మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఉత్సాహంగా సాగిన విస్తృతస్థాయి సమావేశం
నవతెలంగాణ – పరకాల
స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని మొత్తం స్థానాలు బిఆర్ఎస్ పార్టే హస్తగతం చేసుకుంటుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పరకాల పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో పరకాల, నడికుడ మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో కార్యకర్తలు తమ అనుభవాలను ధర్మారెడ్డితో పంచుకున్నారు.గ్రామాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసగించి అన్యాయం చేసిందన్నారు.బోగస్ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరువని ఆరుగాలం కష్టంచేసే రైతన్నలకు ఎరువులు కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు పడుతున్నారన్నారు.చెప్పులను క్యూ లైన్లో పెట్టి రైతులు, మహిళా రైతుల ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.పొలం పనులు వదులుకొని రోజంతా తిప్పలు పడితే, రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటలకు తావులేదు.రైతులకు కావాల్సిన ఎరువులను ముందస్తు ప్రణాళికతో అందుబాటులో ఉంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
తెలంగాణ ప్రధాన సమస్యగా మారిన నీటి సమస్యను శాశ్వతముగా పరిష్కరించేందుకు దేశానికే తలమానికంగా నిలిచేలా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించి తెలంగాణ సస్యశ్యామలం చేసిన అపర భగీరధుడు కేసీఆర్ అంటూ కొనియాడారు.కేవలం రాజకీయ కక్షసాగింపుకు నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ కూలిందని దుష్ప్రచారం చేసి వదిలేసిందన్నారు. నేడు వర్షాలు లేక రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారినాయి ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం పెట్టుకొని తెలంగాణ నీటి బొట్టు ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నారన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లను పెంచి ఇస్తామని ఎన్నికల్లో గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి పెన్షన్లు పెంచుడు ఏమోగానీ ఉన్న పెన్షన్లే రెండు నెలలు ఎగ్గొట్టిండు ప్రజలను మోసం చేసిండంటు మండిపడ్డారు.అంతే కాకుండా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్ల సమక్షంలో అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకంలో 3000 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది.ఇండ్లు నిర్మాణం కూడా లబ్ధిదారులు ప్రారంభించారని.బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారి అనుచరులకు,కార్యకర్తలకు ఇండ్లు ఇవ్వాలనే నెపంతో గృహలక్ష్మి లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వపోకా అవి రద్దు చేసిందన్నారు.గృహలక్ష్మి లబ్దిదారులందరు కోర్టును ఆశ్రయించగా కోర్టు వారికి మద్దతుగా నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టినట్లు తెలిపారు.వెంటనే గృహలక్ష్మి పథకంలో ఇండ్లు నిర్మాణం చేపట్టిన వారికి బిల్లులు చెల్లించాలని కోర్టు ప్రభత్వాన్ని ఆదేశించిందన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ ప్రజల మద్దతుతో దేశానికే తలమానికంగా నిలిచేలా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటుచేయడం జరిగిందని వస్త్ర పరిశ్రమకు ఏర్పాటుకు సంహరించి భూములు ఇచ్చిన రైతులను బిఆర్ఎస్ ప్రభుత్వం అక్కున చేర్చుకుందన్నారు.ఎకరాకు మంచి ధర ఇచ్చి,వంద గజాల ప్లాట్ ఇవ్వడం జరిగిందని. సుమారు 1000 కోట్లతో వస్త్ర పరిశ్రమలో అభివృద్ధి పనులు చేశామన్నారు.
ఆ వస్త్ర పరిశ్రమలో బిఆర్ఎస్ హయాంలో నెలకొన్న కంపెనీలు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేసిందేమి లేకపోగా..పలు కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకొని వెళ్లిపోయాయన్నారు.రాష్ట్రంలో 100 గురుకులాలు ఉంటే 1022 పెంచిన ఘనత కేసీఆర్ దేనన్నారు.ఉన్నవాళ్ల పిల్లలు తినే సన్నబియ్యమే గురుకులాల్లో చదివే పేద విద్యార్థులకు కేసీఆర్ సన్నబియ్యంతో అన్నంపెట్టారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు.విద్యార్థులకు కనీసం మంచి భోజనం,కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారు.ఫుడ్ పాయిజనింగ్ తో కొంతమంది.గురుకులాల్లో నెలకొన్న వివిధ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకొని మృతిచెందిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. గురుకులాల్లో ఇంత జరిగిన కనీసం సీఎం రేవంత్ రెడ్డి స్పందించక పోవడం విచారకరమంటు ఆవేదన వ్యక్తం చేశారు.
పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని,రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పల్లెప్రగతి కార్యక్రమం కేసీఆర్ చేపట్టారని. గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, నూతన గ్రామపంచాయతి భవనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మాణాలు, జిపిలకు ట్రాక్టర్లు, ట్రాలీలో, ట్యాoకర్లు, నర్సరీలు,పల్లెప్రకృతివనాలు ఏర్పాటు, గ్రామానికి అనుసంధానంగా ఉండే రోడ్లు,అంతర్గత రోడ్లు నిర్మాణం చేసి కనీవినీ ఎరగని రీతిలో గ్రామాలను అభివృద్ధి చేశారన్నారు. నేడు కాంగ్రెస్ హయాంలో కనీస పారిశుధ్య పనులు చేయించేవారు లేరు,జిపి సిబ్బందికి జీతాలు లేవు, ట్రాక్టర్లకు పోయడానికి డీజిల్ లేదు. పల్లె ప్రకృతివనాలాలను, వైకుంఠధామాలను శుభ్రం చేసేవారు లేదంటూ ఆరోపించారు.
గతంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అన్ని అనుమతులతో మొరం వాడుతుంటే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు నేడు అదే మొరం అక్రమంగా అమ్ముకుంటూ ఒక మాఫియాగా మారి ట్రిప్పుకు ఇంత వసూళ్లు చేస్తున్నారంటు విమర్శించారు.పేదవాడు ఇంటికి కావాలంటే సవాలక్ష అనుమతులు అడిగే అధికారులు ఈ మాఫియాకు కొమ్ముకాస్తున్నారన్నారు.
గ్రామాల అభివృధ్ధికోసం అప్పోసొప్పోచేసి పనులు చేస్తే 18 నెలలుగా వారికీ బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వానికి వారి ఉసురు తాకుతుందంటు మండిపడ్డారు.బడా కాంట్రాక్టర్లకు పర్శంటేజీలు తీసుకొని వేలకోట్ల బిల్లులు మంజూరుచేస్తూ.గ్రామాల అభివృధ్ధికోసం పనిచేసిన వారికి ఎందుకివ్వరు.వారి కుటుంబంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.వారి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదేనన్నారు.వెంటనే సర్పంచుల బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలు గమనిస్తున్నారు.వచ్చే స్థానిక సంస్థ ఆ పార్టీకి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.మోసపూరిత ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకంపోయింది.మల్లి వీళ్ళ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరన్నారు.ప్రజాపాలన పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు.అందుకోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.కార్యకర్తలు ఎవరి బెదిరింపులకు,కేసులకు భయపడాల్సిన పనిలేదు.మీకు అండగా నేనుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.