నవతెలంగాణ - హైదరాబాద్ : ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో ధాన్యం ఉత్పత్తి, సేకరణపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో కనీసం 15 నెలలకు సరిపడా సన్నబియ్యం బఫర్ నిల్వలను సిద్ధం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపడా 14 నెలల నిల్వలు ఉన్నాయని, అదనంగా మరో నెలకు సరిపడా బియ్యం సమకూర్చుకోవాలని సూచించారు.
రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యంతో పాటు పప్పు, నూనె వంటి మరిన్ని నిత్యావసర సరుకులను పంపిణీ చేసే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ధరల భారాన్ని తగ్గించేలా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే సరుకులను రేషన్ ద్వారా అందించే అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల టన్నుల సామర్థ్యంతో ఆధునిక సైలో గోదాములు నిర్మించాలని ప్రతిపాదించారు.
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. తొలివిడతలో రూ.2 వేల కోట్లతో చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్, వర్షపునీటి సంరక్షణ పనులను సంక్రాంతి తర్వాత ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐదు నెలల్లో రూ.10 వేల కోట్లతో ఎల్నినో ప్రభావ నియంత్రణ, నివారణ పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు పేర్కొన్నారు.







కామెంట్లు (0)