ప్రపంచవ్యాప్తంగా మహిళలకు వచ్చే కాన్సర్లలో అతి ఎక్కువగా ఉంటున్న కాన్సర్ రొమ్ము కాన్సర్ అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతే కాదు కాన్సర్ కారక మరణాలలో అతి ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నవి రొమ్ముకాన్సర్ మరణాలే. భారతీయ స్త్రీలలో కాన్సర్ కారక మరణాలలో మూడవ వంతు రొమ్ముకాన్సర్ మరణాలే. ఐతే, తొలి దశలో గుర్తిస్తే రొమ్ము కాన్సర్ ని సమర్ధవంతంగా నివారించవచ్చు, చికిత్సచేసి నయం చెయ్యొచ్చు.
వ్యాధి నిర్ధారణ, చికిత్స పరంగా ఎంతో ప్రగతిని సాధించినప్పటికి అవగాహన లేకపోవడం, భయం, సామాజిక ప్రతికూలత వలన ఇంకా వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం కొనసాగుతూనే వుంది. దానితో అనేకమంది మహిళలు వ్యాధి బాగా ముదిరి పోయాక హాస్పటల్ కి వస్తున్నారు. అలాంటి మహిళలకు అవగాహన కలిగించి, తమ ఆరోగ్యం గురించి తగిన చర్యలు తీసుకునేలాగా ప్రోత్సహించడం, ఆరోగ్య పరంగా వారిని సాధికారుల్ని చెయ్యడం తప్పనిసరి అవసరం.
పెరుగుతున్న భారం
ఇండియన్‌కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ప్రతి సంవత్సరం భారతదేశంలో 2 లక్షలకు పైగా రొమ్ము కాన్సర్ కేసులు గుర్తింపబడుతున్నాయని వెల్లడి చేసింది. ఆందోళనకరమైన విషయమేమిటంటే పశ్చిమ దేశాలలో కంటే దాదాపు 10 సంవత్సరాల తక్కువ వయసు స్త్రీలు భారతదేశంలో ఈ వ్యాధి బారిన పడుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో సర్వైకల్ కాన్సర్ కంటే ఎక్కువగా రొమ్ము కాన్సర్ కేసులు ఉంటున్నాయని కూడా నివేదికలు తెలుపుతున్నాయి.
జన్యుపరమైన అంశాలతో పాటు హార్మోన్ల అసంతులనం, జీవనశైలి సంబంధిత అంశాలు, పర్యావరణ కారణాలు రొమ్ము కాన్సర్‌కి దోహదం చేస్తాయి. అంతే ఆందోళనకరమైన అంశం కాన్సర్ విజేతల శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో 80 శాతం ఉండగా భారతదేశంలో 60 శాతం మాత్రమే ఉంది. వ్యాధి గురించి, స్క్రీనింగ్ పరీక్షల గురించి, వాటి లభ్యత గురించి సామాన్య ప్రజల్లో అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణం. వ్యాధి నిర్ధారణలో జరుగుతున్న ఆలస్యం కారణంగా రోగులు వైద్య సహాయం కోసం వచ్చేటప్పటికి వ్యాధి శరీరంలో ఇతర అవయవాలకు పాకి ముదిరి పోయి వుంటుంది.
రొమ్ముకాన్సర్ ని అర్ధం చేసుకోవడం:
రొమ్ములో కొన్ని కణాలు ఆరోగ్యంగా ఉన్న కణాల కంటే వేగంగా, నియంత్రణ లేకుండా విభజితమయి పెరిగి ఒక దగ్గర పోగుపడినప్పుడు రొమ్ములో ఒక గడ్డ లేక ట్యూమర్ ఏర్పడుతుంది. అసహజంగా ఉన్న ఈకణాలు చుట్టుప్రక్కల ఉన్న కణజాలంలోకి చొచ్చుకుపోవచ్చు లేక దూరంగా ఉన్న అవయవాలలోకి రక్తం లేక లింఫు నాళాల ద్వారా విస్తరించవచ్చు.
