Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి కొనుగోలులో దళారుల దందా

పత్తి కొనుగోలులో దళారుల దందా

- Advertisement -

తూకం, ధరల్లో మోసాలు నష్టపోతున్న పత్తి రైతులు
చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
నవతెలంగాణ – కాటారం 

వానకాలం సీజన్లో అధిక వర్షాలు తెగుళ్ల కారణంగా పత్తి దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఎలాగోలాగా చేతికొచ్చిన అరకురా దిగుబడినైనా విక్రయించేందుకు వారు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. కాటారం మండలంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఏడు క్వింటల్లు, తేమ,  కపాస్ కిసాన్ యాపు తదితరుల నిబంధనలతో అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. చేసేదేమీ లేక తప్పని పరిస్థితులలో రైతులు చిల్లర దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని గ్రామాల్లో ఇష్టారాజ్యంగా కొనుగోలు చేపడుతున్నారు. ఫలితంగా ధర, తూకాల్లో మోసాలు పాల్పడుతుండడంతో అన్నదాతలు మరింత నష్టపోవాల్సి వస్తుంది. కనీసం పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ట్రేడు లైసెన్సు తీసుకోకుండనే దందా..!
మండలంలోని పత్తి కొనుగోలు చేసే దళారులు పుట్టకొక్కుల పుట్టుకొస్తున్నారు. వీరిలో ఒక్కరికి కూడా ట్రేడ్ లైసెన్స్ లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండానే పత్తి కొనుగోలు చేపడుతున్నారు. సీసీఐ అధికారులు కింటాలుకు దాదాపు రూ.8,000 ధర కల్పిస్తుండగా.. దళారులు మాత్రం రూ.6000 నుంచి రూ.6500 వరకే కొంటున్నారు. ఫలితంగా రైతులు రూ.1500 నుంచి రూ.2000 వరకు నష్టపోవాల్సి వస్తుంది. ధరతో పాటు,  తూకంలో తేడాలు ఉండడంతో మరింత నష్టం వాటిల్లుతుంది. మార్కెట్ కమిటీ అధికారులు, తునికల కొలత అధికారులు పర్యవేక్షణ కొరడాలంతో దళారుల మోసాలు అరికట్టే వారే కరువయ్యారు. ఇప్పటికైనా స్పందించి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -