Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ది అహంకారం..కాంగ్రెస్‌ది అవినీతి

బీఆర్‌ఎస్‌ది అహంకారం..కాంగ్రెస్‌ది అవినీతి

- Advertisement -

ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను వదలం : మహబూబ్‌నగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితీన్‌ నబీన్‌ సిన్హా

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో గతంలో బీఆర్‌ఎస్‌ అహంకారపూరిత మైన పరిపాలన కొనసాగిస్తే.. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్‌ నబీన్‌ సిన్హా ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో బుధవారం ‘విజయసంకల్ప సమ్మేళనం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నంది అవార్డుల ప్రకటనలో తెలంగాణకు పెద్ద పీట వేసిందని గుర్తు చేశారు. రెండు నెలలుగా వరుసగా స్థానిక ఎన్నికల వల్ల తెలంగాణలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయని, ప్రజలు గుర్తించి ప్రజాసేవ చేసే వారికి పట్టం కట్టాలని కోరారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల పథకాలను కేవలం మైనార్టీలకే ఇస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. పారదర్శకంగా వక్ఫ్‌బోర్డును తీసుకొస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. నైజాం కాలంలో దేవాలయాలను ధ్వంసం చేసి ఎండోమెంట్‌ భూములను కబ్జా చేసిన వారిని వెనుకేసుకరావడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం రాజ్యమేలుతున్నదని, ప్రజలు గమనించి మున్సిపాలిటీ ఎన్నికలలో అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, పార్లమెంటు సభ్యులు డికె.అరుణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -