ఇది బివిఎన్ స్వామి ఆత్మ కథాత్మక నవల. ఐదు సంవత్సరాల ప్రాయం నుండి 61 సంవత్సరాల వయసు వరకు బడితో ముడిపడిన బంధం వారిది. తను విద్యార్థిగా చదువుకోవడానికి చేరినప్పుడు పల్లెటూరి బడిలో ప్రారంభమవుతుంది నవల. అధ్యాపకుడిగా ఎదిగి చదువు బోధించి విజయం సాధించి పట్టణం బడి నుంచి ఉద్యోగ విరమణ పొందినప్పుడు ముగుస్తుంది. ఆరు దశాబ్దాల విద్యావ్యవస్థ పరిణామమంతా నవల చిత్రించింది. బాల్యంలో బడి వాతావరణం, ఇంటి పరిస్థితులు, పల్లె సోయగాలు, విద్యార్థుల మనస్తత్వాలు, ఉపాధ్యాయుల ప్రవర్తనలను చక్కగా అక్షరబద్ధం చేశారు. ఉన్నత విద్య కోసం వరంగల్ ఆ తర్వాత గుంటూరు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను, తన అనుభవాలను ఆసక్తికరంగా తెలియజేశారు.
ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సి రావడం, కుటుంబాన్ని పోషించడం కోసం ప్రైవేటు పాఠశాలలో పనిచేయడం, చాలీచాలని జీవితాన్ని గడపడం, చివరకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాతనే జీవితంలో స్థిరపడటం జరుగుతుంది. విద్యార్థిగానే కాకుండా అధ్యాపకుడిగా కూడా ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు వివిధ స్థాయిలలో అధ్యాపకుడిగా కొనసాగారు. నిజాయితీ, నిబద్దత కలిగిన ఉపాధ్యాయుడిగా విద్యా ప్రమాణాలు క్షీణించడాన్ని చూసి తట్టుకోలేకపోయేవారు. విద్యార్థుల విశ్రంఖలత, తల్లిదండ్రుల చిన్న చూపు, ఉపాధ్యాయులు మరచిన వృత్తి నిబద్దత, బలి పశువును చేసే అధికారులు, ఉపాధ్యాయ సంఘాల రాజకీయాలు, ప్రభుత్వాల ఉదాసీనత, సర్వీస్ రూల్స్ ప్రశ్నార్ధకాలు కావడం, కోర్టుల జోక్యం, బడిపట్ల విముఖతను కలిగించాయి.
దాని నుండి బయటపడి మొక్కుబడిగా పనిచేసే సమయాన, పదవి విరమణ కావడంతో సంతోషంగా బడి నుండి నిష్క్రమించారు. బడి పట్ల ఏమి తెలియని ఉత్సుకతతో మొదలైన ప్రయాణం పండిన అనుభవంతో ముగుస్తుంది. చివరగా కరీంనగర్ సాహిత్య వాతావరణ ప్రభావం వల్ల ఆయన కథకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా ఎదిగిన క్రమం ఆసక్తికరమైనది. ఇది ఆత్మ కథాత్మక నవల అయినప్పటికీ పెళ్లి, సంసారం, పిల్లలు, కుటుంబం గురించి ఏమి చెప్పలేదు. 1600 పేజీలతో, రెండేసి సంపుటాలతో ఆత్మకథలు వస్తున్న ఈ రోజుల్లో, 126 పేజీలతో ఈ పుస్తకాన్ని ముగించడంతో – ఈ పుస్తకం చాలా క్లుప్తంగా ఉందనే అభిప్రాయం పాఠకుడికి కలగడంలో ఆశ్చర్యమేమున్నది?
- కె.పి.అశోక్ కుమార్
9700000948



