నవతెలంగాణ - హైదరాబాద్ : 2025 సంవత్సరానికి సంబంధించి జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమించింది. జ్యూరీ కమిటీ సభ్యులుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఎస్. గోపాల్‌రెడ్డి, సీనియర్ నటి ప్రభలను నియమించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నియామకాలను ఖరారు చేసింది. జ్యూరీ కమిటీ నియామకానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని విజయవాడలోని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్-ఎఫ్ఏసీ) ఎస్. సురేశ్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువరించారు.






కామెంట్లు (0)