– కాళేశ్వరం ద్వారా 10ఎకరాలకూ నీళ్లివ్వలేదు
– వాటిని కప్పిపుచ్చుకునేందుకే అవాకులు.. చవాకులు..
– 12 నుంచి వడ్డీ లేని రుణాలు పంపిణీ
– రైతుల సంక్షేమం కోసం రూ.70వేల కోట్లు ఖర్చు
– అత్యధికంగా 2000 మెగావాట్ల విద్యుత్ సరఫరా : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-మహబూబాబాద్
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా వచ్చిందని, రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌కు డిపాజిట్ కూడా దక్కదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో రోడ్లు, సబ్‌స్టేషన్ నిర్మాణాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కేసముద్రం మండల కేంద్రంలో సుమారు రూ.400కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు సోమలతండాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. బీఆర్‌ఎస్ 10ఏండ్లలో లక్ష కోట్ల నుంచి రూ.2లక్షల కోట్ల వరకు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పట్టుమని పది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. వాటిని కప్పిపుచ్చుకునేందుకు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి గడపకు సంక్షేమ కార్యక్రమాలు చేరవేసుకుంటూ ముందుకు పోతున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు అనవసరంగా ఎక్కువగా ఊహించుకొని సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు పేల్చొద్దని సూచించారు.
కృష్ణ, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమా..?
బేసిన్‌ల గురించి తెలియదంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, కానీ, కృష్ణ, గోదావరి బేసిన్ జలాల గురించి ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం గుర్తు చేసుకోవాలని భట్టి అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జలాల విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా చూపించారని తెలిపారు. కృష్ణ, గోదావరికి బేసిన్ ప్రాజెక్టుల్లో నీళ్ల గురించి లెక్కలతో సహా శాసనసభలో చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పెద్ద మనిషి కేసీఆర్ కూడా చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ సవాల్‌ను స్వీకరించకుండా మరొకరు ప్రెస్‌క్లబ్‌కు వచ్చి సవాల్ అంటే ఎట్లా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ కాలంలో 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉండగా, ఈ సంవత్సరం మార్చిలో అదనంగా 2000 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చిందని వివరించారు. ఇంత డిమాండ్ వచ్చినప్పటికీ రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్తు సేవలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు డ్వాక్రా మహిళలకు ప్రతి సంవత్సరం రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించి మొదటి సంవత్సరంలో రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని అన్నారు. ఈనెల 12 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. పోడు రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్పు, అవకాడో, వెదురు వంటి మొక్కలు ఉచితంగా అందించేందుకు రూ.12,600కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
స్థానికం కోసమే బీఆర్‌ఎస్ రంకెలు మంత్రి పొంగులేటి
రాబోయే స్థానిక ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే బీఆర్‌ఎస్ నేతలు రంకెలు వేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు మరోసారి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. తాము అభివృద్ధి కోసం కష్టపడుతుంటే.. బీఆర్‌ఎస్ నాయకులు పోట్లగిత్తల్లా రోడ్లపైపడి సీఎంను ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై మొసలికన్నీరు కారుస్తూ సీఎం రేవంత్‌ను దుర్భాషలాడుతున్న కేటీఆర్‌కు ఈ సభే సరైన సమాధానం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రనాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, నాగరాజు, డాక్టర్ భూక్య మురళనాయక్, ట్రైకార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో, జిల్లా అటవీశాఖ అధికారి విశాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.