ఋతుస్రావం గురించి బయటకు మాట్లాడడం అంటేనే మన దేశంలో పెద్ద తప్పు. దీని కారణంగా ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను నిశ్శబ్దంగా భరిస్తున్నారు. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేందుకు నడుంబిగించారు ఇషు, శివ అనే ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు. పునర్వినియోగించే ఋతు ప్యాడ్‌లను ఉత్పత్తి చేయిస్తూ మహిళలకు ఆరోగ్యాన్ని, ఉపాధిని
అందిస్తున్నారు.
జైపూర్ మురికివాడలకు చెందిన మహిళలు ‘హర్ శక్తి’ సహకారంతో పునర్వినియోగించే ఋతు ప్యాడ్‌లను తయారు చేసే ఒక ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మహిళల అభివృద్ధికి పీరియడ్స్ ఎప్పుడూ అడ్డంకి కాకూడదనే ఓ ఆలోచన నుండి ఇది పుట్టింది. ఇషు, శివ అనే ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కలిసి స్థాపించిన సంస్థ ఇది. పేదరికాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన విద్య, స్థిరత్వం, ఉపాధిని కూడా ఇది అందిస్తోంది. యోగా ట్రైనర్, ఋతు ఆరోగ్య విద్యావేత్త అయిన శివ 2017లో గర్భాశయ క్యాన్సర్‌తో ఒక విద్యార్థి చనిపోవడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుడే ఆమె ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఇలాంటి విషాద సంఘటనలను నివారించవచ్చని ఆమె నమ్మారు.
భయంకర నిశ్శబ్దం
‘ఆ అమ్మాయి తన లక్షణాల గురించి ఎవరితోనే పంచుకోలేదు. కనీసం తన భర్తతో కూడా మాట్లాడలేకపోయింది. అంటే ఋతుస్రావం చుట్టూ ఉన్న అవమానం ఇంత తీవ్రంగా ఉంది’ అని శివ పంచుకున్నారు. ఈ సంఘటన ఆమెను పునరుత్పత్తి ఆరోగ్యం పట్ల భారతదేశంలో ఎంతటి భయంకర నిశ్శబ్దం దాగి వుందో, దాని వల్ల సంభవించే వినాశకరమైన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఆలోచించేలా చేసింది. అదే సమయంలో ఎడిన్‌బర్గ్ విద్యార్థిని మార్తా ఫ్లిన్ మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో క్లాత్ ప్యాడ్‌లను పరిచయం చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. తన పని సులభతరం చేసుకునేందుకు శివ ఆమెతో కనెక్ట్ అయ్యారు. అట్టడుగు మహిళల ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉమ్మడి లక్ష్యంతో పని ప్రారంభించారు. 2019లో వారు జైపూర్‌లో హర్ శక్తి సెంటర్‌ను ప్రారంభించారు. ఇది పునర్వినియోగించదగిన క్లాత్ ప్యాడ్‌లను ఉత్పత్తి చేయడానికి, అట్టడుగు మహిళలకు ఉపాధిని అందించడానికి రూపొందించబడింది.
‘పీరియడ్ పావర్టీ’ని అర్థం చేసుకోవడం
శానిటరీ ఉత్పత్తులు, వాటిని ఉపయోగించడానికి సరైన విద్య అందుబాటులో లేకపోవడం అనే పీరియడ్ ప్రావర్టీ(ఋతు పేదరికం) భారతదేశంలో మహిళలకు ప్రధాన అవరోధంగా ఉంది. దాస్రా అనే సంస్థ 2016లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో దాదాపు 23 మిలియన్ల మంది బాలికలు ఋతుస్రావ సంబంధిత సమస్యల కారణంగా ఏటా పాఠశాల నుండి తప్పుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 36 శాతం మంది మాత్రమే శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. పట్టణ గణాంకాలు కొంచెం మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ ఆర్థిక స్థోమత, అవగాహన ఇప్పటికీ ఆందోళనగానే ఉన్నాయి. కొన్ని కమ్యూనిటీల్లో లోదుస్తులు ధరించడం కూడా నిషిద్ధంగా పరిగణించబడుతుందని శివ గుర్తించారు. ‘అమ్మాయిలు రుతుస్రావం సమయంలో ఏమీ ఉపయోగించడం లేదు. కొందరు నడుముకు దారాలతో వస్త్రం కట్టుకోవడం మేము చూశాము. కొన్ని చోట్ల డిస్పోజబుల్ ప్యాడ్‌లు ఉన్నా ఖర్చు, మార్చుకునేందుకు సిగ్గు వంటి కారణాల వల్ల ఎక్కువ గంటలు వినియోగిస్తున్నారు’ అన్నారు. దాంతో అనేక ఇన్ఫెక్షన్‌లకు గురవుతున్నారు.
