆవేదన నుంచి పుట్టికొచ్చిన పోరాటం : సిపిఎం
రాజయ్యపేటలో ఏర్పాటు చేయనున్న బల్క్‌డ్రగ్‌ పార్కును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణమే ప్రకటించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మత్య్సకారులు చేస్తున్న పోరాటం వారి కష్టాల నుండి, ప్రస్తుతం వారు పడుతున్న ఇబ్బందులు నుండి, హెటిరో డ్రగ్స్‌ మందుల కంపెనీ వల్ల కోల్పోతున్న ఉపాధి, వాయు, జల కాలుష్యం నుండి కేన్సర్లు తదితర వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఆవేదన నుండి పుట్టికొచ్చిన పోరాటం తప్ప ఎవరో బయటనుండి రెచ్చగొడితే రెచ్చిపోయి చేస్తున్న పోరాటం కాదని హోం మంత్రి వంగలపూడి అనిత గమనించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -