Monday, January 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'మెఘా'ను రక్షించేలా బీఆర్‌ఎస్‌ వ్యవహారం

‘మెఘా’ను రక్షించేలా బీఆర్‌ఎస్‌ వ్యవహారం

- Advertisement -

కార్మికులను పట్టించుకోని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌
ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ ఒక జోక్‌ : కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగరేణి కాంట్రాక్ట్‌ల విషయంలో మెఘా కృష్ణారెడ్డిని రక్షించేలా బీఆర్‌ఎస్‌ వ్యవహారం ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సమస్యలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్త చేశారు. మెఘా కృష్ణారెడ్డికి రూ.25 వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నదని ఆమె ఆరోపించారు. ఆ కాంట్రాక్ట్‌ల విషయంలో సృజన్‌ రెడ్డి చిన్న చేప మాత్రమేనని ఆమె తెలిపారు. మెఘాను రక్షించేందుకే బీఆర్‌ఎస్‌ విషయాన్ని సృజన్‌ రెడ్డి చుట్టూ తిప్పుతోందని ఆరోపించారు. సింగరేణి విషయంలో తప్పులు చేయనట్టే బీఆర్‌ఎస్‌ మాట్లాడుతుందని ఆమె ఎద్దేవా చేశారు. సృజన్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ హయాంలో కాంట్రాక్ట్‌లు ఇవ్వలేదా? అని ఆమె ప్రశ్నించారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్రసార మాధ్యమాల్లో కథనం వస్తే ఒక విధంగా, దళిత మహిళపై వస్తే మరో విధంగా స్పందిస్తున్నారని బీఆర్‌ఎస్‌ను తప్పుపట్టారు. తాను కాంగ్రెస్‌ లో చేరబోతున్నట్టు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలంగాణ జాగృతిలోకి వస్తే నేషనల్‌ కన్వీనర్‌ పోస్ట్‌ ఇస్తామన్నారు. శాటిలైట్‌ ఛానెల్‌ ప్రతినిధులను కాంగ్రెస్‌ సర్కార్‌ అరెస్టు చేసిందనీ, అయితే అరెస్ట్‌ చేసిన తీరును కవిత ఖండించారు. జర్నలిస్టులకు నోటీసులిచ్చి వివరణ అడగాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌పై కథనాలు వేస్తే ఒక చానెల్‌పై దాడి చేసిన బీఆర్‌ఎస్‌, దళిత మహిళపై కథనాలొస్తే ఆమెకు మాత్రం అండగా నిలబడలేదని కవిత తప్పుపట్టారు. ఎన్నిసార్లు తాము కార్మికుల సమస్యలు లేవనెత్తిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బదులివ్వలేదనీ, వంద అన్యాయాలు జరిగినా బీఆర్‌ఎస్‌ మాట్లాడలేదని ఆమె గుర్తుచేశారు. తిమింగలం లాంటి కాంట్రాక్టర్‌కు అన్యాయం జరిగితే ముందుకొచ్చారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 36, 16, 7, 8 శాతం ఎక్సెస్‌ కు టెండర్లు ఇచ్చారని కవిత తెలిపారు. గతంలో సైట్‌ విజిట్‌ అనే నిబంధన కన్వెయర్‌ బెల్ట్‌లో ఉంటే, దాన్ని ప్రస్తుతం ఒబీకి విధించారని వివరించారు.

దళితులను అవమానించేలా హరీశ్‌ రావు తీరు
మాజీ మంత్రి హరీశ్‌ రావు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాయను అనడం దళిత సమాజాన్ని అవమానించేలా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణికి ఎండీవో సిస్టమ్‌తో నష్టమని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.25 వేల కోట్ల అప్పు పెడితే, ప్రస్తుతం రూ.50 వేల కోట్లు అయిందని తెలిపారు. పవర్‌ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదనీ, జీతాల కోసం అప్పులు తెచ్చే పరిస్థితికి దిగజార్చారని విమర్శించారు. ఎండీవో విధానాన్ని రద్దు చేయాలనీ, నైనీ బ్లాక్‌ ఉన్న ఒడిశాకు వెళ్లి ఓపెన్‌ కాస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఏపీలో, తెలంగాణలో ఉన్న కొత్త బ్లాక్‌లను సింగరేణికే ఇవ్వాలని ఆమె కోరారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలంగాణ జాగృతియే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణతో బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -