కుట్రలు..ప్రయివేటీకరణ అడ్డంకులు దాటుకుని ముందుకు
2005 నాటికి టెలికాం రంగంలో నెంబర్ వన్
‘ప్రయివేటు’ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం తూట్లు
సాంకేతిక పరిజ్ఞానం అందజేతలో తీవ్ర నిర్లక్ష్యం
ఆ తర్వాత ప్రయివేటీకరణకు యత్నం
దీంతో నాలుగోస్థానానికి పడిపోయిన వైనం
ఐక్యంగా కొట్లాడి సంస్థను కాపాడుకుంటున్న ఉద్యోగులు
తక్కువ ధరతో రీచార్జ్, ఆఫర్లతో మళ్లీ పుంజుకుంటున్న బీఎస్‌ఎన్‌ఎల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) దిగ్విజయంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్నది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సన్నద్ధమవు తున్నది. పాలకుల ప్రయివేటీకరణ కుట్రలు, కుతంత్రాలు …మరోవైపు ప్రయివేటు రంగ సంస్థల తీవ్ర పోటీ…ఇలా అన్నింటినీ తట్టుకుని, దాటుకుని వడివడిగా ముందుకు సాగుతున్నది. ఏర్పడిన తొలి ఐదేండ్లలోనే నెంబర్‌వన్ స్థానానికి చేరుకున్న ఆ సంస్థ కార్పొరేట్ సంస్థల ఒత్తిడితో కేంద్ర పాలకులు శీతకన్ను వహించడం, 4జీ, 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వకుండా ప్రయివేటు వైపు పాలకులు మొగ్గుచూపడంతో ఇక బీఎస్‌ఎన్‌ఎల్ మూతపడబోతుందా? అనే దాకా పరిస్థితి వెళ్లింది. కానీ, బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఇతర ఉద్యోగ సంఘాల పోరాట పటిమతో ఆ సంస్థ ప్రయివేటీకరణ ఆగి పోయింది. పడిలేచిన కెరటంలా ప్రయివేటు టెలికాం రంగ సంస్థలను ధీటుగా ఎదుర్కొంటూ మళ్లీ వినియోగ దారుల ను ఆకర్షిస్తోంది. తన వృద్ధిని క్రమంగా పెంచుకుంటున్నది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) పబ్లిక్ సెక్టార్ కంపెనీ. 2000 సంవత్సరంలో అక్టోబర్ ఒకటో తేదీన పురుడుపోసుకున్నది.
ప్రజలకు మెరుగైన టెలికాం సేవలను సరసమైన ధరలకే అందిస్తూ అనతికాలంలోనే నెంబర్‌వన్ స్థానానికి చేరుకున్నది. 2.5 లక్షల మంది ఉద్యోగుల పట్టుదల, కృషి దాని వెనుక దాగి ఉంది. రిజర్వు ఫండ్ బ్యాలెన్స్ రూ.50 వేల కోట్లకు చేరుకున్నది. ఏటా వేల కోట్ల రూపాయలు లాభాలు గడించింది. దీంతో కార్పొరేట్ కంపెనీలు టెలికాం రంగంపై మరింత ఫోకస్ పెట్టాయి. పెద్ద ఎత్తున లాభాలను ఆర్జించే టెలికాం సేవలను ప్రయివేటీకరించి కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగింది. మిగతా ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగానే బీఎస్‌ఎన్‌ఎల్‌ను కూడా ప్రయివేటీకరించాలనే ప్రయత్నం తీవ్రస్థాయిలోనే జరిగింది. ఉద్యోగ సంఘాల ప్రతిఘటనతో అది సాధ్యం కాలేదు. కానీ, మరోవైపు కేంద్రం 2జీ స్పెక్ట్రం, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇవ్వకుండా ప్రయివేటు కంపెనీలకు కట్టబెట్టింది. రూ. 50,000 కోట్లకు పైగా బ్యాంక్ బ్యాలెన్స్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యానికిగానీ, ఉద్యోగులకు గానీ తెలియకుండా కేంద్రం బలవంతంగా లాక్కున్ని మరింత బలహీనపర్చింది. వీఆర్‌ఎస్ పేరుతో 80 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. సేవల విస్తరణలో ఆటంకం సృష్టించింది. మరోవైపు ప్రయివేటు టెలికాం రంగ సంస్థలకు అన్ని ప్రయోజనాలను మంజూరు చేస్తూ పోయింది. ఇంకోవైపు ఆ ప్రయోజనాలు బీఎస్‌ఎన్‌ఎల్‌కు దక్కకుండా నిరాకరించింది.
దీంతో ఆ సంస్థ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. ప్రయివేటు టెలికాం రంగ సంస్థలు 4జీ, 5జీ సేవలు అందిస్తున్న కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్ 2జీ, 3జీ సేవలతో నెట్టుకురావాల్సిన పరిస్థితి. దీంతో మెరుగైన సేవల కోసం అనివార్యంగా బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు ప్రయివేటు సంస్థల వైపు ఆకర్షితులు కావడం మొదలు పెట్టారు. 2005లో టెలికాం రంగంలో 21 శాతం వాటాను కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్ 2022 నాటికి 7.9 శాతానికి పడిపోయింది. మన దేశంలో నాలుగో అతిపెద్ద టెలికాం రంగ సంస్థగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 25వ స్థానంలో ఉంది. ఈ సంస్థకు ప్రస్తుతం 91.01 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మన దేశంలో 92 శాతం వాటాను జియో, వీఐ, ఎయిర్‌టెల్ సంస్థలు కలిగిఉన్నాయి. అయితే, ఆ కంపెనీలు మంత్లీ, త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక ప్లాన్ల ధరలను, డేటా చార్జీలను ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ప్రజలకు అందుబాటులో అత్యంత సరసమైన ధరల్లో సేవలు అందిస్తుండటంలో ఇటీవలి కాలంలో క్రమంగా ఈ సంస్థవైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నది. ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతుం డటంతో అనివార్యంగా మోడీ సర్కారు 4జీ టెక్నాలజీని బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇవ్వాల్సిన, త్వరలో 5జీ టెక్నాలజీని కూడా ఇస్తామని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.
పోరాటాల ఫలితంగానే 4జీ సేవలు
బీఎస్‌ఎన్‌ఎల్ ఏర్పడి 25 ఏండ్లు అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణకు కసరత్తు జరుగుతున్నది. మా యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల తర్వాత సంస్థలోని అన్ని సంఘాల ను, అసోసియేషన్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్వహించాం. ఆ పోరాటాల ఫలితంగానే బీఎస్‌ఎన్‌ఎల్ ఉనికిలో ఉంది. కోవిడ్ కాలంలో జీతాలు ఆలస్యంగా చెల్లించడం, కంపెనీని నిర్వీర్యం చేయాలనే కుట్ర జరిగింది. 4జీ, 5జీ సర్వీసులు ఇవ్వకుండా కేంద్రం ఆలస్యం చేసింది. వీఆర్‌ఎస్ పేరుతో 80 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఉద్యోగుల నిబద్ధత, పోరాటాల ఫలితంగా 4జీ సర్వీసు బీఎస్‌ఎన్‌ఎల్‌లోనూ ప్రారంభ మైంది. అయినా, మెరుగైన సామర్థ్యం కోసం కొంత సమయం పట్టవచ్చు. వేతన సవరణ చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతు న్నది. ఇవి స్వాగతించదగిన సంకేతాలు. అయినా, నిరంతర పర్యవేక్షణ, అప్రమత్తత చాలా అవసరం.
బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జూలపల్లి సంపత్‌రావు, కార్యదర్శి గుత్తా సాంబశివరావు