Monday, February 16, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయికల్ మున్సిపల్‌పై ఎగిరిన బీఆర్ఎస్ జెండా

రాయికల్ మున్సిపల్‌పై ఎగిరిన బీఆర్ఎస్ జెండా

- Advertisement -

-ఎల్. రమణ జోక్యంతో కూటమి ఖరారు
-చైర్మన్‌గా కట్కం రవీందర్, వైస్ చైర్మన్‌గా తురగ సౌజన్య
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ పట్టణ మున్సిపాలిటీలో జరిగిన రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాలకు వేదికయ్యాయి. స్థానాల పరంగా బీజేపీ ఐదు వార్డులు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. బీఆర్ఎస్(3), కాంగ్రెస్ (3), స్వతంత్ర (1) సభ్యుల కూటమి మెజారిటీ సాధించి పాలక మండలిని తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో రాయికల్ మున్సిపల్‌పై బీఆర్ఎస్ జెండా ఎగిరింది.

మున్సిపల్ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ తరఫున రెండవ వార్డు కౌన్సిలర్ కట్కం రవీందర్‌ను ప్రతిపాదించారు. నాల్గవ వార్డు కౌన్సిలర్ తురగ సౌజన్య ప్రతిపాదించగా.. ఏడవ వార్డు కౌన్సిలర్ ఎలిగేటి లతిక బలపరిచారు. బీజేపీ తరఫున 12వ వార్డు కౌన్సిలర్ కల్లెడ ధర్మపురిని కూనారపు మానస ప్రతిపాదించగా.. తోపరపు ప్రశాంతి బలపరిచారు. వైస్ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ నుంచి నాల్గవ వార్డు కౌన్సిలర్ తురగ సౌజన్యను ప్రతిపాదించగా.. ఎలిగేటి లతిక బలపరిచారు. బీజేపీ తరఫున 11వ వార్డు కౌన్సిలర్ పుర్రె శ్రీధర్‌ను తోపరపు ప్రశాంతి ప్రతిపాదించగా.. వేముల మౌనిక బలపరిచారు.

ఎన్నికల అనంతరం కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లు బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం కీలకంగా మారింది. కూటమి ఏర్పాటులో కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆయన చొరవతో కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుల మద్దతు బీఆర్ఎస్‌కు లభించడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖరారయ్యాయి. తదనంతరం జరిగిన కార్యక్రమంలో కట్కం రవీందర్ మున్సిపల్ చైర్మన్‌గా, తురగ సౌజన్య వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కట్కం రవీందర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, పారిశుధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా, రహదారుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కూటమి సహకారంతో పారదర్శక పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామాలతో రాయికల్ పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడ్డాయి. ఇకపై కూటమి సమన్వయం, అభివృద్ధి పనుల అమలుపై పట్టణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -