Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవాస్తవాలకు దూరంగా బడ్జెట్‌

వాస్తవాలకు దూరంగా బడ్జెట్‌

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వల్లే అప్పుల్లో రాష్ట్రం
క్లిష్టపరిస్థితుల్లో బయటపడటం కత్తిమీద సామే
రేవంత్‌ సర్కార్‌కు అగ్ని పరీక్షే : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు


ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వాస్తవాలకు దూరంగా ఉందని, ఇది పాత బడ్జెట్‌ను మళ్లీ చదివినట్టుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చూపిన లెక్కల ప్రకారం రాష్ట్రం రూ.8 లక్షలా 64 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం కత్తి మీద సాము వంటిదని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ జీవిత బీమా పథకం చాలా మంచిదని, అలాగే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగాలకు నిధులు భారీగా కేటాయించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అయితే ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

దృష్టి లోపం వల్ల ఈ రంగాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత బడ్జెట్‌ పూర్తిగా ఖర్చు కాలేదని, సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. అయినప్పటికీ, ఈ బడ్జెట్‌లో రూ. 58 వేల కోట్ల కొత్త అప్పులు తెచ్చేందుకు ప్రతిపాదనలు పెట్టడం ఆందోళనకరమన్నారు. అలాగే, ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బడ్జెట్‌లో స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఉన్న అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరించాలని కూనంనేని కోరారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను పున్ణసమీక్షించుకుని, లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. మొత్తంగా, బడ్జెట్‌ తీపి-చేదుల మిశ్రమంగా ఉందని, అభివృద్ధి కంటే దిగజారుడు అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -