నవతెలంగాణ-హైదరాబాద్ : ఆరునూరైనా రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ మొదలవ్వగా.. రిజర్వేషన్ల అమలుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు సోనియాగాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీకి తెలియకుండా తాను నిర్ణయం తీసుకోలేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందని, ఇప్పటికే ప్రధాని అపాయింట్ మెంట్ కోసం 5 సార్లు ప్రయత్నించామన్నారు. ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా కూడా చేశామని, ఇతర రాష్ట్రాల వారు తమకు మద్దతిచ్చారు కానీ.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం స్పందించలేదని విమర్శించారు. బలహీనవర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదన్నారు.
బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ ను వేశామని చెప్పారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలని తాము ప్రయత్నిస్తోంటే బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపిస్తే.. గవర్నర్, గత సీఎంల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే బిల్లులు ఆగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెరవెనుక లాబీయింగ్ జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలైతే తాను సంతోషంగా ఉంటానని మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారని, తమ నాయకులైన కేసీఆర్, కేటీఆర్ ఈ బిల్లు అమలైతే సంతోషంగా ఉండరని చెప్పకనే చెప్పారన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలుపై ఆరోపణలు చేయడం మాని.. సూచనలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి.. గంగుల కమలాకర్ ను కోరారు. ఎలాంటి సవరణలు లేకుండాబిల్లును ఆమోదించాలని సీఎం రేవంత్ తెలిపారు. అది కల్వకుంట్ల కుటుంబం కాదు.. ఎవరూకలవకుండా చూసే కుటుంబమని కేసీఆర్ ఫ్యామిలీపై కామెంట్స్ చేశారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న చిత్తశుద్ధి కేసీఆర్ కు ఏ మాత్రమున్నా సభకు వచ్చేవారన్నారు.