Magazines

బాలికపై చేయి చేసుకున్న బీజేపీ నేత..పోక్సో కేసు నమోదు

18 అక్టోబర్, 2026

BJP leader
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గర్బా పందిరి వద్ద 15 ఏళ్ల బాలికను తోసేసి, దురుసుగా ప్రవర్తించిన ఘటనలో బీజేపీ మండలాధ్యక్షుడు కమల్ చౌహాన్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అక్టోబర్ 15వ తేదీ రాత్రి ఇండోర్‌లోని హీరా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకేశ్వరి గర్బా పందిరికి ఓ 15 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి వచ్చింది. పాస్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా అక్కడ నిర్వాహకుడిగా ఉన్న బీజేపీ మండలాధ్యక్షుడు కమల్ చౌహాన్‌కు, బాలిక కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన చౌహాన్.. బారికేడ్ దాటి వచ్చి బాలికను చేతితో పట్టుకుని పలుమార్లు వెనక్కి తోసేశారు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని ఆయన అరుస్తుండగా, ఆ బాలిక ‘నన్ను ముట్టుకోవద్దు, ఇది సరైన పద్ధతి కాదు’ అని ప్రతిఘటించడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది.





బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న హీరా నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమల్ చౌహాన్‌పై పోక్సో చట్టంతో పాటు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 74 (మహిళల గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు.

ఈ ఘటనపై బీజేపీ నగర అధ్యక్షుడు సుమిత్ మిశ్రా స్పందించారు. కమల్ చౌహాన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ అంతర్గతంగా ఈ వీడియోపై విచారణ జరుపుతోందని తెలిపారు. మరోవైపు, బాలికతో దురుసుగా ప్రవర్తించాలనే ఉద్దేశం తనకు లేదని, పాస్ విషయంలో వాగ్వివాదం పెరగడంతో అలా జరిగిందని చౌహాన్ చెప్పినట్లు సమాచారం.

ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అదే గర్బా పందిరిలో కన్యా పూజ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరగడం సిగ్గుచేటని విమర్శించింది. నిందితుడు కమల్ చౌహాన్‌ను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్