గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జీలను నియమించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాల్టీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇన్‌చార్జీగా బాధ్యతలను అప్పగించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయకర్తల ప్రధాన బాధ్యతగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వారు నిరంతరం ఆయా మున్సిపాల్టీల్లో అందుబాటులో ఉంటారని వివరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ సమన్వయకర్తలు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారని పేర్కొన్నారు. పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ లెవల్ ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎన్నికల సరళిని, క్షేత్రస్థాయి నివేదికలను ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.