రొమ్ము నిర్మాణం:
రొమ్ములో పాలను ఉత్పత్తి చేసే గ్రంధులు, పాలను రొమ్ము మొన వరకు తీసుకు వెళ్ళే పాలవాహికలు, వీటన్నిటినీ కలిపి వుంచే బంధక కణజాలం, క్రొవ్వు వుంటాయి. సాధారణంగా పాలవాహికలలో గాని(డక్టల్ కార్సినోమా), గ్రంధులలోగాని (లాబ్యులర్ కార్సినోమా) కాన్సర్ ప్రారంభమవుతుంది, రొమ్ము కాన్సర్ సర్వసామాన్యంగా స్త్రీలకే వచ్చినప్పటికి, అరుదుగా పురుషులకు కూడా రావచ్చు. ఇవి 1 శాతంకంటే తక్కువే ఉంటాయి
ప్రమాదాన్ని ఎక్కువచేసే అంశాలు:
ఏదో ఒక్క అంశం మాత్రమే రొమ్ము కాన్సర్ ప్రమాదానికి దారి తీయదు. అనేక అంశాలు రిస్క్‌ని ఎక్కువ చెయ్యొచ్చు. ఆయా అంశాల గురించి తెలుసుకుంటే వ్యాధిని తొలి దశలో గుర్తించవచ్చు, నివారించవచ్చు.
రొమ్ము కాన్సర్-ప్రమాద కారకాలు:
1.స్త్రీ అవడం: స్త్రీ అవడమే రొమ్ము కాన్సర్ ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది.
2.వయసు: వయసు పెరిగినకొద్దీ , ముఖ్యంగా 40 సంవత్సరాల వయసు తరువాత రిస్క్ ఎక్కువవుతుంది.
3.వ్యక్తిగత చరిత్ర: ఒక రొమ్ముకు కాన్సర్ వచ్చి ఉంటే రెండో రొమ్ముకు కాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది.
4.కుటుంబ చరిత్ర, జెనిటిక్స్: సన్నిహిత బంధవులకు(తల్లి, సోదరి, కుమార్తె) రొమ్ము కాన్సర్ ఉంటే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. బిఆర్‌సిఎ 1 మరియు బిఆర్‌సిఎ2 జీన్స్ మ్యుటేషన్లు ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.
5.పునరుత్పత్తి చరిత్ర: త్వరగా,12 సంవత్సరాల వయసులోపు రజస్వల అవడం, ఆలస్యంగా, 55 సంవత్సరాల తరువాత బహిష్టులు ఆగిపోవడం, ఆలస్యంగా, 30 సంవత్సరాల వయసు తరువాత మొదటి బిడ్డను కనడం లేక పిల్లలు లేకపోవడం, బిడ్డలకు తన పాలివ్వకపోవడం, ఎక్కువ కాలం శరీరం హార్మోన్స్ ప్రభావంలో ఉండడం కారణంగా ప్రమాదం ఎక్కువ అవుతుంది.
6.జీవన శైలి: ఎక్కువ బరువు, శారీరక శ్రమ లేకపోవడం, ఆల్కహాల్‌ని తాగడం, పొగతాగడం, కొవ్వు ఎక్కువ ఉన్న ఆహార పదార్ధాల్ని తినడం హార్మోన్స్ సంతులనాన్ని దెబ్బ తీసి ఇన్‌ఫ్లమేషన్ కి,కేన్సర్‌కి దారితీస్తుంది. హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్ ఆర్ టి): బహిష్టులు ఆగిపోయాక ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ థెరపీని ఎక్కువ కాలం తీసుకుంటే రిస్క్ పెరుగుతుంది.
7.ఇంతకు మునుపు, ముఖ్యంగా కౌమారదశలో ఛాతీకి రేడియేషన్ చికిత్స జరిగితే రిస్క్ పెరుగుతుంది. కాని, పైన చెప్పిన వాటిలో ఏవో ఒకటి, రెండు రిస్కులు ఉంటే దాని అర్ధం రొమ్ము కాన్సర్ ఉన్నట్లు కాదు, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని మాత్రమే.రొమ్ము కాన్సర్ నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. క్రమబద్ధంగా రొమ్ముల్ని స్వీయ పరీక్ష చేసుకోవడం ద్వారా వ్యాధిని తొలిదశలోనే గుర్తించవచ్చు.
తొలి హెచ్చరిక సంకేతాలు:
- రొమ్ములో, లేక చంకలో గడ్డ లేక గట్టిగా ఉండడం, గడ్డ బఠానీ గింజ అంత చిన్నదిగా ఉండొచ్చు
- రొమ్ము సైజు, ఆకృతి, ఆకారంలో మార్పు
- రొమ్ము మొన చుట్టూ నల్లగా ఉండే భాగం పై చర్మం గుంటలు లేక ముడతలు పడడం, నారింజ పండు తొక్కలాగా మారడం
- రొమ్ము మొనలో మార్పు-లోపలికి పోవడం, దద్దుర్లు, లేక రొమ్ము మొన నుండి డిశ్చార్జి, ముఖ్యంగా రక్తం కారడం
రొమ్ము చర్మం క్రింద మార్బుల్ లాగా గట్టిగా ఉండడం - రొమ్ము లేక రొమ్ము మొన ఎర్రగా,వాపుగా ఉండడం, పొరలు ఊడడం, పొక్కులు కట్టడం
- రొమ్ములో ఏదో ఒక భాగంలో తగ్గకుండా నొప్పి ఉంటే,
- రొమ్ములో ఏదో ఒక భాగం మిగతా భాగం కంటే తేడాగా ఉండడం
వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్ని కలవాలి.
తొలి దశలో వ్యాధి నిర్ధారణ ప్రాధాన్యం:
తొలిదశలో వ్యాధి నిర్ధారణ ప్రాణాన్ని కాపాడుతుంది. రోగి జీవించే అవకాశం 90 శాతం ఉంటుంది. దురదృష్టవశాత్తు భారతదేశంలో సుమారుగా 60 శాతం కేసులు స్టేజి 3 లేక 4 లో గుర్తింపబడుతున్నాయి.
స్క్రీనింగ్: స్క్రీనింగ్ వ్యాధి లక్షణాలు కనపడకముందే వ్యాధిని గుర్తించడానికి సహాయ పడుతుంది.
స్క్రీనింగ్ పరీక్షలు:
1.రొమ్ము స్వీయ పరీక్ష (బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్- బి ఎస్ ఇ) : ప్రతి స్త్రీ 20 సంవత్సరాల వయసు నుండి నెలకు ఒకసారి, బహిష్టు అయిన వారం తరువాత తన రొమ్ముల్ని పరీక్ష చేసుకోవాలి. గడ్డలు, రొమ్ము సైజు, ఆకృతి లో మార్పులు, రొమ్ము పై చర్మంలో మార్పులు, రొమ్ము మొన నుండి డిశ్చార్జి ఉన్నాయేమో, చంకలో లింఫు గ్రంధులు వాచాయేమో పరిశీలించాలి.
2.రొమ్మును క్లినికల్ గా పరీక్ష చేయించుకోవడం (క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్- సి బి ఇ) : 30 సంవత్సరాల వయసు నుండి ప్రతి మహిళ సంవత్సరానికొకసారి డాక్టర్‌తో రొమ్ముల్ని పరీక్ష చేయించుకోవాలి.
3.మామోగ్రఫీ: 40 సంవత్సరాలు నిండిన మహిళలు 1-2 సంవత్సరాలకొక సారి, ఎక్కువ రిస్క్ ఉన్న వారు ఇంకా తరచుగా మామోగ్రఫీ చేయించుకుంటే చేతితో గుర్తించలేని గడ్డల్ని గుర్తించవచ్చు. ఇంకా ఎక్కువ కచ్చితంగా వ్యాధి ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. మామోగ్రఫీ సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ స్క్రీనింగ్ యూనిట్లు, అవగాహన శిబిరాలు కొంత సహాయపడుతున్నాయి.
అనుమానం నుండి నిర్ధారణ వరకు:
రొమ్ములో గడ్డ లేక ఇతర అసహజ లక్షణాలు కనపడితే నిర్ధారణకు ఇంకా కొన్ని పరీక్షలు అవసరమౌతాయి.
1.అల్ట్రాసౌండ్ పరీక్ష: రొమ్ము లో ఉన్నది గట్టి గడ్డ లేక సిస్ట్ అనేది తెలుసుకోవడానికి
2.మామోగ్రామ్: అనుమానాస్పదంగా ఉన్న ప్రదేశాల్ని గుర్తించడానికి
3.రొమ్ము ఎమ్.ఆర్.ఐ
4.సి.టి.స్కాన్
5.పెట్ స్కాన్
6.బోన్ స్కాన్
ఈ పరీక్షలు కాన్సర్‌ని నిర్ధారణ చెయ్యడమేకాక కాన్సర్ ఏ స్టేజిలో ఉందో తెలుసుకోవడానికి,తద్వారా చికిత్సను ప్లాన్ చెయ్యడానికి ఉపయోగపడతాయి.
స్టేజింగ్, చికిత్స:
ట్యూమర్ సైజు, కాన్సర్ కణాలు లింఫు గ్రంధులకు చేరడం, ఇతర అవయవాలకు వ్యాపించడం ఆధారంగా రొమ్ము కాన్సర్‌ని ఈక్రింది స్టేజిలుగా విభజించవచ్చు.
స్టేజి I&II తొలిదశ: రొమ్ముకి పరిమితమై ఉంటుంది. ఇతర భాగాలకు వ్యాపించదు. చికిత్సతో నయమవుతుంది.
స్టేజి III: రొమ్ము వెలుపలకు, సమీపంలోవున్న లింఫు గ్రంధులకు వ్యాపిస్తుంది.
స్టేజి IV: దూరంగా ఉన్న అవయవాలు,కాలేయం, ఊపిరి తిత్తులు, ఎముకలకు వ్యాపిస్తుంది (మెటాస్ట్టేటిక్ కేన్సర్).
చికిత్స – ప్రత్యామ్నాయాలు
1.ఆపరేషన్: కాన్సర్ గడ్డను మాత్రమే తొలగించడం (లంపెక్టమీ), పూర్తి రొమ్మును తొలగించడం (మాస్టెక్టమీ). కొన్ని సార్లు రొమ్ము ఆకారాన్ని సరిచెయ్యడానికి రొమ్ము పునర్నిర్మాణ ఆపరేషన్ చేస్తారు.
2.రేడియేషన్ చికిత్స: ఆపరేషన్ తరువాత శరీరంలో మిగిలిన కాన్సర్ కణాలను నిర్మూలించడానికి ఈ చికిత్స ఉపయోగ పడుతుంది
3.కీమోథెరపీ : శరీరంలో ఎక్కడ ఉన్న కాన్సర్ కణాల్నయినా చంపే మందుల్ని నోటి ద్వారా లేక వెయిన్ లోకి ఇంజక్షన్ చెయ్యడం ద్వారా చికిత్స
4.హార్మోన్ థెరపీ: హార్మోన్స్‌కి స్పందించే టామాక్సిఫిన్ లేక ఏరోమెటేజ్ ఇన్హిబిటర్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టకాన్ ప్రభావానికి అడ్డుపడి కాన్సర్ ప్రభావాన్ని నిరోధిస్తాయి.
5.టార్జెటెడ్ థిరపీ, ఇమ్యునోథిరపీ: ఈచికిత్సలో తక్కువ ఇబ్బందులు ఉండి ఎక్కువ సమర్ధంగా కాన్సర్ కణాలను చంపే మందుల్ని ఇస్తారు
కాన్సర్ తరువాత జీవితం:
చికిత్స తరువాత కోలుకోవడమంటే కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగానూ, భావోద్వేగపరంగానూ కూడా చాలామంది స్త్రీలు తమ శరీరంలో జరిగే మార్పుల గురించి అలజడి చెందుతారు. నిస్త్రాణను తట్టుకోవడానికి కష్టపడతారు. కాన్సర్ మళ్ళీ తిరగబెడుతుందేమోనని భయపడతారు. సంతులనాహారం, క్రమబద్ధ వ్యాయామం, ఒత్తిడిని తట్టుకోవడం, నిర్ణీత వ్యవధిలో పరీక్షలు చేయించుకుని వైద్య సలహాలను పాటించడం ద్వారా రొమ్ము కేన్సర్ బాధితులు చికిత్స తరువాత ఆరోగ్యంగా ఉత్పత్తిదాయకంగా వుంటుంది.
