సోషల్ మీడియా తనిఖీలతో..
న్యూఢిల్లీ : అమెరికా విదేశాంగ శాఖ కొత్తగా చేపట్టిన సోషల్ మీడియా తనిఖీ విధానం కారణంగా మన దేశంలో హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. అనేక నియా మకాలు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి వీసా దరఖాస్తుదారులకు అడ్వయిజరీ జారీ చేసింది. ‘వీసా నియామకం రీషెడ్యూల్ అయిం దంటూ మీకు ఈ-మెయిల్ వచ్చిన పక్షంలో నూతన నియామక తేదీ విషయంలో మిషన్ ఇండియా సహాయం చేస్తుంది’ అని అందులో సూచించారు. రీషెడ్యూల్ గురించి తెలియజేసిన తర్వాత కూడా గతంలో తెలియజేసిన ఇంటర్వ్యూ తేదీ రోజున కాన్సులేట్‌కు వస్తే ప్రవేశం నిరాకరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం కూడా హెచ్చరించింది.
గతంలో తెలియజేసిన నియామక తేదీ రోజు వస్తే ఎంబసీ లేదా కాన్సులేట్‌లో ప్రవేశించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకూ షెడ్యుల్ చేసిన ఇంటర్వ్యూలను వచ్చే సంవత్సరం మార్చికి మార్చారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అయితే ఎన్ని ఇంటర్వ్యూలు రీషె డ్యూల్ అయ్యాయో కచ్చితంగా తెలియడం లేదు. సామాజిక మాధ్యమాలను తనిఖీ చేసే నిమిత్తం రాబోయే వారాలకు సంబంధించిన అనేక నియామ కాలను వచ్చే మార్చి నెలకు రీషెడ్యూల్ చేశారని ఓ అటార్నీ చెప్పారు.