ఒక సహకార నమూనా
పై సమస్యల పరిష్కారం కోసం శివ నేతృత్వంలోని జైపూర్ బృందం రుతు ప్యాడ్ల తయారీతో పాటు విద్యా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ‘జైపూర్.. వస్త్రాలు, బట్టలు సమృద్ధిగా ఉండటం వల్ల యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అనువైన ఎంపికగా మారింది’ అని శివ చెప్పారు. గృహ కార్మికులుగా, నిరుద్యోగులుగా ఉండే స్థానిక మహిళలకు అధిక నాణ్యత, గాలి పీల్చుకునే వస్త్ర ప్యాడ్‌లను కుట్టడంలో శిక్షణ ప్రారంభించారు. మొదట్లో 29 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామీణ జైపూర్‌లోని కొత్త యూనిట్‌లో ఏడుగురు పనిచేస్తున్నారు. చాలా మంది ఇతర సంస్థల్లో ఉద్యోగం సంపాదించుకున్నారు. ‘ఇందులో పని చేసే చాలా మంది మహిళలకు ఇది మొదటి ఉద్యోగం. సూదిలో దారం ఎలా వేయాలో కూడా తెలియని వారు కూడా మా దగ్గరకు వస్తారు. అలాంటి వారు కొన్ని వారాలలోనే తమ కుటుంబాన్ని పోషించుకునే శక్తిని సంపాదించుకుంటున్నారు’ అని శివ చెప్పారు. దీనికోసం ఎడిన్‌బర్గ్‌లో 15 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. వీరంతా గ్రాంట్ రైటింగ్, వెబ్‌సైట్ నిర్వహణ, సోషల్ మీడియా, అవగాహన ప్రచారాలు, నిధుల సేకరణ వంటి ‘క్లౌడ్ వర్క్’ను నిర్వహిస్తున్నారు.
ప్రభావాన్ని అంచనా వేయడం
ఈ రోజు వరకు ఈ పునర్వినియోగ ప్యాడ్‌లు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 11,500 మందికి పైగా మహిళలకు చేరాయి. ‘మా వినియోగ దారులలో 95 శాతం కంటే ఎక్కువ మంది భారతదేశానికి చెందినవారు. వీరంతా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చినవారు’ అని శివ చెప్పారు. ఈ ప్యాడ్‌లను సుమారు 30కి పైగా ఎన్‌జీఓల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల టాటా ట్రస్ట్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. శానిట్రీని ఎంచుకునే ముందు 60 మంది సరఫరాదారులు నాణ్యతను తనిఖీ చేశారు. ప్రతి ప్యాడ్ రెండేండ్ల వరకు ఉంటుంది. 150-200 సార్లు దీన్ని ఉతకవచ్చు. ఇది పర్యావరణ వ్యర్థాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.
సాధికారత కల్పించడానికి విద్య
సంస్థ రుతుక్రమ ఉత్పత్తులను సృష్టించడమే కాకుండా శానిట్రీ కమ్యూనిటీ సభ్యులకు అవగాహన కల్పించే బాధ్యతను కూడా తీసుకుంది. 109 పాఠశాలల్లో ఐదు వేల మంది విద్యార్థులకు, విద్యా సెషన్‌లను నిర్వహించింది. 3,100 మంది మహిళలతో రుతుక్రమ పరిశుభ్రత, గౌరవం గురించి ప్రచారం చేసింది. ఈ సెషన్‌లలో తరచుగా గైనకాలజిస్ట్‌లు కూడా పాల్గొంటారు. వారు వైద్య మార్గదర్శకత్వం అందించడానికి, రుతుక్రమం చుట్టూ ఉన్న అపోహలను ఛేదించడానికి సహకరిస్తున్నారు. ఆసక్తికరంగా, పాల్గొనేవారికి వారి శరీరాలు, జీవనశైలికి ఏది ఉత్తమంగా పనిచేస్తుందో ఎంచుకోవాలని ప్రోత్సహిస్తున్నారు.
మరింత మద్దతు ఇవ్వడానికి
‘ఇది ఒక ఉత్పత్తిని ముందుకు తీసుకెళ్లడం గురించి కాదు. సమాచారంతో కూడిన ఎంపిక గురించి. కానీ భారతదేశంలో ఇప్పటివరకు క్లాత్ ప్యాడ్‌లు ఉత్తమంగా పనిచేశాయని, అత్యంత ప్రాధాన్యం కలిగిన ఎంపిక అని కూడా మేము గ్రహించాము’ అని శివ పంచుకున్నారు. శానిట్రీ ఇప్పుడు మూడవ యూనిట్ నడుపుతోంది. జైపూర్‌లో శివ నివసించే ప్రదేశానికి దగ్గరలో ఒక బృందం పని చేస్తోంది. ఉత్పత్తి చేయడానికి, వారి విద్యా పద్ధతులను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. వారు నియమించుకునే మహిళలకు మరింత మద్దతు ఇవ్వడానికి ఆత్మరక్షణ, ఆంగ్ల భాష, ఆర్థిక అక్షరాస్యత వరకు వృత్తి శిక్షణను ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా ఉంది.
ఋతు నిశబ్దాన్ని బద్దలు కొడుతూ..
- Advertisement -
- Advertisement -