మున్సిపల్ ఎన్నికలతో మోడీకేం సంబంధం?
రాష్ట్రంలోని కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి అదనంగా ఏం తెచ్చారు?
ప్రజాసంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ మాత్రమే
ఫోన్‌ట్యాపింగ్ దొంగలు ఏదో ఘనకార్యం చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు
గతాన్ని మర్చిపోవద్దు. భవిష్యత్‌పై ఆశను కోల్పోవద్దు. ప్రజలు ఆలోచించాలి
మున్సిపల్ ఓటర్లకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ, బీఆర్‌ఎస్ దొందూ దొందే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రధాని మోడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇంటిదగ్గర మోరీ నిండితే మోడీ వచ్చి తీస్తారా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులుగా పనిచేస్తున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఆపార్టీకి చెందిన ఎంపీలు ప్రధాని మోడీని ఒప్పించి, రాష్ట్రానికి అదనంగా ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. బీజేపీ నేతలు రోజూ శ్రీరాముడిని తలుచుకోకున్నా, ఎంఐఎంను మాత్రం స్మరిస్తూనే ఉంటారన్నారు. మత విద్వేషాలు తప్ప వారికి మరో ఎజెండా లేదనీ, ఆపార్టీ రాజకీయ భావదారిద్య్రానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. కేంద్రంలో 12 ఏండ్లుగా మోడీ, రాష్ట్రంలో పదేండ్లు కేసీఆర్ అధికారాన్ని చెలాయించారనీ, వీరిద్దరి వల్ల ప్రజలకు ఒనగూరిన ప్రయోజనాలు ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పదేండ్లు అన్ని వార్డులు, గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీల్లో అధికారాన్ని వెలగబెట్టింది బీఆర్‌ఎస్ నేతలేననీ, అప్పట్లో వారందరినీ ఉత్సవ విగ్రహాలుగా మార్చి ‘ఆ నలుగురు’ అధికారాన్ని చెలాయించారని గుర్తుచేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో సమస్యలు న్నాయంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారనీ, అంటే ఈ పదేండ్లలో వారు ప్రజలకు ఏం చేయలేదని ఒప్పుకుంటున్నట్టేనని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ,బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కండ్ల ముందున్న గతం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
సత్రం భోజనానికి కేంద్రమంత్రుల రికమండేషన్
గతంలో హైదరాబాద్ వరదల సమయంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో కారుకు కారు, బైకుకు బైకు ఇస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం చేస్తే, దాన్ని కిషన్‌రెడ్డి ఆమోదించారని తెలిపారు. ఆ మాట నమ్మి జీహెచ్‌ఎంసీలో 1/3 ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే, ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోగా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని ఓ ఉచిత సలహా పడేశారనీ, ఇదీ ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి అని వివరించారు. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రెకమెండేషన్ ఇవ్వడమంటే ఇదేనని చమత్కరించారు.
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు
తెలంగాణకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్‌రెడ్డి, ఆపార్టీ ఎంపీలు ప్రధాని, నిట్ ఆయోగ్ వద్ద ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు మాట్లాడితే మీకు న్యాయమనిపిస్తుందా అని అడిగారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా తీసుకురాలేదనీ, కనీసం మూసీ ప్రక్షాళన, మెట్రోరైల్ విస్తరణ కోసం అదనంగా ఎలాంటి గ్రాంట్‌ను తేలేదని గుర్తుచేశారు.
సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నుంచి ఎన్ని ప్రత్యేక నిధులు తెచ్చారని నిలదీశారు. పైపెచ్చు యూపీఏ హయాంలో తెలంగాణకు ఇచ్చిన ఐటీఐఆర్‌ను మోడీ రద్దు చేస్తే, సెమీ కండక్టర్ ప్రాజెక్టులు రాకుండా అడ్డుపడితే బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారని అడిగారు. రాష్ట్రం సంగతి సరే…కనీసం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకైనా అదనంగా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఏకరువు పెట్టారు.
ప్రాజెక్టుల సంగతి ఏం చేశారు?
2014 ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ పాలమూరు సభలో మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామన్నారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ అంశాన్ని ప్రస్తావించి జాతీయ హోదా ప్రకటిస్తారనుకుంటే ఆయన నిరాశపరిచారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆదిలాబాద్‌లో ప్రచారానికి వచ్చి ఆ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు సహకరిస్తామని ప్రకటిస్తారని భావించాం. కానీ ఆయన తెలంగాణ ప్రజల్ని అవమానించి మాట్లాడి, ఓట్లు మాత్రం తమపార్టీకి వేయాలని కోరారు.
మేం ఇచ్చేదెంత? మీరు ఇస్తున్నదెంత?
కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్లు మంజూరు చేశామని చెప్తున్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.1 వెళ్తే, వస్తున్నది 42 పైసలే. అలాగే కర్ణాటకకు 16 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేస్తుంది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్‌లో ఒక రూపాయి కేంద్రానికి వస్తే, రూ.6.06 పైసలు ఇస్తున్నారనీ, మద్యప్రదేశ్‌కు రూ.2.09 పైసలు, ఉత్తర ప్రదేశ్‌కు రూ.2.03 పైసలు ఇస్తున్నారు.
అభివృద్ధి నిరోధకులు
అభివృద్ధి నిరోధకులుగా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వారిద్దరికీ ప్రజలు బుద్ధి చెప్పాలి. బీఆర్‌ఎస్ నేతలు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులను బెదిరించి వందల కోట్లు వసూలు చేశారు. దానిపై విచారణకు పిలిస్తే సిగ్గుపడుతూ ముసుగు తొడుక్కుని వెళ్లకుండా, బరితెగించి ఏదో యుద్ధానికి వెళ్లినట్టు వెళుతున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు.



