Magazines

పీఎఫ్‌ విత్‌డ్రా నిబంధనల్లో కీలక మార్పులు.. ఉద్యోగులకు మూడు వరాలు

2 గంటల క్రితం

Key changes to PF withdrawal rules: Three boons for employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఉపసంహరణ, సెటిల్మెంట్‌ విధానాల్లో ఈపీఎఫ్‌వో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.

నెలవారీగా పీఎఫ్‌ సొమ్ము పొందే అవకాశం

రిటైర్మెంట్‌ తర్వాత పీఎఫ్‌ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా సిస్టమాటిక్‌ విత్‌డ్రావల్‌ ప్లాన్‌ (SWP) అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఉద్యోగులు నెలవారీ, త్రైమాసిక లేదా ఆరు నెలలకు ఒకసారి తమకు అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. మిగిలిన సొమ్ముపై పీఎఫ్‌ వడ్డీ కొనసాగుతుంది. అయితే ఇది ఐచ్ఛిక సదుపాయం మాత్రమే. ఈపీఎస్‌ పెన్షన్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదు.

90 శాతం వరకు విత్‌డ్రా

గతంలో పీఎఫ్‌ ఖాతాలో కనీసం 25 శాతం సొమ్ము నిల్వ ఉంచాల్సి ఉండేది. తాజా నిర్ణయంతో ఈ పరిమితిని 10 శాతానికి తగ్గించారు. దీంతో అర్హత ఉన్న నిధుల్లో 90 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు ఖాతాలో రూ.10 లక్షలు ఉంటే రూ.1 లక్ష నిల్వ ఉంచి రూ.9 లక్షల వరకు తీసుకోవచ్చు. వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణం వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

ఉద్యోగం పోయిన రెండు నెలలకే పూర్తి సెటిల్మెంట్‌

ఉద్యోగం కోల్పోయిన వారు పూర్తి పీఎఫ్‌ సొమ్ము పొందేందుకు గతంలో ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత పూర్తి పీఎఫ్‌ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. అయితే ఈపీఎస్‌ పెన్షన్‌ నిధులకు సంబంధించిన 36 నెలల నిరీక్షణ వ్యవధిలో మార్పు లేదు.

ఈ నిర్ణయాలు అమల్లోకి రావడానికి కార్మిక శాఖ అధికారిక నోటిఫికేషన్‌తో పాటు అవసరమైన చట్టపరమైన మార్పులు జరగాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్