Thursday, February 19, 2026
E-PAPER
Homeక్రైమ్గర్భిణి దారుణ హత్య

గర్భిణి దారుణ హత్య

- Advertisement -

విడాకులిచ్చిందన్న కోపంతో కిరాతకంగా చంపిన మొదటి భర్త
పోలీసుల అదుపులో నిందితుడు

నవతెలంగాణ -వనస్థలిపురం
విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుని జీవిస్తున్న ఓ మహిళను ఆమె మాజీ భర్త అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మూడు నెలల గర్భవతిగా ఉన్న మహిళను హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర బల్లాపూర్‌ చంద్రపూరి జిల్లాకు చెందిన సునీతకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మహేష్‌తో 2022లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఇద్దరు కలిసి కెనడా వెళ్లారు. అక్కడ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో సునీత మూడు రోజుల్లో మళ్ళీ భారత్‌కు తిరిగి వచ్చేసింది. భర్త తనను కొడుతున్నాడని, మానసికంగా హింసిస్తున్నాడని చంద్రపూర్‌ జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌లో సునీత ఫిర్యాదు చేసింది.

2024లో కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. 2025 ఏప్రిల్‌లో సునీత రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనాథ్‌ను రెండో వివాహం చేసుకుని బి.ఎన్‌.రెడ్డి నగర్‌ డివిజన్‌ లుబ్బిని ఎలైట్‌ కాలనీలోని కేఎన్‌ఆర్‌ విడోస్‌ అపార్ట్మెంట్‌లో నాలుగో అంతస్తులో నివసిస్తున్నది. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. అయితే తన భార్య తనకు విడాకులు ఇవ్వడం వల్లే తన తల్లి మానసిక వేదనతో చనిపోయిందని, తనపై కేసులు ఉండటం వలన తిరిగి కెనడాకు కూడా వెళ్లలేకపోతున్నానని మహేష్‌ మానసిక ఉన్మాదిగా తయారయ్యాడు. సునీతను అంతం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే అతను ఒక పెద్ద బ్యాగులో చెట్లు కోసే రంపం, కత్తి, రెండు చాకులు, పెట్రోలు, డీజిల్‌ డబ్బాలతో బుధవారం ఆమె నివసించే ఇంట్లోకి చొరబడ్డాడు.

ఉద్యోగ విధుల్లో నిమగ్న‌మై ఉన్న సునీతను కత్తితో కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. గదిలో పెట్రోల్‌, కిరోసిన్‌ చల్లి తనపై కూడా పోసుకున్నాడు. మహిళ అరుపులు విని పక్కనే ఉన్న అత్త గట్టిగా అరిచింది. దాంతో స్థానికులు అప్రమత్తమవడంతో నిందితుడు బాత్రూమ్‌లో దాక్కున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని బెడ్‌ రూమ్‌ డోర్లను పగలగొట్టి లోపలికి ప్రవేశించి చూడగా సునీత రక్తపు మడుగులో పడి ఉంది. అయితే నిందితుడిని ఎస్సై రవి నాయక్‌ తన తెలివితో మాటల ద్వారా బయటికి తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నారు. తన జీవితాన్ని నాశనం చేయడం, తన అమ్మ చావుకు కారణమైనందువలన ఆమెను చంపినట్టు మహేష్‌ ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వనస్థలిపురం సీఐ తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -