Sunday, October 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్కారు బడుల్లో విద్యార్థులకు అల్పాహారం!

సర్కారు బడుల్లో విద్యార్థులకు అల్పాహారం!

- Advertisement -

వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభం
వంట కార్మికులకు రూ.500 పారితోషికం
రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించే అవకాశమున్నది. ఇటీవల తమిళనాడు తరహాలో సీఎం అల్పాహారం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి గతనెల 25న చెన్నైలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అల్పాహారం పథకానికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది. వారంలో ఆరు రోజులు విద్యార్థులకు తరగతులుంటాయి. అందులో మూడు రోజులు అన్నంతో చేసిన అల్పాహారం (పులిహోర, కిచిడి, వెజిటబుల్‌ పొలావ్‌ వంటివి) ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.

మిగిలిన మూడురోజుల్లో రెండు రోజులు గోధుమ ఉప్మా రవ్వ లేదా టమాటా బాత్‌ మిగిలిన ఒకరోజు ఇడ్లీ, మైసూర్‌ బోండా వంటివి మెనూలో ఉండాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అల్పాహారం పథకంలో ఒక్కో విద్యార్థికి ఉన్నత పాఠశాలల్లో చదివే వారికి రూ.12, ప్రాథమిక పాఠశాలల్లో చదివే వారికి రూ.ఎనిమిది ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. వంట కార్మికులకు ప్రస్తుతం రూ.మూడు వేలు పారితోషికం ప్రభుత్వం చెల్లిస్తున్నది. అల్పాహారం పథకం ప్రవేశపెట్టిన తర్వాత రూ.మూడు వేలకు అదనంగా మరో రూ.500 పారితోషికం అదనంగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది.

పేద పిల్లలకు ఎంతో ప్రయోజనం
రాష్ట్రంలో 24,227 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో సుమారు 19 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారే ఉన్నారు. అందులోనూ అమ్మాయిలు సగం మంది వరకు ఉంటారు. అయితే అందరూ పేద విద్యార్థులే కావడం గమ నార్హం. పట్టణాల్లో ఎక్కువ మంది ప్రయివేటు పాఠశాలలకే విద్యార్థులను పంపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్థిక స్తోమత ఉన్నవారు ప్రయివేటు బడులకు పంపడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఓ కారణంగా ఉన్నది. అయినా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థిక స్తోమత లేని వారు, ప్రయివేటు బడుల్లో ఫీజులు భరించలేని వారే ఇంకా చదువుతున్నారంటే అతిశయోక్తి కాదు. వారి తల్లిదండ్రులు రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర వృత్తులు చేసుకునే వారే ఎక్కువ.

దీంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో సగానికి ఎక్కువ మంది ఉదయం అల్పాహారం తినకుండానే బడులకు వస్తున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అల్పాహారం పథకం ఆ విద్యార్థులకు ఎంతో మేలు కలుగు తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరగడంతోపాటు చదువులో నాణ్యత కూడా మెరుగవుతుందని భావిస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2023, అక్టోబర్‌లో ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని కొన్ని పాఠశాలల్లో ప్రారంభించింది. వెంటనే ఎన్నికల కోడ్‌ రావడం, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకపోవడంతో ఆ పథకం అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అల్పాహారం పథకాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించడం గమనార్హం. మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలకే అల్పాహారం పథకాన్ని కూడా ఇవ్వాలని విద్యాశాఖ సమాలోచన చేస్తున్నట్టు సమాచారం.

మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు గ్యాస్‌ సిలిండర్లు
మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీలకు గ్యాస్‌ సిలిండర్లు అందించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేయాలని కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కట్టెల పొయ్యి మీద మధ్యాహ్న భోజనాన్ని వంట కార్మికులు వండుతున్నారు. దాని వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఎక్కువ సమయం పడుతుందన్న అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చిం ది. దీంతో అన్ని ఏజెన్సీలూ గ్యాస్‌ సిలిండర్లను వినియో గించాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే గ్యాస్‌ ఏజెన్సీలు సిలిండర్‌కు రూ.2,500 డిపాజిట్‌ చేయాలన్న నిబంధనతో మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్టు విద్యాశాఖ దృష్టికి వచ్చింది. అందుకే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ కోరింది.

వచ్చేనెల నుంచి టెన్త్‌ విద్యార్థులకు స్నాక్స్‌!
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్‌ ఇవ్వాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తున్నది. వచ్చేనెల నుంచి ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ప్రతి ఏటా జనవరి నుంచి పదో తరగతి విద్యార్థుల కు స్నాక్స్‌ ఇస్తారు. ఈ ఏడాది కొంత ముందే నవంబర్‌ నుంచే స్నాక్స్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ ఉపాధ్యాయులు, పలు సంఘాల నుంచి వస్తున్నది. దీంతో వచ్చేనెల నుంచి స్నాక్స్‌ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. అయితే స్నాక్స్‌ కోసం ఒక్కో విద్యార్థికి రూ.15 చెల్లిస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -