జీవితాన్ని కళాత్మకంగా, సమాజ ప్రయోజనకరంగా మలుచుకున్న వారికుండే పరిచయాలకు ఆకాశమే హద్దు. వారికంటూ రూపొందిన చిన్నపాటి సొంత ప్రపంచమే ఉంటుంది. వ్యక్తిగా వెచ్చించే దశాబ్దాల స్నేహపూరిత కాలమే నిచ్చెన మెట్లలా మారి వారికి విశేష గుర్తింపును తెచ్చిపెడుతుంది. అదే ఆ మనిషిని ఉన్నతుడిగా నిలబెడుతుంది. సాటి మనుషులతో సంస్కారయుతంగా మెదలడం ఓ కళ. సమాజ ఉద్ధరణకు తోడ్పడడం ఓ సేవ. ఈ రెంటి మేలి కలయిక మనిషిని గొప్ప సాధకుడిగా మార్చుతుంది. అలా సాగిన జీవితం ముదిమి నీడన చేరాక ఓ కొత్త మలుపును తీసుకుంటుంది.
ఇంతకాలం ఓ నిర్దిష్టమైన పద్ధతిలో, లక్ష్యసిద్ధితో గడిచిన జీవితం.. కాలం త్రాసుపై నిలబడుతుంది. కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు.. తన ఇన్నేళ్ల పయనంపై మాట్లాడే సమయం, సందర్భం ఇదే అంటారు. మీ సేవలపై నాలుగు అక్షర అక్షింతలు చల్లి సత్కరించుకొనే అవకాశం ఇమ్మంటారు. అలా వందల అభినందనల రెపరెపలతో మూడు విశేష సంచికలు గత సంవత్సరం ద్వితీయార్ధంలో వెలువడ్డాయి. వాటిలో వీరి జీవన పయనంలో సాధించిన విజయాలపై ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. రకరకాల సాహితీ ప్రక్రియల దొంతరలో ఇలాంటి అభినందన సంచికలది ఓ ప్రత్యేక స్థానం.
వీటిలో మొదటగా డా . ఆలూరి విజయలక్ష్మి జీవన విశేషాలతో వచ్చిన ‘విజయ యాత్ర’ అనే పుస్తకం గురించి ప్రస్తావించుకోవాలి. ఆవిడ పేరొందిన రచయిత్రి, వైద్యురాలు, అభ్యుదయ సామాజికవాది. వ్యక్తిగా సౌమ్యులు. ఆమెకు ఎనభై ఏళ్లు నిండిన సందర్భంగా సెప్టెంబర్ 2025 లో ఈ విశేష సంచిక వచ్చింది. దానిని ‘డా. విజయలక్ష్మి సాహితి , వైద్య సేవా శోభా యాత్ర’గా పేర్కొనడం సముచితంగా ఉంది. 55 ఏళ్లుగా గైనకాలజిస్టుగా ప్రాక్టీసు చేస్తూన్న విజయలక్ష్మి చేతుల మీదుగా ఇప్పటికి 25 వేలకు పైగా ప్రసవాల నిర్వహణ జరిగింది. తన వృత్తిని ఎంతో ప్రేమించే ఆమె ఈ ‘విజయ యాత్ర’ను ఆ తల్లులకే అంకితం చేశారు. ‘దివి నుంచి భువికి జారిన వెన్నెల కిరణంలా మీ పొత్తిళ్ళలో చేరిన నవజాత శిశువు తొలి స్పర్శానందాన్ని నా హృదయంలో ఒంపిన తల్లులకు ప్రేమతో, కృతజ్ఞతతో..’ అంటూ మాతమూర్తులకు ఈ పుస్తకాన్ని సవినయంగా సమర్పించుకున్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మొదలు నటులు తనికెళ్ళ భరణి వరకు ఎందరో ప్రముఖులు అందించిన ఆత్మీయ అభినందనలు, ఆప్త స్పందనలు ఇందులో ఉన్నాయి. రెండో అధ్యాయంలో రచయిత్రిగా విజయలక్ష్మి వెలువరించిన నవలల, కథా సంపుటాల ముందు మాటలున్నాయి. వీటిని రావి శాస్త్రి, పురాణం, మాలతి చందూర్ లాంటి ప్రముఖులు అందించడం విశేషం. కాల్పనిక రచనలతో పాటు మాతత్వం ఓ తీయని కల, వైద్యుడు లేని చోట, మన దేహం కథ, కౌమార బాలిక ఆరోగ్యం.. లాంటి వైద్య, మహిళా ఆరోగ్య సంబంధిత రచనలు కూడా వీరు చేశారు. గత ఇరవై ఏళ్లుగా కాకినాడలో ‘ఆశ్రయ’ అనే వద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. బహుముఖీనంగా సమాజంలో తమ పాత్రను అంకితభావంతో పోషిస్తున్న డా. విజయలక్ష్మి ఇన్నేళ్ల జీవన పయనం నిజంగానే ఓ మహా విజయ యాత్ర అని ఈ పుస్తకం ద్వారా తెలుస్తోంది.
ఈ వరుసలో రెండో పుస్తకంగా ‘అక్షర గీతం’ పేర్కొనాలి. ఇది ప్రముఖ రచయిత దాస్యం సేనాధిపతి సప్తతి సంచిక. వీరికి డెబ్భై ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీదాస్యం లక్ష్మయ్య సంపాదకత్వంలో అక్టోబర్ 2025లో ఈ విశేష సంచిక వెలువడింది. వందలాది పుస్తక సమీక్షలతో పాటు ఎన్నో సాహితీ వ్యాసాలు రాసిన, రాస్తున్న దాస్యం సేనాధిపతి జగమెరిగిన రచయిత, బహు గ్రంథకర్త. పుస్తక పరిచయ వ్యాసాలతో పాటు వీరి కవిత్వం, కథలు కూడా పుస్తకాలుగా వచ్చాయి. లెక్చరర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన సేనాధిపతి అధ్యాపకుడిగానే కాకుండా పరీక్షల నిర్వాహకుడిగా, కాలేజీ ప్రిన్సిపాల్ గా, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారిగా విధులు నిర్వహించి మన్ననలు అందుకొన్నారు. రచయితగా సాహితీ రంగంలో ఉన్న పరిచయాలతో పాటు వృత్తిగతంగా , వ్యక్తిగతంగా ఆయన ఎందరికో సుపరిచితులు.
ఈ సంచిక సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ సి హెచ్ విద్యాసాగర్ రావు తన అభినందనలో సేనాధిపతిని ‘విద్య, సంస్కారం, దేశభక్తిని సమతుల్యంగా తీర్చిదిద్దే దీపస్తంభం’గా అభివర్ణించారు. వీరి సమయపాలన, అంకితభావం, నిబద్దత, నిజాయితీ ఆదర్శనీయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
సాహితీ ప్రపంచంలో విహరించే సేనాధిపతికి కొత్త, పాత, చిన్న, పెద్ద అని తేడా లేకుండా రచయితలు, సాహితీప్రియులు, సామాజికవేత్తలు అందరూ తెలిసినవారే. దశాబ్దాలుగా కొనసాగుతున్న అనుబంధాలు అవి. ఈ సప్తతి సంచిక కోసం వారందించిన సందేశాలు, అభినందనలు ఒక అలుపెరుగని ప్రవాహంలా కనిపిస్తాయి.
280 పేజీల ఈ పుస్తకంలో అయిదు వందలకు మించే అక్షరాశీస్సులు ఉండొచ్చు. వీటిని తిరగేస్తుంటే సేనాధిపతి ఒక విశాల పరిచయ సామ్రాజ్యానికి అధిపతిలా కనిపిస్తారు. ఇందులో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి మొదలు కవి కొత్త అనిల్ కుమార్ దాకా వందలాది రచయితల అభినందనల తారామండలం దర్శనమిస్తుంది. కె వి రమణాచారి, నలిమెల భాస్కర్, బి ఎస్ రాములు, ఏనుగు నరసింహారెడ్డి, భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ తదితర ప్రముఖులు సేనాధిపతితో తమకున్న అనుబంధాన్ని ఇక్కడ పంచుకున్నారు. సహోద్యోగులు, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కలగలిసి తమ ప్రేమానురాగాలను చల్లి ఈ సప్తతి సంచికను వర్ణరంజితం చేశారు.
ఇక, మూడో అభినందన సంచికగా ‘జీవజల’ ప్రస్తావన వస్తుంది. ఇది గాజోజు నాగభూషణం అరవై ఏళ్ళు పూర్తి చేసుకొని ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా అక్టోబర్ 2025లో వెలువడింది. ఉపాధ్యాయవత్తిలో కొనసాగిన గాజోజు నాగభూషణం కవి, కథకుడు, గాయకుడు, అభ్యుదయ సామాజిక ఆలోచనాపరుడు. వ్యక్తిగా శాంతస్వభావి, మదుభాషి. ప్రేమ, మర్యాదలతో సతతం స్నేహహరితాన్ని పంచే వనమాలి. వందకు పైగా అభినందనా రచనలున్న ‘జీవజల’ సంచిక నాగభూషణం మూర్తిమత్వాన్ని నిలువుటద్దంగా చెప్పుకోవాలి. ఈ వ్యాసాలు అందించిన వారిలో దాదాపుగా అందరూ కళాకారులు, రచయితలే. ఆయన రచనల ప్రస్తావనతో పాటు తనతో వారికున్న అనుబంధాన్ని వదిలిపెట్టకుండా ఎత్తుకున్నారు. వ్యక్తిగా, కళాస్రష్టగా నాగభూషణంలోని మానవీయ కోణాన్ని వివరించిన వ్యాసాలు అనేకం.
కళలు ప్రజల కోసమే అని నమ్మి, ఆచరించే నాగభూషణం కవిత్వంలో ఆర్ద్రత, ఆవేశం కలగలిసి ఉంటాయి. ‘ప్రాణదీపం’ అనే సంపుటిగా వచ్చిన ఆ కవితలు వచ్చాయి. ‘ప్రాణదీపం’ కాంతికి మూలం ఆయన మాతృమూర్తియే. తల్లి జ్ఞాపకాలతో రాసిన కవిత ఈ సంకలనానికే మణిదీపం. కథకుడిగా నాగభూషణం సామాన్యుల జీవితాల్లోని సమస్యలను దగ్గరగా చూసినట్లు కథలు అల్లగల నేర్పరి. తెలంగాణ మలి ఉద్యమం సాంస్కృతిక కవాతులో గాజోజు గొంతు కూడా కదం తొక్కింది. ఆయన పాటలు ‘నెత్తుటి గాయాలు’ అనే సిడి రూపంలో వెలువడ్డాయి.
గాయకుడిగా ఆయన శ్రోతల చప్పట్లతో పాటు పలు పురస్కారాలు, సత్కారాలు కూడా అందుకున్నాడు. ఇలా నాగభూషణం పోషించిన కవి గాయక పాత్రల్లోని విశిష్టతలను, విజయాలను వ్యాసకర్తలు సందర్భానికి తగ్గట్లుగా వివరించారు. ‘జీవజల’కు దేహం గాజోజుదైతే ప్రాణప్రతిష్ట ఈ రచనలది. ఇలాంటి సంచికలు అందుకొనే భాగ్యం అందరికి ఉండదు. అభినందనలు ఊరికే రావు. వృత్తి, ప్రవృత్తిపరంగా జీవితంలోని సింహ భాగాన్ని సేవ భావన, మానవీయ సంవేదనలతో గడిపినవారే ఇందుకు అర్హులు. వారే అభినందనీయులు.
- బద్రి నర్సన్, 9440128169



