‘నీళ్లు-నిజాలు’ లక్ష్యం అదే
‘పవర్‌పాయింట్’పై ఏకపక్ష చర్చ
అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలోని డొల్లతనాన్ని ఎత్తిచూపడమే లక్ష్యంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ‘నీళ్లు-నిజాలు’ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మాజీ సీఎం కే చంద్రశేఖరరావు (కేసీఆర్)ను దోషిగా నిలబెట్టేందుకు అందుబాటులో ఉన్న అని ఆధారాలను సేకరించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్ తర్వాత ఈ అంశంపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. అందరూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పారు. 2023 నుంచి వరుస ఎన్నికల్లో పరాజయం పొందుతున్న బీఆర్‌ఎస్, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే మళ్ళీ ‘నీటి’ సెంటిమెంట్‌ను ఎత్తుకుందని విమర్శనాస్త్రాలు సంధించారు.
అక్బరుద్దీన్ మాట్లాడుతూ తాను అసెంబ్లీలో 26 ఏండ్లుగా సభ్యుడిగా ఉన్నాననీ, అప్పటి నుంచి దాదాపు 240 సార్లు ఈ అంశంపై మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా,తాము చేసిన సలహాలు, సూచనలు స్వీకరించలేదని ఆక్షేపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అదే పని చేసిందన్నారు. కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్ర వాటాకు సంబంధించి అనేక గణాంకాలను ఆయన సభలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తిగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. పాలమూరును ఎండబెట్టారంటూ ఫైర్ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పారు. అయితే ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు ‘టచ్ మీ నాట్’ అన్నట్టే వ్యవహరించారు. బీఆర్‌ఎస్ తప్పుల్ని ఎత్తిచూపుతూనే, కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుపట్టే ప్రయత్నం చేశారు.
నీళ్లు నిజాలపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్య సాంకేతిక అంశాలు
-ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్ట్‌లు మంజూరు చేశాయి.
-2005 నుంచి 2014 వరకు కృష్ణా బేసిన్‌లో ఎస్‌ఎల్‌బీసీ కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల సాగర్ ప్రాజెక్ట్‌లను చేపట్టింది.
-2014లో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేయకపోగా అసంపూర్తిగా వదిలేసింది
-కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టి తెలంగాణకు మరణ శాసనం రాశారు.
-కంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2015 జూన్‌లో జరిగిన అంతరాష్ట్ర సమావేశంలో 811 టీఎంసీల్లో 480 టీఎంసీలు అడగాల్సింది పోయి 299 టీఎంసీలకు అంగీకరించారు.
-2016 సెప్టెంబర్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో 299 టీఎంసీలకు తాత్కాలికంగా ఒప్పుకున్నారు.
-బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ తుది తీర్పు వచ్చేవరకు 299 టీఎంసీలే వాడుకుంటామని 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్‌లో శాశ్వతంగా ఒప్పుకున్నారు.
-పాలమూరు రంగారెడ్డి కట్టాలని 2009లో ఆనాటి ఎంపీ విఠల్‌రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి లేఖ రాశారు.
-జూరాల నుంచి రోజుకు 2టీఎంసీల చొప్పున 70 టీఎంసీల వరద జలాలను తరలించి సాగునీటిని అందించాలని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఉమ్మడి రాష్ట్రం అమోదం తెలిపింది.
-డీపీఆర్ బాధ్యతలు ఇంజినీరింగ్ స్టాప్ కాలేజి ఆఫ్ ఇండియా (ఈఎస్‌సీఐ) ప్రభుత్వం అప్పగించింది.
-తెలంగాణ ఉద్యమకారులు, ఇంజినీర్ల ప్రతిపాదనలకు భిన్నంగా జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్ట్ మార్చాలని కేసీఆర్ జీవో జారీ చేశారు.
-కేసీఆర్ నిర్ణయం వల్ల ప్రాజెక్ట్ అంచనా రూ.5,185 కోట్ల నుంచి రూ.10,335 కోట్లకు పెంచారు.
శాసన సభ ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర కరువు ప్రాంతం. అత్యధిక వలసలకు గురైన ప్రాంతం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నాటి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేష్( పీఆర్‌ఎల్‌ఐఎస్)ను చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గత పదేండ్లలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సరైన పురోగతి లేకపోవడంతో అంచనాలు, నిర్మాణ వ్యయాలు పెరిగిపోయాయి. వీటిని పరిగణంలోకి తీసుకుని ఈ శాసనసభ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (90టీఎంసీలతో త్రాగు, సాగు నీటి కొరకు) సంబంధించిన అన్ని అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.
-ఇరు రాష్ట్రాల అంతరాష్ట్ర జల వివాదాలన్ని పరిష్కరించే వరకు అంధ్రప్రదేశ్ చేపట్టబోతున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్/ పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ లేదా మరే ఏ ఇతర రూపంలో నైనా గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.



