వాగు పైన వంతెన నిర్మాణం ఆశలన్నీ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు పైనే..
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మాదన్ హిప్పరగా గ్రామ ప్రజలకు వర్షాకాలం వచ్చింది అంటే నాలుగు నెలలపాటు ఇబ్బందికరమే. ఎందుకంటే గ్రామానికి ఆనుకొని ఉన్న వాగు వర్షాకాలంలో పొంగిపొర్లుతుంది. అంతేగాక గ్రామంలోకి నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. వరద నీటితో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాక వ్యవసాయ పనులకు వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. వాగు అవతలి ఒడ్డున దాదాపు 900 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఏండ్ల తరబడి వాగు పైన వంతెన నిర్మాణం చేపట్టాల గ్రామస్థులు ప్రతి అసెంబ్లీ ఎన్నికల ముందు నాయకులకు గుర్తు చేస్తున్నారు.
2023లో అప్పటి ఎమ్మెల్యే హనుమంతు షిండే వాగు పైన వంతెన నిర్మాణం చేపట్టడానికి రూ.3 కోట్ల 60 లక్షల నిధులు మంజూరు చేయించి శీలా పలుకం వేసి శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజల ఆశయాలు ఆ శిలా పలకానికే పరిమితం అయ్యాయి. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పైనే వారు ఆశలు పెట్టుకుంటున్నారు. వాగు అవతలి ఒడ్డున వందలాది ఎకరాలు వ్యవసాయ భూములున్నాయి. వంతెన నిర్మిస్తే వ్యవసాయ పనులకు అనుకూలం కావడమే కాకుండా పక్క మండలాలైన ఇటు బీర్కూర్ అటు పొగల్ వెళ్లడానికి ఎంతో సులభతరం అవుతుందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం నవతెలంగాణ ఆ గ్రామాన్ని సందర్శించగా.. గ్రామస్తులు మాట్లాడుతూ.. వాగుపై వంతెన నిర్మించాలని గ్రామానికి, మండలానికి వచ్చే ప్రతి రాజకీయ నాయకుడికి ఎన్నో సార్లు విన్నవించామని అన్నారు. ఈ వంతెను మాకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, వెంటనే వంతెనను నిర్మిస్తే ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నారు.