ఆరోగ్యంగా జీవించడానికి మార్గాలు:
జన్యుపరమైన ప్రమాదకారకాల్ని మార్చలేకపోవచ్చు. కాని జీవనశైలికి సంబంధించిన అంశాల్ని మార్చుకోవడం ద్వారా ప్రమాదాల్ని తగ్గించుకోవచ్చు
1.ఆరోగ్యకరమైన బరువు
2.క్రమబద్ధమైన వ్యాయామం: ప్రతిరోజు తప్పనిసరిగా 30 నిమిషాలపాటు వేగంగా నడవడం
3.పొగతాగకుండా ఉండడం, ఆల్కహాల్ వ్యసనం లేకుండా ఉండడం
4.అనవసరంగా హార్మోన్లను వాడడం
కొన్ని అపోహలు, నిజాలు:
అపోహ: కుటుంబంలో ఎవరికైనా ఉంటేనే రొమ్ము కాన్సర్ వస్తుంది.
నిజం: రొమ్ము కాన్సర్ రోగుల్లో 80 శాతం మందికి కుటుంబంలో వేరే ఎవరికీ కేన్సర్ ఉండదు.
అపోహ: రొమ్ములో గడ్డ వుంటే అది కేన్సరే.
నిజం: రొమ్ములో ఏర్పడే గడ్డల్లో చాలా వరకు కాన్సర్ గడ్డలు కావు.
అపోహ: నిద్రపోయేటప్పుడు బ్రా వేసుకుంటే రొమ్ము కాన్సర్ వస్తుంది.
నిజం: దీనికి శాస్త్రీయ ఆధారం లేదు.
అపోహ: పురుషులకు రొమ్ము కాన్సర్ రాదు.
నిజం: అరుదుగానే అవొచ్చు, పురుషులకు కూడా రొమ్ము కాన్సర్ వస్తుంది.
భావోద్వేగాలు:
రొమ్ముకాన్సర్ నిర్ధారణ అవగానే ఆ స్త్రీ ప్రపంచం తల్లక్రిందులవుతుంది. భయం, నిరాకరణ, అనిశ్చితి చుట్టుముడతాయి. కుటుంబం, స్నేహితులు, సంరక్షకుల సపోర్ట్ ఆమె ఆ స్ధితి నుండి తేరుకోవడానికి కొంత సహాయపడుతుంది.
సమాజం, మీడియా పాత్ర
అవగాహనాసదస్సులు, ప్రచారాలు, పింక్ రిబ్బన్ ఉద్యమాలు, సోషల్ మీడియా రొమ్ము ఆరోగ్యం గురించి భయం, దాపరికం లేకుండా మామూలుగా మాట్లాడుకో వడానికి, చర్చించడానికి ప్రముఖంగా ఉపయోగ పడ్డాయి. వార్తా పత్రికలు, టెలివిజన్, ప్రజావేదికలు ఈ వ్యాధి చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి, ప్రతికూలతను తగ్గించడానికి దోహదం చేస్తాయి.
పాఠశాలలు, పనిప్రదేశాలు, గ్రామీణ సంఘాలలో జరిగే అవగాహనా కార్యక్రమాలలో రొమ్ము కాన్సర్ వ్యాధి గ్రస్తులు మరణించకుండా ఉండడానికి, ఆరోగ్యంగా జీవించడానికి కీలకం. తొలిదశలో వ్యాధిని గుర్తించడం అనే అంశాన్ని బలంగా ప్రచారం చెయ్యాలి.
రొమ్ము కాన్సర్ మరణశాసనం కాదు
అవగాహన, స్వీయ సంరక్షణ, తొలిదశలో గుర్తించడం, సకాల చికిత్స, మానసిక దృఢత్వం భయాన్ని విజయంగా మారుస్తాయి
డా.ఆలూరి విజయలక్ష్మి
శ్రీశ్రీ హోలిస్టిక్ మల్టీస్పెషాలిటీస్ హాస్పటల్స్, హైదరాబాద్,
98490 22441



