నీతి, నిజాయితీకి కట్టుబడిన వారికే మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు వేయాలి
ఉపాధ్యాయులకు పిలుపు
టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్
కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యా సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని పెద్ద బీరవల్లి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం 1,28,650 కోట్లు కెటాయించగా ఈ సంవత్సరం 1,39,289 కోట్లు కేటాయించారని తెలిపారు. అంకెల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం బడ్జెట్ దామాషాలో తక్కువగానే ఉందన్నారు. పెరిగిన ధరలతో పోలిస్తే మధ్యాహ్నం భోజనం, సమగ్ర శిక్షకు కెటాయించిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదు అన్నారు. జాతీయ విద్యా కమీషన్ సిఫారసు చేసిన విధంగా బడ్జెట్లో 10 శాతం, జిడిపిలో 6 శాతం కేటాయింపుకు అందనంత దూరంలో ప్రస్తుత కేటాయింపులు ఉన్నాయని విమర్శించారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయడానికి వీలుగా బడ్జెట్ కేటాయింపులు పెంచాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు తగిన విధంగా ఊరట దక్కలేదన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందని ఆశించిన ఉద్యోగులకు ఊరట లభించలేదన్నారు. గత సంవత్సరం తీసుకువచ్చిన ఆదాయపన్ను చట్టం ప్రకారమే పన్ను స్లాబులు ఉంటాయని ప్రకటించటం అన్యాయం అన్నారు. గత 12 సంవత్సరాలుగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచలేదన్నారు. సేవింగ్స్ మొత్తాలపై రిబేటును పెంచలేదన్నారు. పాత విధానాన్ని కొనసాగిస్తూ, కొత్త విధానాన్ని ప్రోత్సహించడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న డిఏలను విడుదల చేయాలని, పిఆర్సిని అమలు చేయాలని, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నీతి, నిజాయితీకి కట్టుబడి ఉండే వారికి ఓట్లు వేయాలని ఉపాధ్యాయలోకానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాలు విజయవంతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, అధికారులు ఉపాధ్యాయులకు తగిన సూచనలు చేస్తూ స్నేహపూరిత వాతావరణంలో కార్యక్రమ విజయవంతానికి కలిసికట్టుగా ముందుకు సాగేందుకు సహకారం అందించాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, బోనకల్ మండల అధ్యక్షులు గార్లపాటి చిన రంగారావు, మండల కోశాధికారి పి .నరసింహారావు, సోషల్ మీడియా కన్వీనర్ ఎం నరేంద్రసింహ, నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు కె సురేష్ , విద్యాసాగర్, కొణిజర్ల మండల నాయకులు మాదాల ప్రసాద్, ఆలస్యం పుల్లారావు, వీరస్వామి, వైరా మండల నాయకులు సుధాకర్, రామకృష్ణ చింతకాని మండల నాయకులు యు నాగేశ్వ రావు తదితరులు పాల్గొన్నారు.



