Tuesday, April 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికోద్యమానికి దిక్సూచి 'బీటీఆర్‌'

కార్మికోద్యమానికి దిక్సూచి ‘బీటీఆర్‌’

- Advertisement -

రణదివే క్రమశిక్షణకు మారుపేరు
ఆయన ఆశయాలను కొనసాగించటమే సీఐటీయూ లక్ష్యం
నేటి నుంచి 14వరకు సామాజిక న్యాయ క్యాంపెయిన్‌
బీటీఆర్‌ వర్థంతి సభలో వక్తలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
”కార్మికోద్యమానికి బీటీ రణదీవే దిక్సూచి, విప్లవోద్యమంలో ఆయన అనుసరించిన క్రమశిక్షణా పద్దతులు నేటీ తరానికి ఎంతో అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికోద్యమాన్ని బలోపేతం చేయటమే ఆయనికిచ్చే నిజమైన నివాళి. బీటీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవటమే సీఐటీయూ లక్ష్యం” అని పలువురు వక్తలు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అధ్యక్షతన బీటీఆర్‌ 36వ వర్ధంతిని నిర్వహించారు.ఆ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఉపాధ్యక్షులు ఆర్‌.సుధాభాస్కర్‌, ఎస్‌.వీరయ్య, ఆఫీస్‌ బేర్లర్లు ఆయన చిత్ర పటానికి పూలమాలేసి నివాళర్పించారు.

అనంతరం చుక్క రాములు మాట్లాడుతూ రణదీవే పోరాట పటిమ, సైద్ధాంతిక నిబద్ధత, భారత కార్మికోద్యమానికి దిక్చూచిలాంటిదని చెప్పారు. కార్మికోద్యమ చరిత్రలో బీటీఆర్‌ వ్యక్తిత్వం ప్రత్యేకమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయటమే ఆయనికిచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. భారత కార్మికోద్యమం గురించి మాట్లాడడమంటే రణదీవే గురించి మాట్లాడట మేనన్నారు. జాతీయ ఉద్యమంలో ఆయన పాత్ర మరవలేనిదన్నారు. మార్క్సిజం పట్ల సరైన దక్పదాన్ని అలవర్చుకున్న మహానాయకుడని కొనియాడారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు. కార్మికోద్యమాన్ని క్షేత్ర స్థాయి నుంచి నిర్మించటం లో కిలకపాత్ర పోషించారని చెప్పారు. సీఐటీయూ ఏర్పాటులోనూ దాన్ని వ్యవస్థీకృతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. కార్మిక వర్గానికి ఒక దిక్సూచిగా సీఐటీయూని నిలబెట్టడంలో ఆయన పాత్ర మరువలేనిదని వివరించారు.

కార్మిక సంఘాల ఐక్యత గరిష్ట స్థాయిలో ఉండడానికి ఆయన రూపొందించిన మార్గదర్శనం చారిత్రాత్మకమని చెప్పారు. శ్రామిక మహిళల పట్ల అనుసరిం చాల్సిన వైఖరిపై స్పష్టమైన దృక్పదాన్ని అందించారు. నిరుద్యోగులను ఆర్గనైజ్‌ చేయడం, ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమానికి చాలా ముఖ్యమనీ, సమిష్టి బేరసారాల హక్కు నిలబడాలన్నా నిరుద్యోగ సైన్యాన్ని వదిలేయొద్దనీ, అది కార్మిక సంఘం బాధ్యతని చెప్పారని గుర్తు చేశారు. ఆయన బోధనలు, రచనలను లోతుగా అధ్యయనం చేసి కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. దేశంలో కులం, వర్గం ఈ రెండిటి మధ్యలో ఉండే స్పష్టతను కార్మిక వర్గానికి అర్థం చేయించాలన్నారు. ఆయన అంబేద్కర్‌కు సమకాలీకుడిగా పని చేశారన్నారని గుర్తు చేశారు. సమాజంలోని వివక్షను వర్గ పోరాటాలతో మిలితం చేసి, దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, అస్తిత్వ రాజకీయాలకు లోనవ్వకుండా వర్గ పోరాటంలో అంతర్భాగంగా ముందుకు తీసుకుపోవాలనే సీఐటీయూ అవగాహనను క్షేత్ర స్థాయిలో తీసుకుపోవాలని పిలుపుచ్చారు.

అందులో భాగంగానే ఈ నెల 6 నుండి 14వ వరకు జరిగే సామాజిక న్యాయ క్యాంపెయిన్‌ను జయప్రదం చేయాలని కోరారు. సుధాభాస్కర్‌ మాట్లాడుతూ బీటీఆర్‌ గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఆయన క్రమశిక్షణ గురించే మాట్లాడుకోవాలన్నారు. 1942లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పడు పార్టీ ఆయనపై క్రమశిక్షణా చర్య తీసుకున్నా.. మళ్లీ సాధారణ సభ్యుడిగా వుండి పాలిట్‌ బ్యూరోలోకి వచ్చారని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వదిలేసి అవతల పార్టీలోకి వెళ్ళిపోతున్న వారిని చూస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో బీటీఆర్‌ ఆశయాలకి అంకితమవ్వ డమంటే..ఆయన క్రమశిక్షణను అలవర్చుకోవడమేనని చెప్పారు. వీరయ్య మాట్లాడుతూ ఐక్యత పోరాటం అంటే ఆచరణలో నిరూపించిన నాయకుడు బీటీఆర్‌ అని కొనియాడారు.

ఆయన అంబేద్కర్‌కు సమకాలికుడే కాదు.. ఆయనతో కలిసి అనేక కార్మిక సమ్మెలు, పోరాటాలు నిర్వహించారని గుర్తచేశారు. కులం, వివక్ష, వర్గ పోరాటం గురించి స్పష్టమైన అవగాహన కల్పించిన వ్యక్తి బీటీఆర్‌ అని గుర్తు చేశారు. కులం గురించి పొరపాటు ప్రభావాలకు లోను కాకుండా బీటీఆర్‌ చెప్పిన మార్గాన్ని లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. సామాజిక వారోత్సవాలను సీఐటీయూ ఆ వెలుగులోనే నిర్వహిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఆఫీస్‌ బేరర్లు భూపాల్‌, జె.వెంకటేష్‌, ఎస్వీ రమ, జె.మల్లికార్జున్‌, ఎం.పద్మశ్రీ, విఎస్‌,రావు, కె ఈశ్వర్‌ రావు, కోశాధికారి వంగూరు రాములు, కార్యదర్శులు బి.మధు, కూరపాటి రమేష్‌, బి.మల్లేష్‌, ఎ.జె.రమేష్‌, కాసు మాధవి, ఎ.ముత్యంరావు, పి.శ్రీకాంత్‌, పి.సుధాకర్‌, ఆర్‌.త్రీవేణి, బి,కవిత, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఎ.సునిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -