నవతెలంగాణ-హైదరాబాద్: పిల్లలు సోషల్ మీడియా వాడకం, ఇంటర్నెట్ వినియోగంపై పలు దేశాల్లో బ్యాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియాలో కూడా ఆ తరహా ఆంక్షలు విధించాలని డిమాండ్ లు వస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా భారత్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ వినియోగం లేదా దానిని పొందే హక్కును ప్రాథమిక హక్కు అని, పిల్లలకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని పేర్కొంది. వయస్సు ఆధారంగా ఇంటర్నెట్ వాడకంపై నిషేధం విధించే ప్రతిపాదనను తిరస్కరించింది.
"రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మరియు ఆర్టికల్ 19(1)(a)ల ప్రకారం, ఇంటర్నెట్ను పొందేందుకు మరియు ఉపయోగించుకునేందుకు ఉన్న హక్కు ప్రతి వ్యక్తికి లభించే ప్రాథమిక హక్కు అని చెప్పడానికి మాకు ఎటువంటి సంకోచం లేదు" అని శుక్రవారం కోర్టు వ్యాఖ్యానించింది.
బాలల లైంగిక దోపిడీ,సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు తమ చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని ఆరోపిస్తూ.. బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్' వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జె.బి. పర్దివాలా , కె.వి. చంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు.






కామెంట్లు (0)