నవతెలంగాణ-హైదరాబాద్: 2017లో జరిగిన సైనిక చర్యల ద్వారా మయన్మార్ రోహింగ్యా మైనారిటీలపై మారణహోమం (వంశహత్య) జరిపిందని ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానమైన అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇచ్చిన చారిత్రక తీర్పును శరణార్థి శిబిరాల్లోని రోహింగ్యాలు హర్షంతో స్వాగతించారు. నెదర్లాండ్స్‌లోని హేగ్ నుంచి వెలువడిన తీర్పును ప్రత్యక్షంగా వీక్షించేందుకు కాక్స్ బజార్‌లోని భారీ శరణార్థి శిబిరంలో ఏర్పాటు చేసిన పెద్ద తెర వద్ద వందలాది మంది రోహింగ్యా శరణార్థులు గుమిగూడారు. తీర్పు వెలువడిన వెంటనే కొందరు కన్నీటి పర్యంతం కాగా, మరికొందరు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ గతంలో తాము ఎదుర్కొన్న అరాచకాలను గుర్తుచేసుకున్నారు.
ఒక దేశం వంశహత్యకు పాల్పడిందని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. నాజీ హోలోకాస్ట్ తర్వాత మారణహోమాన్ని రుజువు చేసే చట్టపరమైన ప్రమాణాలు నెరవేరాయని ఒక అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొనడం ఇది నాలుగోసారి. క్లియరెన్స్ ఆపరేషన్' పేరుతో మయన్మార్ సైన్యం పురుషులు, బాలురను మూకుమ్మడిగా హతమార్చడం, రోహింగ్యా మహిళలపై విస్తృతంగా అత్యాచారాలు, లైంగిక దాడులకు పాల్పడటం, వందలాది గ్రామాలను తగులబెట్టి ధ్వంసం చేయడం వంటి అంశాలను న్యాయస్థానం తన తీర్పులో ప్రస్తావించింది.
అమలుపై సందేహాలు :
కోర్టు తీర్పు తుది నిర్ణయమే అయినప్పటికీ, చట్టపరంగా కట్టుబడి ఉండేదే అయినప్పటికీ, దానిని అమలు చేసే ప్రత్యక్ష అధికారం న్యాయస్థానానికి లేదు. తీర్పును ఉల్లంఘిస్తే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించే అధికారం మాత్రమే కోర్టుకు ఉంటుంది. ఈ ఆదేశాలు ఏ మేరకు ఆచరణలోకి వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. శరణార్థుల రక్షణకు సంబంధించిన కోర్టు ఆదేశాలపై హేగ్‌లోని మయన్మార్ ప్రతినిధి బృందం లేదా మయన్మార్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.
బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లో తాము అనుభవించిన దారుణాలు, వంశహత్యకు గుర్తింపు లభించడం ఒక విజయమే అయినప్పటికీ, తమ కష్టాలు ఇక్కడితో తీరవని శరణార్థులు అంటున్నారు. "ఇది న్యాయానికి ఆరంభం మాత్రమే, మేము ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది" అని శిబిరంలోని కమ్యూనిటీ నేత మొహమ్మద్ రఫీక్ అన్నారు. రోహింగ్యాలను ఒక ప్రత్యేక జాతి సమూహంగా గుర్తించడం చారిత్రాత్మకమని, తమ సంస్కృతి, భాష, నేల మరియు ప్రత్యేక జాతి లక్షణాలను ఐసీజే స్పష్టం చేసిందని ఆయన తెలిపారు.






కామెంట్‌లు (0)