ఒక్కో విద్యార్థికి రూ.15తో స్నాక్స్ అందజేత..
నవతెలంగాణ – మల్హర్ రావు
పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించి, మెరుగైన ఫలితాల రావడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పది వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న వారికి అల్పాహారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో విద్యార్థులు ఆకలితోనే ప్రత్యేక తరగతులకు హాజరయ్యేవారు.
కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు అల్పాహారం అందించేవారు. ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు లేకపోవడంతో మెజార్టీ విద్యార్థులు ఆకలితోనే చదువులను కొనసాగించేవారు. ఎట్టకేలకు వీరి ఆకలి కష్టాలకు తెరపడనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే నిధులు విడుదల చేయున్నట్లుగా తెలుస్తోంది.జనవరి నెలలోనే ప్రారబించి మార్చి10 వరకు అల్పాహారం అందించనున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
కాగా దూరం నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం టిఫిన్ చేయకుండా వస్తున్నారు. వారు మధ్యాహ్న భోజనం వరకు వేచి ఉంటున్నారు. మధ్యాహ్నం తిన్న విద్యార్థులు రాత్రి 6.30 నుంచి 7 గంటల వరకు ఆహారం తీసుకునే పరిస్థితి లేదు. దీంతో వారిలో అలసట, నీరసం చేరి చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అల్పాహారం అందించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ఒక్కో విద్యార్థికి రూ.15
మండలంలో తాడిచెర్ల, మల్లారం, రుద్రారం, వళ్లెంకుంట, పెద్దతూండ్ల గ్రామాల్లో ఐదు హైస్కూల్స్, దుబ్బపేటలో ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల, ఎడ్లపల్లిలో ఒక మోడల్ స్కూల్ ఉన్నాయి. వీటిలో మొత్తం 190 మంది విద్యార్థులున్నారు. ఒక్కో విద్యార్థికి నిత్యం రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన వీరికి రోజుకు రూ.2,850 వేలు కాగా 60 రోజులకు సుమారుగా రూ.1.71 లక్షల నిధులు అవసరం ఉంది. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతో ఉదయం, సాయంత్రం అల్పాహారం అందేలా చర్యలు తీసుకోనున్నారు.



