– అమెరికాకు సవాల్ విసురుతున్న సభ్యదేశాలు
– పాల్గొన్న ఇరాన్, యూఏఈ వంటి దేశాలు
– చైనా నేతృత్వంలో దక్షిణాఫ్రికా తీరంలో నిర్వహణ
– యూఎస్‌తో క్షీణిస్తున్న సంబంధాల నేపథ్యంలో దూరంగా భారత్
న్యూఢిల్లీ : గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసు కుంటున్నారు. అంతర్జాతీయంగా అశాంతికి దారి తీస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా, రష్యా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురు తున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా యుద్ధ విన్యాసాలకు దిగాయి. అమెరికాకు పరోక్షంగా హెచ్చ రికలను పంపుతున్నాయి. అయితే బ్రిక్స్‌లోని వ్యవస్థాపక సభ్య దేశమైన భారత్ మాత్రం ఈ యుద్ధ విన్యాసాలకు దూరంగా ఉన్నది. అయితే అమెరికాకు వ్యతిరేకంగా వెళ్లే సాహసం చేయలేకనే భారత్ ఇందులో పాల్గొనలేదనే వార్తలు వినబడుతున్నాయి.
బ్రిక్స్ కూటమిలోని చైనా, రష్యా, దక్షిణాఫ్రికాతో పాటు ఇరాన్, యూఏఈ వంటి దేశాలు పాల్గొంటున్న నౌకాదళ యుద్ధ విన్యా సాలు దక్షిణాఫ్రికా తీరంలో ప్రారంభ మయ్యాయి. ఇవి వారం పాటు జరగను న్నాయి. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న ఈ విన్యాసాలు అమెరికాతో ఉన్న విభేదాలను మరింత బహిర్గతం చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. బ్రిక్స్ కూటమిలోని కొన్ని సభ్యదేశాలు కలిసి నిర్వహిస్తున్న నౌకాదళ విన్యాసాలు ”విల్ ఫర్ పీస్ 2026” పేరుతో దక్షిణాఫ్రికాలోని సైమన్స్‌టౌన్ సముద్ర ప్రాంతంలో ప్రారంభ మయ్యాయి. చైనా నేతృత్వంలో జరుగుతున్న ఈ విన్యాసాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగు తున్న సముద్ర భద్రతా ఉద్రిక్తతలకు ప్రతి స్పందనగా నిర్వహిస్తున్నామని దక్షిణాఫ్రికా ప్రకటించింది.
ఈ యుద్ధ విన్యాసాల్లో చైనా, రష్యా, దక్షిణాఫ్రికా వంటి బ్రిక్స్ దేశాలతో పాటు ఇరాన్ నౌకలు పాల్గొంటున్నాయి. అదే సమయంలో బ్రెజిల్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇథియోపియా దేశాలు అబ్జర్వర్స్ (పరిశీ లకులు)గా ఈ విన్యాసాల్లో పాలు పంచుకుం టున్నాయి. దక్షిణా ఫ్రికా సంయుక్త టాస్క్ ఫోర్స్ కమాండర్ కెప్టెన్ ఎన్‌డ్వాఖులు థామస్ థామా మాట్లా డుతూ.. ”ఇవి సైనిక విన్యాసాలు మాత్రమే కాదు, బ్రిక్స్ దేశాల ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియజేసే సం కేతం” అని అన్నారు.
యూఎస్‌తో క్షీణించిన దక్షిణాఫ్రికా సంబంధాలు
గత కొంత కాలంగా దక్షిణాఫ్రికా, అమెరికా దేశాల మధ్య సంబంధాలు బీటలు వారాయి. తాజా విన్యాసాలు దానిని మరింత క్షీణింపజేసే అవకాశమున్నదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ట్రంప్ యంత్రాంగం దక్షిణాఫ్రికా వస్తువులపై 30 శాతం టారిఫ్‌లను విధించింది. ఇక అమెరికాకు సన్నిహిత దేశమైన ఇజ్రాయిల్‌పై దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో దాఖలు చేసిన ‘జెనోసైడ్ కేసు’ కూడా అమెరికాతో విభేదాలకు కారణమైందని నిపు ణులు చెప్తున్నారు. అంతేకాదు, దక్షిణా ఫ్రికాలో తెల్లజాతి రైతులపై హత్యాకాండ జరుగు తోందని ఇటీవల ట్రంప్ ఆరోపించడం, దానిని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఖండించడం వరుసగా జరిగాయి. బ్రిక్స్ నౌకాదళ యుద్ధ విన్యాసాలు ప్రపంచ రాజకీయాల్లో మారు తున్న శక్తి సమీకరణాలను స్పష్టంగా చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఒకవైపు అమెరికా ఆధిపత్యానికి సవాల్‌గా నిలుస్తున్న దేశాలు, మరోవైపు అమెరికాకు వ్యతిరేకంగా వెళ్తే మళ్లీ మరేమైనా ముప్పురావొచ్చన్న భయంతో అడుగులు వేస్తున్న భారత్ వంటి దేశాలు… ఈ పరిస్థితుల నడుమ బ్రిక్స్ భవిష్యత్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయని వారు చెప్తున్నారు.
బ్రిక్స్‌కు వ్యతిరేకంగా ట్రంప్ వైఖరి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమి విషయంలో వ్యతిరేకంగానే ఉన్నారు. బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అను సరిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. బ్రిక్స్ దేశాలు నిజంగా ఒక బలమైన కూటమిగా మారితే వాటిని చాలా కఠినంగా ఎదుర్కొంటామని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే బ్రిక్స్ సభ్యదేశాలపై అదనపు సుంకాలు విధించారు. కాగా ఈ ఏకపక్ష వాణిజ్య ఆంక్షలను బ్రిక్స్ దేశాలు ఇప్పటికే ఖండించాయి. ఇటు ఇరాన్‌పై జరిగిన సైనిక దాడులను కూడా విమర్శించాయి.
అమెరికా కోసం దూరంగా భారత్?
బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశాలైన భారత్ ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనకపోగా, బ్రెజిల్ అబ్జర్వర్‌గా వ్యవహరిస్తున్నది. అయితే భారత్ మాత్రం ఈ కార్యక్రమానికి పూర్తి దూరంగా ఉన్నది. అయితే అమెరికాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో భారత్ ఈ విన్యాసాల్లో పాల్గొనకపోవడం అనేక చర్చలకు దారి తీస్తున్నది. ఇటీవల అమెరికా హెచ్చరికలకు భారత్ తలొగ్గుతూ వస్తున్నది. ట్రంప్ హెచ్చరికలతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలను మోడీ సర్కారు ఆపేసింది. ఇప్పుడు ట్రంప్‌నకు భయపడే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నదనే విశ్లేషణలు సైతం వినబడుతున్నాయి. దీనిని భారత్.. అమెరికాతో సంబంధాలను సమతుల్యం చేసుకునే ప్రయత్నంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. న్యూఢిల్లీకి చెందిన అబ్జర్వ రీసెర్చ్ ఫౌండేషన్ విశ్లేషకులు హర్ష్ పంత్ మాట్లాడుతూ… ”చైనా, రష్యా, ఇరాన్ వంటి దేశాలకు ఈ విన్యాసాలు అమెరికాకు వ్యతిరేకంగా తమ స్థానాన్ని చాటుకునే అవకాశంగా మారుతున్నాయి. భారత్ మాత్రం అలాంటి ముద్ర పడకూడదనే ఉద్దేశంతో దూరంగా ఉన్నది” అని చెప్పారు.
విన్యాసాల ప్రాధాన్యం ఏమిటీ?
దక్షిణాఫ్రికా ఇప్పటికే రష్యా, చైనాలతో కలిసి గతంలో కూడా నౌకాదళ విన్యాసాలు చేపట్టింది. ఈ సారి నిర్వహిస్తున్న విన్యాసాలు సముద్ర వాణిజ్య మార్గాల భద్రత, పరస్పర సహకారం, నౌకాదళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా ఉన్నాయని దక్షినాఫ్రికా రక్షణ శాఖ తెలిపింది. ఇటు ఈ విన్యాసాలు జరుగుతున్న సమయంలోనే అమెరికా-రష్యా, అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల కరేబియన్ సముద్రంలో వెనిజులాకు వ్యతిరేకంగా అమెరికా కవ్వింపు చర్యలు, ఆ దేశ అధ్యక్షుడు మదురోను అపహరించడం, రష్యా, వెనిజులా దేశాలకు చెందిన చమురు ట్యాంకర్‌లను స్వాధీనం చేసుకోవడం జరిగాయి. ఇవి అంతర్జాతీయంగా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
‘బ్రిక్స్’ యుద్ధ విన్యాసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



