మెదడు పనిచేసే స్థాయి పెరుగుతోంది. హృదయం స్పందించే స్థాయి తరుగుతోంది. సౌకర్యాలు పెరుగుతున్నాయి. సాంగత్యాలు తగ్గుతున్నాయి. కొత్త కొత్త వస్తువుల ఆవిష్కరణ. మనస్సు విప్పుకోవటం తిరస్కరణ. ఆధునికత ఆకాశన్నంటుతోంటే, అనుబంధాలు అడుగంటి పోతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు.. అనారోగ్యాల దేహాలు. ఆస్తుల విలువలు పెరిగాయి. సంబంధాల మధ్య విలువలు తరిగాయి. వీటికి కారణాలను రెండు వందలయేండ్ల క్రితమే జన్మించిన మహామేధావి మార్క్స్ వివరించాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని. ప్రతి చోటా అది సత్యమని రుజువవుతూనే ఉంది. కానీ ఆ రకమైన సంబంధాల నుండి బయటపడే ప్రయత్నం, తపన సరిగా జరగడమే లేదు. ఇంకా అనేక భ్రమలలో కొనసాగడమే దీనికి కారణం. ఆపదో, విపత్తో, దుర్మార్గమో జరిగినప్పుడు మాత్రమే ఏమిటీ దారుణమని విస్మయపడతాం. తర్వాత మరచిపోతాం. కానీ ఎలాంటి అమానవీయ సంబంధాలలోకి మనం నెట్టబడుతున్నామో ఆలోచించం.
ఇదిగో ఈ చిన్న సంఘటన. మన పిల్లలలో ఎలాంటి భావనలు పాదుకొల్పుతున్నామో అవగాహన చేయిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా ఆంగ్ల ప్రశ్నాపత్రంలో ‘అమ్మకు నచ్చేవి.. నచ్చని వాటి గురించి రాయమని ఒక ప్రశ్న ఇచ్చారు. దానికి ఆ విద్యార్థిని ‘అమ్మకు నచ్చనిది – నాయనమ్మ, తాతయ్య’ అని రాయడం జరిగింది. ఎంత స్పష్టంగా ఆ చిన్నారి రాసింది! వృద్ధాప్యంలో తల్లిదండ్రులు, అత్తమామలు ఎంతో భారంగా మారారని, వారి పట్ల ప్రేమ ఎలా ఉన్నదో ఆ విద్యార్థిని ద్వారా అర్థమవుతుంది. మానవ సంబంధాల్లో వచ్చిన మార్పు తెలిపేందుకు ఈ ఒక్క సమాధానం చాలదూ! ఎప్పటి నుంచో మానవ సంబంధాలలో మార్పు వచ్చినప్పటికీ, వ్యక్తం చేయటం, అంత దుర్మార్గంగా ఆచరించడటం తప్పనే భావన ఒకటి ఉండేది. ఇప్పుడలాంటిదేమీ లేదు.
కనిపెంచిన తల్లిదండ్రులను సైతం, చూడలేక గెంటివేయటం, చంపివేయడమూ మనం చూస్తున్నాం. జీవితాంతమూ కలిసి ఉంటామని ప్రమాణాలు చేసిన వివాహ సంబంధాలూ తెంచేసుకోటమే కాదు, చంపేసుకోవటమూ చాలా తేలిక వ్యవహారంగా మారిపోయింది. భార్యలను చంపుతున్న భర్తలు, భర్తలనుచంపుతున్న భార్యలు. ఈ మధ్య నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వివాహిత థ్రిల్లర్ సినిమాను తలపించేలా భర్తను ప్రియుడి చేత చంపించి ఆ తర్వాత భర్తపై రసాయనికదాడి జరిగిందని తానే ఫిర్యాదుచేసింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఓ మహిళ తన ప్రియుడితో కలసి భర్తను హత్య చేయించింది. చిత్తూరు జిల్లా పుత్తూరులో కిరాయి హంతకులతో ఓ వైద్యుడు భార్యను హత్య చేయించాడు. భార్యను చంపడానికి సుపారీ ఇస్తాడొకడు. మత్తు మందిచ్చి గొంతు నులుముతాడొకడు. భర్తను చంపడానికి ప్రియుడితో పథకం వేస్తుందొకరు. ఇలా రోజురోజుకు ఈ మానవ సంబంధాల విధ్వంస చిత్రాలు మన కళ్లెదుట కనిపిస్తూనే ఉన్నాయి.
మానవ విలువలు, సామాజిక కట్టుబాట్ల కంటే, శారీరక సుఖాలకు సౌకర్యాలకు ప్రాధాన్యం పెరిగింది. విలాసవంతమైన జీవనం, డబ్బు, ఖరీదైన వస్తువులపట్ల మోజు, అధికారం, ఇతర ప్రయోజనాలే ప్రధానమైపోయాయి. దానికి తోడు సినిమాలు, సీరియళ్లు, సెల్‌ఫోన్లు, మీడియా ప్రభావాలు విపరీతంగా పెరిగాయి. ఆధునిక జీవనశైలి భ్రమల్లోపడి కొట్టుకుపోతున్నారు. కుటుంబాల్లో పర్వవేక్షణ తగ్గడం, సభ్యుల మధ్య సంభాషణలూ కొరవడటం ఆరోగ్య సమస్యలూ కొన్ని కారణాలు. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలే అధిక ప్రభావంగా పనిచేస్తున్నాయి. మనుషుల మధ్య సంబంధాలు వస్తు, సౌకర్యాల బంధాలుగా మారిపోయాయి. ఒక వస్తువును వాడుకొని వొదిలేసే, విసిరేసే పద్ధతిలోనే మనుషులనూ వాడుకొని వొదిలేయటం, లేదా చంపేయటం వరకూ వచ్చేసింది. మన విద్యా వ్యవస్థ కూడా యువతను ఆర్థిక కార్యకలాపాల ప్రాధాన్యంలోకే నెడుతున్నది. ఆదాయాల లేమి, అవకాశాల కొరత కూడా మనుషుల్ని వొత్తిడిలోకి నెట్టి, మానసిక అనారోగ్యానికి గురిచేస్తున్నది.
అందుకే కవయిత్రి జరీనాబేగం ఇలా అంటారు. ”ఒక సంబంధం, ఇష్టాఇష్టాలకు మధ్య కాదు, ప్రణాళికలకు – పథకాలకు మధ్య / ఒక ఒప్పందం బంధాలకి, బంధుత్వాలకి మధ్య కాదు. అవకాశాలకు, అవసరాలకూ మధ్య / ఒక సమైక్యతా భావం – కుటుంబానికీ కుటుంబానికీ మధ్య కాదు. డబ్బుకూ హోదాకు మధ్య. / ఒక అవగాహన – మనిషికీ మనిషికీ మధ్య కాదు. ఆస్తులకూ అంతస్తులకు మధ్య. / అసలు విలువలు జీవితం నుండి వేరయి, జీవన ప్రమాణాలకే పరిమితమైనపుడు, ఆర్థ్రత కూడా హృదయాన్ని విడిచి, ఆ మనిషిని శుష్క ఎడారిగా మిగులుస్తుంది”. మానవ విలువలు కోల్పోయి, మనిషి మనిషి కాకుండా పోయాక, ఎన్ని సమకూరినా ఏం లాభం! ఈ తిరోగమన సమాజాన్ని మార్చడమే మన ముందున్న కర్తవ్యం.
తెగుతున్న బంధాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES